BREAKING NEWS

అంగడిలో ఆహారం - విషమా ???

ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లోనూ,మరికొన్ని సార్లు సరదాగానూ హోటల్స్ లో ప్రతిఒక్కరూ ఆహారాన్ని తినక తప్పడం లేదు ఈ రోజుల్లో... ముఖ్యంగా పై ఊర్లు వెళ్లేవారు , ఆసుపత్రిలో ఉండేవారు ఈ హోటల్స్ పై ఆధారపడక తప్పడం లేదు ..

గత కొన్నాళ్లనుండీ నిర్భయంగా , స్వేచ్ఛగా హోటల్స్ లో తినడం అలవాటయ్యంది గానీ , అంతకు పూర్వం మాత్రం హోటల్స్ లో తినడం అవమానకరంగా భావించేవారు. అసలు ఆ అవసరం వచ్చేది కాదు. చక్కగా ఇంట్లోనే అన్ని వంటకాలు రుచికరంగా చేసేవారు ఆ ఇంటి గృహిణులు.అప్పట్లో అంత ఓపిక ఉండేది వారిలో ..

ఇక ఎవరైనా కాస్త సరదాగా బయట ఏదైనా తిందాం అనిపించి వెళ్ళినప్పుడు హోటల్ ముందు తచ్చాడుతూ తనని ఎవరూ గమనించడం లేదనిపించాక చటక్కున లోపలకు దూరిపోయేవారు ..

కాలం మారింది... తిరగలిలో విసిరి , రోట్లో దంచి , రుబ్బి , కట్టెల పొయ్యి , లేదంటే బొగ్గుల కుంపటి పై ఓపిగ్గా చేయగలిగే పరిస్థితి నుంచి  గ్రైండర్ , మిక్సీ,కుక్కర్ , ఎలక్ట్రికల్ కుక్కర్ , పాన్ వంటివి ఉపయోగించి గ్యాస్ స్టౌవ్ , లేదా ఎలక్ట్రికల్ స్టౌవ్ ల పై సునాయాసంగా చిటికెలో తయారుచేసే కాలం లోకి అడుగు పెట్టాం. రొట్టెలు చెయ్యడానికి , కాఫీ కలపడానికి , అంట్లు తోమడానికి , బట్టలు ఉతకడానికి , ఇల్లు తుడవడానికి  ఒకటేమిటి ఇలా అన్ని పనులు చేయడానికి మిషన్స్ వచ్చేసాయి.

కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరలు ఏరి , చిక్కుడు కాయలు వంటివి ముక్కలుగా చేసి మరీ అమ్ముతున్నారు. కొన్నాళ్ళు ఈ సౌకర్యాలతో వంటలు చేసేవారు గృహిణిలు. మళ్ళీ కాలం మారింది..ఇంట్లో గృహిణి కూడా ఉద్యోగం చేయడం , కావలసినవి వండి - వడ్డించడానికి తగినంత సమయం, ఓపిక రెండూ లేకపోవడంతో ఉదయం టిఫిన్, సాయింత్రం స్నాక్స్ బయటి హోటల్స్ నుండి తెచ్చుకోవడం అందరిళ్ళల్లో అతి సాధారణ విషయం అయిపోయింది. మరికొంచెం ముందుకొస్తే ..

కేవలం అన్నం ఒక్కటి ఆదరా బాదరాగా వండేసుకుని కూరా, సాంబారు లాంటివి కూడా బయటనుంచి తెచ్చుకోవడం మొదలయ్యింది... మనం స్వయంగా వెళ్లి తెచ్చుకోవాలి కనుక ఓపిక లేక కనీసం ఆ కారణంగానైనా ఇంట్లోనే ఏదో ఒకటి చేసేవారు. కాబట్టి కొన్నాళ్ళు అలా నడిచింది . మళ్ళీ కాలం మారుతుంది కదా అదిగో .. అలా మారిన నేటి కాలంలో స్విగ్గి అనో, జమోటో అనో మరోటి అనో ఆన్ లైన్ యాప్ లు అందుబాటులోకి వచ్చి , మనం ఇల్లు కదలక్కర్లేకుండా మనకు నచ్చిన హోటల్ నుండి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు చిటికెలో బాయ్ తలుపు తట్టి చేతిలో పెట్టె రోజులు వచ్చాయి.

