BREAKING NEWS

ప్రతిపక్షం కనుమరుగు కానుందా ...??

గతంలో రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవి. అధికార పక్షం అయితే ... ప్రభుత్వ పనులు , ప్రభుత్వ పథకాలు దగ్గర ఉండి మరీ చేయించేవారు.

ప్రతిపక్షం అయితే వారికి వ్యక్తిగత సహాయం కూడా చేస్తూ , ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనులు అధికారులతో లేదా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుతో మాట్లాడి చేయించేవారు. ప్రభుత్వం ఏమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తే , శాసనసభ , లోక్ సభలలో అభ్యంతరాలు లేవనెత్తే వారు. అవసరమైతే ప్రజా ఉద్యమాలు కూడా చేసి ప్రజలు వారికి అప్పజెప్పిన ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషించేవారు.

ఇలా అనునిత్యం ప్రజలతో మమేకం అయ్యేవారు కనుక గెలిచినా, ఓడినా పెద్దగా బాధపడేవారు కాదు అప్పట్లో. ప్రజలు అధికారం కట్టబెడితే ప్రభుత్వం స్థాపించి ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రి, సహాయక మంత్రి , అధికార ప్రతినిధి, నామినేటెడ్ పదవులు ...ఇలా అనేక రూపాలలో ప్రజలకు చేరువలో ఉండేవారు. ప్రజలు తిరస్కరిస్తే ,,, ప్రతిపక్ష నాయకుని హోదాలో , (ఇది కూడా కేబినెట్ హోదా) పార్టీ అధికార ప్రతినిధి , ప్రతిపక్షాలకు  ప్రభుత్వ పరంగా లభించే కొన్ని  పదవులు మొదలైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటుండేవారు.

నిజానికి అధికార పార్టీ కంటే , ప్రతిపక్ష పార్టీకే ఎక్కువ భాద్యతలు ఉంటాయి. ఇప్పుడు మమ్మల్ని తిరస్కరించారు అంటే ... "మా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం లేదన్న మాట .. కాబట్టి వచ్చే ఎన్నికలలోగా ప్రజలకు అవసరమైన పనులు చేసి ఎలాగైనా వారి విశ్వాసం పొంది అధికారంలోకి రావాలి" అనే కసి ఉండేది. ఫలితంగా ఎప్పుడూ ప్రజలతో ఉంటూ ఆదరణ పొందేవారు. ప్రజల ఆదరణ పొందడమే పరమావధిగా భావించేవారు కానీ పదవి పొందడమే పరమావధిగా భావించేవారు కాదు. కానీ ...

రాను రాను మనుషులలో మార్పు వచ్చింది. పార్టీ ఏదైనా , నియోజకవర్గం ఎక్కడైనా ,ప్రత్యర్థి ఎవరైనా ,ఖర్చు ఎన్ని కోట్లయినా , కులం , మతం , వావి, వరుస , ప్రాంతం లాంటివి అన్నీ "కాసేపు" ప్రక్కన పెట్టేసి , కేవలం వ్యక్తిగత స్వార్ధం తో టికెట్ ఎలాగైనా సాధించాలి అనే ఏకైక లక్ష్యంతో తో ఉన్నారు నేటి అభ్యర్థులు.

వీరిని " నాయకులు " అని కూడా అనకూడదు. ఎందుకంటే .. కష్టమైనా , నష్టమైనా ఒక మాటకు కట్టుబడి ఉండడం , ఒక పార్టీని నమ్ముకుని ఉండడం , ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించ గలగడం మొదలైన లక్షణాలు ఉన్నవారిని " నాయకుడు " అంటాం. అంతేగానీ .. అతనికి టికెట్ ఇవ్వకపోతే , వెంటనే కార్యకర్తల మీటింగ్ పెట్టేసి , ప్రపంచానికి తీవ్ర నష్టం జరిగినట్లుగా చిత్రీకరించి , ఆ పార్టీని తక్షణమే వదిలేసి మరో పార్టీలోకి జంప్ చేస్తున్నారు.

పోనీ అంతటితో అగుతారా ?? ఆ క్షణం వరకు ఉన్న పార్టీ , ఆ పార్టీ అధ్యక్షుడు పూర్తి అవినీతి మయం అని తానొక్కడే పవిత్రుడినని రెచ్చిపోయి మాట్లాడుతారు. ఆ పార్టీ గెలవదని , అది భూ స్థాపితం అయిపోతుందని జోస్యం చెబుతారు.

మరి  ఆ పార్టీ నిజంగా గెలవదు అన్న నమ్మకం ఉన్నప్పుడు ,అక్కడ టికెట్ ఇవ్వలేదని అంత రాద్ధాంతం ఎందుకో అర్ధం కాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియని పరిస్థితులలోనే టికెట్ కోసం గొడవలు పెట్టి పార్టీలు మారిన ప్రబుద్ధులు, తాము ఉన్న పార్టీ ఓడి, మరో పార్టీ అధికారంలోకి వస్తే తట్టుకోగలరా ???

సరిగ్గా అప్పుడు మొదలవుతుంది ..
అసలు సిసలైన రాజకీయ పరిణామం. తాము MLA గా గెలిచి , తమ పార్టీ ఓడిపోతే తక్షణమే అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. వీరితో బాటు ఆ ఓడిన పార్టీలో ఉన్న చిన్నా చితకా అభ్యర్థుల నుండి , ఎంతో కొంత గౌరవం ఉన్న అభ్యర్థులు కూడా అధికార పార్టీలో "  ఎదో " అభ్యర్దించి , ఆ మేరకు హామీ పొంది , క్యూ కడుతున్నారు. 

ఎప్పుడూ ఏదో ఒకటి ""  అభ్యర్ధించడమే "" తప్ప "నాయకుడిగా " ఇది చెయ్యాలి అని ఎప్పుడూ ప్రజల తరపున డిమాండ్ చెయ్యడం అన్నది వీరికి చేతకాదు. అందుకే వీరిని " నాయకుడు" అని కాదు " అభ్యర్థి " అని మాత్రమే పిలవాలి. ఈ విధంగా అధికార పార్టీలోకి వలస వచ్చిన వారికి పదవులు ఇస్తూ  మిగిలిన వారిని కూడా ఆకర్షిస్తూ , ప్రతిపక్ష పార్టీలో ఎవరూ లేకుండా చేసి అధికారం చలాయించేలా కాలం మారిపోయింది. రానున్న కాలంలో అధికార పార్టీ ఒకటే ఉండేలా చట్టాలు చేసినా ఆశ్చర్యం లేదు.

ఎన్నికలు వచ్చేవరకు ఒకే పార్టీగా ఉండి,  ఎన్నికల సమయంలో విడి విడిగా జెండాలు , వారి వారి గుర్తులుపై పోటీ చేసి ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గానూ , మిగిలిన పార్టీల అధ్యక్షులు వారి వారి ప్రాధాన్యతను బట్టి ఉప ముఖ్యమంత్రి , హోంమంత్రి , ఇలా అన్ని పార్టీల MLA లతో మంత్రివర్గం కూర్చి , ప్రశ్నించడానికి నాధుడే లేకుండా పరి పాలించే  పరిస్థితులు అతి తొందరలో రానున్నాయా ....??

Photo Gallery