BREAKING NEWS

రథ సారధి మార్పు అవసరమా?"మార్పు" అనేది చారిత్రక పరిణామ క్రమంలో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. మానవ జీవన విధానం లో నిత్యం ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది "మార్పు" ను అంత సులభంగా అంగీకరించలేరు.  మారుతున్న పరిస్థితులకు తగినట్లు తమను తాము ఇముడ్చుకోలేక ఆ పాత రోజులే ఎంతో మధురం అంటుంటారు. నిజమే.... గడచిన కాలం ఎప్పుడూ మధుర జ్ఞాపకం గానే ఉంటుంది. ఎందుకంటే అప్పటి కష్టాలన్నింటినీ దాటేశాం కాబట్టి. అలా అని గతంలోనే ఉండిపోకుండా, మారిన జీవన‌ పరిస్థితులకు అనుగుణంగా మనము మారి జీవితాన్ని ఆస్వాదించాలి. 
                  
"మార్పు" అనే పదం చాలా గమ్మత్తైనది. రాజకీయాలలో ఈ " మార్పు " అన్న పదం అతి చురుకైన పాత్ర పోషిస్తోంది‌. రాజకీయ నాయకులకు అతి సులభమైన, రెడీమేడ్ " నినాదం " గా మారింది. ప్రతి ఒక్కరూ ఏ విధంగా తీసుకొస్తారో , దాని "రూట్ మ్యాప్" ఏంటో చెప్పకుండానే తాము "మార్పు" తీసుకొస్తాం ‌లేదా ప్రజలు "మార్పు" కోరుకుంటున్నారు వంటి ప్రసంగాలతో ప్రజలను "ఏమార్చే" ప్రయత్నాలలో ఉంటున్నారు.  
                    
"మార్పు" కు నిజమైన ప్రతిరూపంగా " గొంగళి పురుగు "  నుండి ఎదిగిన "సీతాకోక చిలుక" జీవిత చరిత్ర కు మించిన ఉదాహరణ లేదు. సీతాకోక చిలుక తనకు అవసరమైన, అనుకూలమైన మొక్కల ఆకుల పై గుడ్లు పెట్టిన తర్వాత, లార్వా గా ఎదిగి బయటకు వస్తుంది. దగ్గర నుండి బాగా గమనిస్తే గుడ్డు లోపల లార్వా (గొంగళి పురుగు) ఎదిగే క్రమం కనబడుతుంది. తాను పుట్టిన మొక్క ఆకుల్ని బాగా తిని, లోపల మరో చర్మపు పొరగా పెరిగి  బయటి చర్మాన్ని చీల్చుకుని  ప్యూపా దశకు చేరుతుంది.

ప్యూపా దశలో, పైకి కేవలం విశ్రాంతి తీసుకున్నట్లు కనబడినా , ప్యూపా అంతర్భాగాలు అతి వేగంగా "మారుతూ" ఉంటాయి. చివరకు కొన్ని వారాలలో అన్ని మార్పులు పూర్తయ్యాక ప్యూపా నుంచి రెక్కలు ఆడించుకుంటూ అదమైన సీతాకోక చిలుక ఉధ్భవిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కి రకాన్ని బట్టి నెల నుండి సంవత్సర కాలం పడుతుంది. 

అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే "మార్పులు" సంభవించే సీతాకోక చిలుక అంతర్దశల్లో ఆ లార్వా లేదా ప్యూపా కి ఆధారమైన, ఆహారమైన "మొక్క"లను ఆకులను మధ్యలో "మార్చకూడదు".  అలా మారిస్తే ఆ లార్వా కు అవసరమైన ఆహారం అందక అప్పటి వరకు ఎదుగుతున్న జీవి కాస్తా మధ్యలోనే మరణిస్తుంది.
 
కాబట్టి ఏ ఒక్క మార్పు కూడా ఏక రాత్రి‌లో ఎవ్వరూ తీసుకురాలేరు అని అందరికీ గ్రహించాలి. జరుగుతూ ఉండగా  "మార్పు" ను ఎవ్వరూ గమనించలేరు‌. ఎందుకంటే మార్పు అనేది‌ రిలేటివ్ టెర్మ్. గతంతో పోల్చి చూసినప్పుడే  జరిగిన "మార్పు" మనకు అవగతమవుతుంది. ఉదాహరణకు రోజూ అద్దంలో ముఖం చూసుకునే మనకు, చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రుడు చెబితే గానీ మనలోని "మార్పు" మనకు తెలియదు. అలాగే నిత్యం అక్కడ నివాసం ఉండేవాళ్ల కన్నా కొన్ని సంవత్సరాల తర్వాత సొంత ఊరికి వెళ్లిన వారికే ఆ ఊరి అభివృద్ధి కన్పిస్తుంది. కాబట్టి "మార్పు" అనేది కాలంతో ముడిపడి ఉన్న ప్రక్రియ తప్ప ఎవరో ఉన్నపళంగా తీసుకు వచ్చేసేది కాదు.
 
మార్పు అన్ని వేళలా మంచిదికాదు.  వేగంగా గమ్యం దిశగా సాగుతున్న బండి దిశ "మార్చాలనుకోవడం" అవివేకం అవుతుంది‌.కాబట్టి దశ దిశ లేని  "మార్పు"  నినాదాలకు ఏమారకుండా,  అభివృద్ధి రథ చక్రాలను సరైన దిశలో పరుగులు పెట్టిస్తున్న "సారథి" ని మార్చకుండా కొనసాగిస్తేనే, వివిధ "దశల్లో" ఉన్న "కార్యక్రమాలు" పరిపక్వం చెంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లో ఒక "గొప్ప" మార్పు ను చూడగలం...

Photo Gallery