BREAKING NEWS

డిసైడింగ్ డే - రేపే ఎలక్షన్స్

రేపే ఎలక్షన్స్,,. ఎందరో అభ్యర్థులు,, ఎన్నెన్నో విశ్లేషణలు, విమర్శలు, ప్రచార ఆర్భాటాలు, మ్యానిఫెస్టోల మాయాజాలాలు..... ఈలోగా అభ్యర్థులను కంపేర్ చేయండి, మంచివాడికే వోటు వేయండి అంటూ సోషల్ మీడియాలో ఉపన్యాసపు పోస్టింగులు..... కానీ మంచి అంటే క్రైటీరియా ఏంటి, ఏవిధంగా ఎనలైజ్ చేయాలో సగటు వోటరుకి అర్థం కాని స్థితి.

అభ్యర్థిని చూసా, అధినేతను (ముఖ్యమంత్రి అభ్యర్థి) చూసి వోటు వేయాలా అంటే ప్రస్తుత పరిస్థితులలో అధినేతను దృష్టిలో పెట్టుకునే వోటు వేయడం అవసరం... ఎందుకంటే నాయకుడు సరైన సమర్థుడైతేనే క్రింది వాళ్ల చేత సరిగ్గా పని చేయించగలడు. కమ్యూనికేషన్ విప్లవం వచ్చి నేరుగా ముఖ్యమంత్రి తో కాంటాక్ట్ కాగలిగే ఈ రోజుల్లో అభ్యర్థి కన్నా, అధినేతే ముఖ్యం, ఆ అభ్యర్థి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయితే తప్పించి.

ఇంక మంచీ, చెడూ, నీతి, అవినీతి వగైరాలు వారిని దగ్గరి‌ నుండి చూసినవారికి తప్ప కేవలం వార్తాపత్రికలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ పై ఆధారపడే సామాన్య వోటరుకి నిజనిజాల నిర్ధారణ అంత సులభం కాదు. ఎవరు ఏ పనిని ఎంత బాగా చేసినా అందరినీ సంతృప్తి పరచలేరు. నూరుశాతం ఎఫిషియన్సీ సాథ్యం కాదు.  ఇప్పటి వరకు ఏ పనీ చేయనివాడు మాత్రమే అత్యంత "పర్ఫెక్ట్" గా కన్పిస్తారు. కాబట్టి ఏదో ఒక్క అంశంలో కేవలం ఎదుటి వారు చేసే విమర్శలు పరిగణనలోకి తీసుకుని మన నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఒకరిని ఒకరు ప్రతి విషయానికి విమర్శలు చేసుకోవడం సహజం. అది వారికి రాజకీయ అవసరం కూడా.. కానీ ప్రజలు మాత్రం ఆ మాయా వలలో పడిపోకూడదు. విచక్షణతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
            
మనకున్న వనరులతోనే ఎవరు కరెక్ట్ అన్నది మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే మనం ఆలోచించాల్సిన కొన్ని ప్రమాణాలు :

** కష్టపడే తత్వం & బాధ్యత : 

నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కష్టపడతారు, అధికారంలో బాధ్యత కలిగి ఉండాలి.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షమంత బాధ్యత , అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షమంత శ్రమ నాయకుడికి ఉండాలి. అటువంటి లక్షణాలు మనం నాయకుల వ్యవహార శైలిని బట్టి గ్రహించవచ్చు.

** పట్టుదల మరియు సహనం :

మనం ఏ పని మొదలు పెట్టినా దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆ పనికి ఎంతో సమయం పట్టొచ్చు. అయినప్పట్టకీ చలించక ఓర్పుతో, సహనంతో అనుకున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. పట్టుదలగా  పని చేయాలి. ఈ విషయం నాయకుల పథకాల సరళి, వారి గత కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది. 

