BREAKING NEWS

ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం...!

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి. అనేక ప్రాంతాలలో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. పేర్లు వేరైనా పద్దతులు వేరైనా ఎంతో ఆనందంగా వివిధ ప్రాంతాల్లో ఉగాది పండుగని జరుపుకుంటారు. అయితే వసంత రుతువు ఆగమనం ప్రారంభమైన రోజున ఆంధ్ర కర్ణాటక లో ఉగాదిగా జరుపుకుంటారు. అదే మహారాష్ట్ర లో దీనిని గుడి పడ్వా అంటారు. తమిళ వాళ్ళు  పుత్తాండు అని అంటారు. మలయాళీలు విషు అంటారు. పంజాబీ లో వైశాఖి అని బెంగాలీలు పొయ్లా బైశాఖ్ అని అస్సామీలు బిహు అని ఇలా ఏ ప్రాంతాల ప్రజలు ఆ ప్రాంతం బట్టి  అంటారు.
 
 ఇలా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఉగాదిని జరుపుకుంటారు. అయితే తెలుగు వారి పద్ధతి ఎలా ఉంటుంది..?, ఉగాది నాడు మనం ఎటువంటి ఆచరించాలి..? ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం...! మరి ఇక ఆలస్యమెందుకు ఉగాది గురించి అనేక విషయాలు ఈరోజు చూసేయండి..!
 
ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవడం. ఆరోజున రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని ప్రజలు పండితులు చేత పంచాంగ శ్రవణం చేషిస్తారు.
 
 ఉగాది నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు:

 
ఒక్కొక్క పండుగ కి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఉగాది పండుగ కూడా ఒక పద్ధతి ఉంది. ఉగాది అంటే అందరికీ  గుర్తొచ్చేది అందరూ ఇష్ట పడేది, ఎంతో ముఖ్యమైనది ఉగాది పచ్చడి.
 
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత :
 
ఉగాది పచ్చడి భావాన్ని తెలిపేది. ఉగాది పచ్చడి లో షడ్రుచులు కలిపి ఉంటాయి. అయితే ఈ జీవితం అన్ని అనుభవాలని కలిగినది అని ఉగాది పచ్చడి సూచిస్తుంది. దీనిలో మనం ఆరు రుచులు వేసుకుని తయారు చేసుకుంటాము. బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారం.
 
 ఈ ఆరు రోజులు కూడా ఉగాది పచ్చడి లో ఉంటాయి. ఏ పదార్థం ఏ భావాన్ని సూచిస్తుంది అనే విషయానికి వస్తే... బెల్లం తీయగా ఉంటుంది కదా అది ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితం లో ఉత్సాహం కి సంకేతం. అలానే  వేప పువ్వు చేదు గా ఉంటుంది కదా. అది బాధ కలిగించే అనుభవానికి సంకేతం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది ఇది నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు కి సంకేతమని చెప్పొచ్చు. అలాగే పచ్చి మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి కొత్త సవాళ్ళను ఎదుర్కోవాలి అని అది దానికి సంకేతం. కారం సహనం కోల్పోయి చేసే పరిస్థితికి సంకేతం. ఇలా ఉగాది పచ్చడి ఇంత పెద్ద అర్ధాన్ని సూచిస్తుంది.
 
ఉగాది పుట్టుక :
 

అసలు ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది..? నిజంగా ఇది వరకు రోజుల్లో ఉగాది పండుగ చేసుకునే వారా..? అనే విషయానికి వస్తే.... ఒక కథనం ప్రకారం సోమకాసురుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం లో వెళ్లి సోమకాసురుడు వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మ దేవుడికి అప్పగించారట. ఆ రోజునే ఉగాదిగా మనం జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి.
 
ఉగాది రోజు చేయవలసిన పనులు:
 
ఉగాది రోజు కొత్త సంవత్సరం వస్తుంది. దీనిని మనం ఎంతో పవిత్రంగా ఎంతో పద్ధతిగా జరుపుకోవాలి. ఉదయాన్నే లేచి, ఇల్లు వాకిలి శుభ్ర పరచుకుని తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మిగిలిన పనులు చేయాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం లో పాల్గొనడం, కవి సమ్మేళనాలు ఉంటే వెళ్లడం చేయాలి.
 
 పంచాంగ శ్రవణం:
 
పంచాంగ శ్రవణం అన్ని చోట్లా చేస్తూ ఉంటారు. ఇది నిజంగా మన ఆచారం అనే చెప్పాలి. పంచాంగ శ్రవణం లో ఆ సంవత్సరం లో మన స్థితి గతుల్ని ముందే తెలుసుకో వచ్చు. అలానే ఆ సంవత్సరం లో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే అవకాశం కూడా మనకి ఉంటుంది. ఆ రోజున పంచాంగ శ్రవణం లో తిథి వారం నక్షత్రం యోగం కారణాలు అనే ఈ ఐదు అంశాలను కూడా చెబుతారు పండితులు.
 
 కవి సమ్మేళనం:
 
 ప్రత్యేకంగా ఉగాది రోజు కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటారు. ఉగాది రోజు సాయం కాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవులు కవితలు పద్యాలు ఆలాపన చేస్తారు. అలానే కొన్ని కొన్ని చోట్ల సంగీత కచేరీలు, నాట్యాలు చేస్తూ ఉంటారు. 
 
ఉగాది కి సంబంధించి అనేక విషయాలు ఈరోజు మీరు చూశారు కదా...! మరి ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13వ తేదీన వచ్చింది. అందరూ కలిసి ఎంతో ఆనందంగా శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి చెప్పేసి ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. 
 
మీ కుటుంబ సభ్యులతో మీరు కూడా ఉగాది వేడుకలను చేసుకుని ఉగాది పచ్చడి తీసుకోండి. ఎంతో ఆనందంగా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుదాం..! మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు..