BREAKING NEWS

అంబేద్కర్ 130వ జయంతి

'మేధా కృషి మానవ అస్తిత్వ 
అంతిమ లక్ష్యం కావాలని' 
ప్రబోధించిన మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్.
అంటరానితనాన్ని, కుల నిర్మూలనను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలకు ఓర్చి, అడ్డంకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవమూర్తి ఆయన.
ఆర్థిక, న్యాయ శాస్త్రాలలో పట్టాలు పొందిన అంతర్జాతీయ న్యాయకోవిదుడు. బహు గ్రంథకర్త. దేశం గర్వించదగ్గ తీరులో భారత రాజ్యాంగాన్ని రూపొందించి, మార్గదర్శుకుడైన  ఆయన కృషికి ప్రజలు నీరాజనం పట్టారు. 
మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా రాజకీయాల్లోనూ వెలుగొందారు. ఈరోజున అంబేద్కర్ 130వ జయంతి కావడంతో ఈ సందర్భంగా ఆయన కృషిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం:
 
జననం: 1891 ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని హనువాడ గ్రామంలో రాంజీ మాలోజీ సక్పాల్, బిమాబాయ్ దంపతులకు అంబేద్కర్ జన్మించారు. 14వ ఆఖరి బిడ్డ అయిన బి. ఆర్. అంబేద్కర్ పూర్తి పేరు డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పని చేసేవారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు కావడంతో అంబేద్కర్ చిన్నతంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. 
ఆయనకు 17 సంవత్సరాల వయసున్నపుడు రమాబాయ్ తో వివాహం జరిగింది.
 
విద్యాభ్యాసం:

ప్రాథమిక పాఠశాలలో ఉన్నపుడు అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా ఉండేందుకనీ పాఠశాల గదిలో ఒక మూలన కూర్చోబెట్టేవారు. నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. 
◆1907లో మెట్రిక్కులేషన్ పాసయ్యారు.

◆బరోడా సంస్థనాధిపతి మహారాజైన శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన రూ. 25ల విద్యార్థి ఉపకార వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

◆పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలోని రక్షణ శాఖలో ఉద్యోగం లభించింది. కానీ పైచదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజాకు తన కోరికను తెలిపాడు. ◆1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అది కూడా ఒక షరత్తు మీద చదువు పూర్తయిన వెంటనే బరోడా సంస్థలో పదేళ్లు పని చేయాల్సిందిగా చెప్పడంతో సరేనని ఒప్పుకున్నారు.

◆1915లో ఎం.ఏ పట్టా పొందారు.

◆1916లో అంబేద్కర్ లండన్ వెళ్లి, ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డీ డిగ్రీను పొందారు. 

◆డీఎస్సీ చదవాలనుకున్న సమయంలోనే బరోడా సంస్థానం నుంచి ఉపకార వేతనం ఆగిపోయింది. వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమని ఉత్తరం రావడంతో బరోడా సంస్థానంలో రక్షణ శాఖ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. ఆయన కింద పనిచేసే ఉద్యోగుల నుంచి బంట్రోతు వరకు ఎవరు అంబేద్కర్ కు గౌరవమిచ్చేవారు కాదు. ఏవైనా కాగితాలుంటే ఆయన బల్లపై విసిరేసేవారు. దీంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పటికీ, ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దిన మహారాజుపై అభిమానంతో ఆ అవమానాల్ని భరించేవారట. ఆయన విదేశాల్లో ఎంత గొప్ప చదువులు చదివిన, ఇక్కడ భారతదేశంలో మాత్రం ఈ వివక్షకు ఎంతో కుంగిపోయారు. ఇక చేసేదిలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 
 
ఆయన రచించిన గ్రంథాలు:

◆"ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమయ్యింది.
◆ 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. 
మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తి గాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6న మరణించారు. 
 
ముఖ్యమైనవి:

◆కుటుంబ పోషణలో భాగంగా ఆయన విద్యార్థులకు ట్యూషన్లు, వ్యాపారులకు  సలహాలు చెప్పేవారు. కానీ కొన్నిరోజులకే ఆయన సాంఘిక నేపథ్యం తెలిసి వెళ్లడమే మానేశారు. 

◆1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది ఈ సభకు హాజరయ్యారు. 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు.
 
◆అంబేద్కర్ తన 56వ ఏటా సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నారు.  మొదటి భార్య అయిన రమాబాయ్ 1935లో మరణించారు.1956 అక్టోబరు 14న నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. 
 
◆1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు.  దాదాపు 60 దేశాల  రాజ్యాంగాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిల్లో పలు కీలక అంశాలను భారతీయ రాజ్యాంగానికి అనువుగా అనువర్తింపజేశారు. అందుకే 'భారత రాజ్యాంగ నిర్మాత'గా చరిత్రలో నిలిచిపోయారు.
 
◆న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేసిన అంబేద్కర్ మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశారు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 
1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.
 
◆భారత రాజ్యాంగ రూపకర్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి భారత ప్రభుత్వం 1990లో అత్యున్నత పౌర పురస్కారం అయిన  'భారతరత్న' అవార్డును ఇవ్వడం ప్రశంసనీయం. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఆయన చేసిన విశేష కృషికిగానూ అంబేద్కర్ పుట్టినరోజును “అంబేద్కర్ జయంతి” గా నిర్వహించడం పరిపాటైంది.

ప్రతి ఏటా ఆయన జయంతిని భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం విశేషం!