** ముందు చూపు : 

నాయకుడికి తక్షణ ఫలాలిచ్చే కార్యక్రమాలతో పాటు భవిష్యత్ లో రాబోయే సమస్యలు, అవసరాలు గుర్తించి, అందుకు తగిన ప్రణాళిక , కార్యాచరణను ఇప్పటి నుంచే ఆరంభించే దూర దృష్టి, దార్శనికత ఉండాలి. ఈ విషయాలలో ఇతరులకు ఇప్పుడిది అవసరమా అనిపించినా, దీర్ఘ కాలంలో ఆ కార్యక్రమం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి.  గతంలో వారి కార్యక్రమాలను, దాని వల్ల నేడు మనం అనుభవిస్తున్న ఫలాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది.  

** ఆత్మ విశ్వాసం :

మనం ఎంతో ఉన్నతాశయంతో ఒక బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఎంతోమంది వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. రాజకీయాలలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అవతలి వారికి ఎక్కడ పేరొచ్చేస్తుందో అని అడుగడుగునా ఆటంకాలు కలిగించడానికి, నిరుత్సాహ పరచడానికి ప్రయత్నిస్తూంటారు. అయినా సరే, నాయకుడు ఇవి వేటికీ బెదరకుండా, అచంచల ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. మనం చెయ్యగలం అనే విశ్వాసాన్ని తోటి వారికీ కలిగించి ఉత్సాహపరచాలి‌. ఈ విషయాన్ని ఆ నాయకులు ఇచ్చే ప్రసంగాలలో కన్పిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారి మాటతీరు స్పష్టంగా, బల్లగుద్దినట్లు ఉంటుంది. ఇది చేసి తీరుతాం అన్న భావన వారి కళ్లల్లో కన్పిస్తుంది. ఎంత నటించినా ఈ తేడాని మనం సులభంగా గుర్తించవచ్చు.

**  హుందాతనం, భావోద్వేగ సంయమనం, స్థితప్రజ్ఞత:

నాయకుడికి తన భావోద్వేగాల పట్ల ఖచ్చితమైన అదుపు ఉండాలి. రకరకాల పరిస్థితులలో కూడా సంయమనం కోల్పోకుండా, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే స్థితప్రజ్ఞత ఉండాలి. ఎవరు ఎంతలా రెచ్చగొట్టినా, పరుష పదజాలంతో దూషించినా, హుందాతనం కోల్పోకుండా వారికి సరియైన,‌ మర్యాద పూర్వకమైన సమాధానమిచవ్వగలగాలి. అంతే గానీ సభ్యత కోల్పోయి, అభ్యంతరకర భాష, ఒక బాధ్యత కలిగిన నాయకుడు మాట్లాడకూడదు. ఇది మనం అతి సులభంగా తెలుసుకోగలం.

** వ్యూహ రచన :

ఏ పనిలో‌ అయినా విజయం సాధించాలంటే వ్యూహాత్మక కార్యాచరణ తప్పనిసరి. రాజకీయాలలో వ్యూహం అంటే కుట్ర అని కాదు అర్థం. వివిధ విషయాలలో రాష్ట్రాల మధ్య పోటీలో విజయం సాధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ప్రారంభించిన కార్యక్రమాలు సరైన పద్ధతిలో అమలు జరగడానికి వ్యూహ రచనా నైపుణ్యం అవసరం. ఇది మనం ఈ సమయంలోనే అంటే ఎన్నికల వేళ, పార్టీ విజయానికి వేసే వ్యూహాలలో చూడవచ్చు. చట్టపరంగా, రాజ్యాంగ బద్ధంగా సరైన వ్యూహాలు అమలు చేయడం ఎన్నికలలో తప్పు కాదు. ఎందుకంటే సొంత పార్టీ ప్రయోజనాలే కాపాడుకోలేనివాడు, రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడగలడు ?

