BREAKING NEWS

ఎండలు బాబోయ్ ఎండలు

రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి... ఏప్రిల్ చివరి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అడుగు బయట పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అసలు ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీ సంవత్సరం కన్నా ఈ సారి భానుడి భగభగ లు ఎక్కువయ్యాయి....

సమ్మర్ వచ్చిందంటే చాలు స్కూల్, కాలేజీ విద్యార్థులకు పండగే... సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా... అందుకు.. సెలవుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు అనుకున్నవి అనుకున్నట్టు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెలవులు అయిన సరే గుమ్మం దాటి బయటకు వెళ్ళే అవకాశమే లేదు. అప్పట్లో అయితే ఎండలు కాస్త తక్కువగా ఉండేవి కాబట్టి ఉదయం నుంచే ఆటలు ఆడుకునేవారు.

కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏడాదికేడాది ఎండలు, వేడి పెరుగుతున్నాయి గాని తగ్గుముఖం పట్టే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2 ,3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి.. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప అడుగు బయట పెట్టడం లేదు. 

రోడ్డు మీద టూ వీలర్ మీద వెళ్ళాలి అంటే మంటల్లోంచి వెళ్తున్న ఫీల్ కలుగుతోంది.. ఎండ వేడికి తోడు భరించలేని వడగాల్పులతో ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు వేసవి కాలం అయిపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రధాన జంక్షన్ లు అన్నీ ఖాళీగా, నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 8 అవ్వక ముందే సూరీడు డ్యూటీ ఎక్కేస్తున్నాడు...

దీంతో సాయంత్రం 5 వరకు ఎవ్వరూ బయటకు రావడం లేదు. వ్యాపారం లేక ఆటో వాలాలు ఖాళీగా ఉంటున్నారు... ఈ ఎండల్లో తిరిగే వారికి అవసరం అయిన మజ్జిగ , మంచినీళ్లు అందించేలా అన్ని ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎంత ముఖ్యమైన పని అయినా ఉదయం 10 లోపే ముగించుకుని మళ్లీ సాయంత్రం 5 తర్వాతే బయటకు రావాలి..

లేదా వడదెబ్బ తగిలి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు సరైన తగు   జాగ్రత్తలు తీసుకోవాలి... ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వారే టోపీ, కళ్ళజోడు, మజ్జిగ మనతో పాటు ఎప్పుడూ ఉంచుకోవాలి... 

అయితే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఏమిటి??? ప్రకృతికి కోపం వచ్చిందా.... అవుననే చెప్పాలి. ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు భూమి మీద నేరుగా పడకుండా "ఓజోన్ పొర" అడ్డుగా ఉందని మనం అందరం  చిన్నప్పుడు చదువుకున్నాం. ఓజోన్ పొర బాగుండాలి అంటే చెట్లు ఎక్కువగా పెంచాలి... ఇది కూడా అందరికీ తెలుసు.

జోక్ ఏంటి అంటే నరికేయడం మాత్రమే తెలిసిన మనకు చెట్లు నాటడం, కాపాడటం ఎక్కడ నుంచి తెలుస్తాయి లెండి. మనకు ఏ చిన్న అవసరం ఉన్నా చెట్లు నరికేస్తున్నాం. ఇల్లు కట్టాలి అన్నా, కలప కావాలి అన్నా చెట్లు కట్ చేసేస్తాం. నరకడం ఏముంది.. గంట పని , కానీ తిరిగి అదే చెట్టు పెరగాలి అంటే సంవత్సరాల కాలం పడుతుంది.

చెట్లు లేకపోతే భవిష్యత్తులో ఎండ వేడి, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా మేల్కొని మన బాధ్యత తెలుసుకుందాం.... మాటల్లో కాదు.. చేతల్లో చూపిద్దాం... మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచుదాం... మన తర్వాత తరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందిద్దాం... ..  

Photo Gallery