ఇంకేముంది అలా అలా ఫుడ్ బిజినెస్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. సరిగ్గా అదే ... వ్యాపారులకు  వరంగా మారింది. అయితే ఇంటికి తెప్పించుకోవడం లేదా మనమే వెళ్లి తినడం. ఎప్పుడో ఓ సారి హోటల్ ఫుడ్ తినే రోజులు పోయి ఎప్పుడో ఓ సారి ఇంటి ఫుడ్ తినే రోజులు వచ్చాయంటే అతిశయోక్తి కాదేమో ...

ఇంకేముంది ??? ఫుడ్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాలు ఎలా ఉన్నాయని కానీ వంట చేసే ప్రాంతం ఎలా ఉందని కానీ శ్రద్ద పెట్టడం లేదు.

ఏదో కొంతలో కొంత శాఖాహారం వరకు కొంత నయం కానీ... నాన్ వెజ్ విషయానికి వస్తే అసలు చెప్పలేము ... బల్క్ గా ఒకేసారి వండేయడం , సేల్ అవగా మిగిలినది ఫ్రిజ్ లో తోసేయడం , మళ్ళీ మర్నాడు అదే తీసి వేడి చేసి కస్టమర్లకు వడ్డించడం , దానినే లొట్టలేసుకు తినడం... జరుగుతోంది. కొన్నిసార్లు అయితే కుళ్లి పోయినవి కూడా తినడానికి వడ్డిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ... సంబంధిత అధికారులు ఎప్పుడో ఓ సారి మాత్రం తనిఖీ చేసి తప్పు చేసినవారికి కేసులు వ్రాయగలరే కానీ రోజూ ఒక్కో హోటల్ దగ్గర ఒక్కో అధికారి కాపలాగా ఉండలేరు కదా ..

ప్రతీ వినియోగదారుడు హోటల్ ను , కిచెన్ ను చెక్ చేసుకోవచ్చు అని చట్టం చెబుతున్నా ఈ విషయం చాలామందికి తెలియదు. తెలిసిన ఒకరో ఇద్దరో హోటల్ కు వెళ్లి చెక్ చేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ??? 

అందుకే .. దీనికి చక్కని పరిష్కారం .. " CC TV కెమెరాలు " అవును. పోలీస్ వారి నిబంధనల ప్రకారం ప్రతి చోట ఈ కెమెరా లు అమర్చి తీరాలి.వీటి వలన ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం గానీ యాక్సిడెంట్ గానీ నేరం గానీ దొంగతనం గానీ జరిగితే .. తెలుసుకోవచ్చు. అలాగే ... జరిగిపోయిన దానిని తెలుసుకోవడానికి ఉపయోగించే బదులు జరుగుతున్న ప్రమాదాన్ని ప్రత్యక్షంగా కస్టమర్లు తెలుసుకునే విధంగా కెమెరా లను వినియోగించొచ్చు కదా ..

అదెలా అంటే ... ప్రతీ హోటల్  వంటగదిలో , ఆహార పదార్ధాలు నిలువ ఉంచే ఫ్రిజ్ లలో , సరుకులు భద్రపరిచే స్టోర్ రూమ్ లలో విస్తారంగా కెమెరాలను అమర్చి ,  వంట చేసే విధానం ప్రత్యక్షంగా వినియోగదారుల కు స్పష్టంగా కనబడేలా LED లు అమార్చాలి. అప్పుడు అందరికీ కనబడుతోంది కనుక పూర్తి జాగ్రత్త వహిస్తారు. కొన్ని హాస్పిటల్స్ లో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్ బంధువులకు లైవ్ చూపించే ఏర్పాటు ఇప్పటికే ఉంది.

పోలీస్ అధికారులు చెప్పినట్లుగా ఒక CC TV కేమెరా 100 మంది పోలీసులకు సమానమైనట్లే , ఇక్కడ ఒక కెమెరా కూడా అంతకు మించిన అధికారులకు సమానం. ఎప్పుడో పనికొస్తుంది అని వాడుతున్న కెమెరాల కంటే కూడా కలుషిత ఆహారం తిని తద్వారా అనారోగ్యం కు గురి అవకుండా ఉండడానికి  వాడే కెమెరాలు అత్యంత ఉపయోగబడతాయి కదా. సో ... ఈ వైపుగా అధికారులు స్పందిస్తే , ఫుడ్ వ్యాపారుల బారి నుంచి ప్రజలను కాపాడిన వారవుతారు...

Photo Gallery