** అనుభవం :

నాయకుడికి అనుభవం అవసరం మరియు అదనపు బలం. గతంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు, మళ్లీ సమస్యలు వచ్చినప్పుడు సులువుగా అధిగమించగలడు. అందుకే " కొత్త వైద్యుడి కన్నా పాత పేషెంట్ యే నయం " అనే‌ నానుడి. అందులోని క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక్క అవకాశం ఇవ్వడం కన్నా అనుభవమే అత్యవసరం. 

** పరపతి మరియు పరిచయాలు: 

నాయకుడెప్పుడూ అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలి. వారితో అవసరం ఏముందిలే అనుకోకుండా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. దేశ, విదేశీ నాయకులు, పారిశ్రామికవేత్తల వద్ద మంచి ఇమేజ్ ఉండాలి. అలాగని మన ప్రయోజనాలను భంగం కలిగించినప్పుడు సరైన సమయంలో వారితో విబేధించి పోరాడే సామర్ధ్యం ఉండాలి. ఇవన్నీ ఎవరికున్నాయో కొద్దిపాటి పరిశీలనతో తెల్సుకోగలం.

** క్రైసిస్ మేనేజ్మెంట్ :

ఏవైనా అనుకోని విపత్తులు, వైపరీత్యాలు ఎదురైనప్పుడు చేతులెత్తేయకుండా, సత్వర పునరుద్ధరణ సాధించగలగాలి‌. హుదూద్, తిత్లీ వంటి ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించి ప్రజలకి అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని, భరోసాని కలిగించాలి. వేగవంతమైన పునరుద్ధరణ చేయాలి. దీనికి విశాఖ, శ్రీకాకుళ వాసులు స్వయం అనుభూతులే..

** డైనమిజం మరియు అడాప్టబిలిటీ :

నాయకుడు ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానం పెంచుకుంటూ, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను , టెక్నలాజికల్ అభివృద్ధిని పరిశీలిస్తూ మన పరిపాలనలో టెక్నాలజిని ప్రజా జీవనాన్ని సులభతరం చేసి, పరిపాలనలో పారదర్శకత కలిగి ఉండాలి. 


ఇంక నీతి, నిజాయితీ : అయ్యకి విద్యా లేదు, గర్వం లేదు అన్న చందాన ఇప్పటి వరకు ఏ అధికారం లేనివారు ఎలాగో ఈ నీతి, నిజాయితీ అనే నినాదాలెత్తుకుని సులువుగా ప్రజలలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ నాయకుడొక్కడూ నిజాయితీపరుడైతే సరిపోదు, 175 మంది ఎమ్మెల్యేలు, లక్షల మంది ప్రభుత్వ అధికారులూ, ఉద్యోగులు, ముఖ్యంగా 10 రోజుల పని 2 రోజుల్లోనే చేయించుకోవడానికి లంచం ఇచ్చే కోట్లాది ప్రజలు నిజాయితీగా ఉన్నప్పుడే నీతి నిజాయితీలు స్థాపించబడతాయి. ఎందుకంటే ఒకప్పుడు రాచరికంలో "యథా రాజ తథాప్రజా" అనేవారు, కానీ మనది ప్రజాస్వామ్యం కాబట్టి "యథా ప్రజా తథా రాజా" అన్నట్లు. అయినప్పటికీ కేవలం అవినీతి మాత్రమే చేయాలనుకుంటే అధికారానికి వచ్చాక కూడా శారీరక శ్రమ చేయక్కర్లేదు.  కేవలం రాష్ట్రం పట్ల నిజమైన బాధ్యత ఉంటేనే కష్టపడతాడు.
                    
కాబట్టి కేవలం బేస్‌లేని నీతి, నిజాయితీ లాంటి మాటలకి పడకండి. చిన్న చిన్న విషయాలకు అసంతృప్తి చెందకూడదు. వంద శాతం ఎఫిషియన్సీ ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్ట పైన తెలిపిన లక్షణాలను "నిజాయితీ" గా, నిష్పక్షపాతంగా అంచనా వేసుకుని ఎవరి పేరు స్ఫురిస్తే వారినే ఎన్నుకోండి....

Photo Gallery