BREAKING NEWS

వర్తమానం లేని భవిష్యత్తు

చదువు.... ఎంత వరకు అవసరం? చదువే జీవితమా?? చదువు లేకపోతే జీవితం లేదా?? చదువు కన్నా ముఖ్యమైనది జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ప్రస్తుతం విద్యార్థులందరూ కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నారు.

చదువు తర్వాతే ఏదైనా అనే స్థితికి వచ్చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?? తల్లిదండ్రుల దా?? కాలేజీ యాజమాన్యాలదా??? ఏం పని చేసిన మన స్టామినా , ఎంత వరకు చేయగలం అనే విషయాలను అంచనా వేసుకుని చేయాలి. మన స్థాయికి మించిన పనులు చేస్తే మనపై ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా ఒక మనిషి 50 కేజీల బరువు మోయగలగితే అతని పై 200 కేజీల బరువు మోపితే అతని పరిస్థితి ఏమిటి?? ఈ తరం విద్యార్థుల పరిస్థితి అలాగే ఉంది. అవును ... కార్పొరేట్ స్కూల్స్ , కాలేజీలు వచ్చిన తర్వాత నుంచి విద్యార్థులు చదువుకునే రోబోలుగాను , తల్లిదండ్రులు చదువు"కొనే" యంత్రాలు గానూ మారిపోయారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎంత సేపు చదువు చదువు తప్ప వేరే ధ్యాస లేదు... ఉండనివ్వడం లేదు. దీంతో ఒత్తిడి పెరిగిన విద్యార్థులు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం వరకు కాలేజీల్లో "చదువుల" ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల వార్తలు మనం పత్రికల్లో చూశాం... కానీ ఇప్పుడు ఫలితాల విడుదల సమయంలో కూడా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు... దీనికి కారణం ఎవరు?

చదువుల ఒత్తిడి పెంచేది ఫైనల్ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసమే కదా.. సరిగ్గా అక్కడే వస్తోంది అసలు సమస్య. కొంత మంది విద్యార్థులు మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తుంటే మరి కొంత మంది ఫైనల్ పరీక్షల వరకు కష్టపడి చదువుతున్నారు. కానీ తాజాగా తెలంగాణలో జరిగిన మార్కుల అవకతవకల వలన దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ర్యాంకు లే ధ్యేయంగా కళాశాలలు , తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మార్కులు సరిగ్గా రాని/ తప్పుగా వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ మరణాలకు  కారణం ఎవ్వరూ??  నిజంగా మార్కులు / ర్యాంకుల విషయంలో తప్పు జరిగిందే అనుకుందాం... ఆ మాత్రం దానికే ఎంతో విలువైన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?? ఎంతో మంది విద్యార్థులు న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు కదా??? ప్రతి సమస్యకూ చావు ఒక్కటే పరిష్కారం కాదు... ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి... ఆఖరికి పిల్లలను కూడా ఒక రకమైన ట్రాన్స్ లోకి నెట్టేస్తున్నారు తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు... ఎప్పుడో భవిష్యత్తు బాగుంటుందన్న ఆశ చూపిస్తూ వర్తమానంలో అనుభవించాల్సిన ఆట, పాట, సరదాలు, సంతోషాలు కు దూరం చేస్తున్నారు... వర్తమానం లేని భవిష్యత్తు స్టీరింగ్ లేని కారు లాంటిది... వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకుపోవాలి అంటే స్టీరింగ్ ఎంతో ముఖ్యం. అలాగే భవిష్యత్తు బాగుండాలి అంటే వర్తమానం లో జరగాల్సినవి అన్నీ సక్రమంగా జరగాలి.... 

ప్రస్తుతం సొసైటీ లో ఒకరితో మరొకరికి పోలికలు ఎక్కువ అయ్యాయి.. "పక్కింటి అబ్బాయి అన్ని మార్కులు, ఎదురింటి అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయి.. చూసి బుద్ధి తెచ్చుకో... బాగా చదివి మా పేరు నిలబెట్టు..." అంటూ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని రోబోలు గా మార్చేస్తున్నారు. వీళ్ళకి తగినట్లుగానే కాలేజీలు కూడా తయారయ్యాయి... ఇంత కష్టపడి చదివి... అన్ని చిన్న చిన్న సంతోషాలు త్యాగం చేసినా సరే ఫలితం మాత్రం శూన్యం...

అందుకేనేమో అర్ధాంతరంగా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు... డియర్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి... పిల్లల్ని మించిన సంపద మరొకటి ఉండదు. కంటికి రెప్పలా కాపాడుకోండి. కాలేజీ యాజమాన్యాలు కూడా కొంత మానవత్వంతో మెలగండి. డబ్బు సంపాదనే కాకుండా పిల్లల గురించి కూడా కాస్త చూడండి. విద్యార్థులను అలాగే చూడండి. యంత్రాల్లా కాదు... ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులను, రేపటి పౌరులను కాపాడుకుందాం.... 

Photo Gallery