BREAKING NEWS

ఉచితాల నాయకుడు కాదు

పథకాలు....  ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధి కి ప్రభుత్వాలు చేపట్టే కార్య క్రమాలు. ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్నో, ఎన్నెన్నో పథకాలు అమలు చేసారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. ఈ పథకాలన్నింటి ముఖ్య‌ ఉద్దేశం ప్రజా జీవనాన్ని మెరుగుపరచి వారి స్థాయిని పెంచడం. ఇంకా రాష్ట్రాన్ని/దేశాన్ని  వనరుల పరంగా, ఆర్థికంగా, వ్యవస్థాగతంగా అభివృద్ధి చేయడం.
                      
ఇప్పటి వరకు మన (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం లో ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టబడ్డాయి. ఈ పథకాలను రెండు రకాలు. 1) అభివృద్ధి పథకాలు, 2) సంక్షేమ పథకాలు.  
                     
హై-టెక్ సిటీ, రోడ్లు, వంతెనల నిర్మాణాలు,  పోలవరం, పట్టిసీమ వంటి నీటి పారుదల ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ‌ మున్నగు కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పరంగా, ఆర్థిక పరిపుష్టి సాధించి, రాష్ట్రం స్వయం‌ ప్రతిపత్తి సాధించడానికి ఉపయోగపడేవి 'అభివృద్ధి" పథకాలు.
                
కిలో రెండు రూపాయల బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణం,  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణ‌మాఫీ, ఉచిత‌ విద్యుత్తు, అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, మొదలగునవి ప్రజల‌ అవసరాలను ప్రభుత్వాలే తీర్చే "సంక్షేమ పథకాలు".
               
అయితే ఈ రెండు రకాల పథకాలలో ప్రజలను ఆకర్షించేవి అంటే అవి సంక్షేమ పథకాలే. అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం సగటు ఓటరుకు అవగతం కాదు.‌ ఎందుకంటే వాటి వల్ల తనకు ఉన్నపళంగా వచ్చే వ్యక్తిగత ప్రయోజనం ఉండదు.

 ఈ సంక్షేమ పథకాలపై ప్రజలు ఆధారపడి, అలవాటు అయ్యేలా‌ చేసి, సంక్షేమ పథకాలే పరమావధిగా, ఉచితంగా ఇచ్చేవాడే "దేవుడు" గా ప్రజలు కీర్తించే స్థాయికి తీసుకు వచ్చాయి కొన్ని ప్రభుత్వాలు. అయితే ఇక్కడ ప్రజలు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే, అంత కన్నా ముందు రాష్ట్రం ఆర్థికంగా, వనరుల పరంగా, అభివృద్ధి చెందాలి. సంపదను సృష్టించుకునే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ఏ సంక్షేమమైనా అమలు చేసే శక్తి ఆ రాష్ట్రానికి కలుగుతుంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు ఎడాపెడా సంక్షేమ పథకాలు ప్రకటించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అంటే అభివృద్ధి, సంక్షేమాలు జోడు గుర్రాల లాగా సమన్వయంతో జరగాలి.
 
అసలు ఒక రాష్ట్ర (లేదా దేశ) గమనం సరైన దిశలో ఉందనటానికి కొలమానం ఏంటంటే సంక్షేమ పథకాల " అవసరం " తగ్గుతూ వచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతూ రావాలి. అలా లేని నాడు ఈ సంక్షేమ పథకాలు అన్నీ, ప్రజలను నిరంతరం తమపై ఆధారపడేలా చేసుకునే " రాజకీయ అవసరాలు " గానే ఉపయోగపడతాయి. దశాబ్దాల తరబడి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నా, ఇంకా ఇంకా వాటి అవసరం పెరుగుతోందంటే అది కచ్ఛితంగా విధాన వైఫల్యంగానే చెప్పాలి.

ఇందుకు ఒక రకంగా ప్రజల బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అభివృద్ధి, వికాస కార్యక్రమాలను గుర్తించకుండా, కేవలం విచ్చలవిడిగా ప్రకటించే సంక్షేమ ఉచితాలు అందించే నాయకులకే ఆకర్షితులై,  , రాజకీయ పార్టీలన్నీ పోటీ పడి మరీ అవసరం లేని ఉచితాలు ప్రకటించే అత్యవసర స్థితిని ప్రజలే పార్టీలకు కల్పిస్తున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో గమనిస్తే "ఉచితాలు" ఇచ్చే సంక్షేమాలు అక్కడ కనబడవు.
            
కాబట్టి ప్రజలు కేవలం అనవసరమైన రకరకాల సంక్షేమ పథకాల ప్రకటనలకు ఆశ పడి, ఆకర్షితులవకుండా, ప్రభుత్వాలపై నిరంతరం ఆధారపడకుండా వ్యవస్థాపరంగా,  ప్రజలు తమ "సంక్షేమాన్ని" తామే చూసుకునే స్థాయికి వారు "అభివృద్ధి" చెంది,  వారి కాళ్లపై వారే నిలబడేలా ప్రజా వికాస‌ పథకాలను అందించే, "నిజమైన" ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే అభివృద్ధి కాముక నాయకులను, పార్టీని ఎన్నుకోవాలి...

Photo Gallery