BREAKING NEWS

వేసవి స్పెషల్ ఈజీ సలాడ్స్..!

వేసవి అంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి. అటువంటప్పుడు శరీరాన్ని కూల్ చేస్తూ ఉండాలి. జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి లేదంటే ఎండ వేడికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హీట్ స్ట్రోక్ ఇలాంటివి సాధారణంగా సమ్మర్ లో చాలా మందికి వస్తూ ఉంటాయి. వేడి నుంచి తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వీలయినన్ని లిక్విడ్స్ తీసుకోవడం లాంటివి చేయాలి. ఫ్రూట్ జ్యూస్లు, మంచి నీళ్లు, షర్బత్ ఇలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండటం మంచిది.
 
సబ్జా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఆరోగ్యకరమైన సలాడ్స్ కూడా మనం ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు ఉపయోగించి సలాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పైగా వీటి వల్ల క్యాన్సర్ మరియు గుండె సంబంధిత సమస్యలు కూడా రావు. సమ్మర్ లో సలాడ్స్ చేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా ఉండొచ్చు. అయితే ఈ రోజు కొన్ని ఆరోగ్యకరమైన సలాడ్స్ ని చూద్దాం..! వీటిని సమ్మర్ లో చేసుకుని తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మరియు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంచుతాయి. మరి ఆలస్యం ఎందుకు సలాడ్ కోసం ఇప్పుడు చూసేద్దాం..! 
 
బ్రోకలీ రోస్టెడ్ ఆల్మండ్స్ మరియు పాస్తా సలాడ్:
 
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. దీనిని వేసవిలో తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది తరిమికొడుతుంది అలానే బాదం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పాస్తా లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ మూడింటితో మీరు మంచి సలాడ్ ని చేసుకుని తీసుకోవచ్చు.
 
బ్రోకలీ రోస్టెడ్ ఆల్మండ్స్ మరియు పాస్తా సలాడ్ కి కావలసిన పదార్థాలు:
 
చిన్నగా కట్ చేసుకున్న బ్రోకలీ రెండు కప్పులు
 ఒక కప్పు పాస్తా 
ఎనిమిది నుంచి పది బాదం పలుకులు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
 సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు
 గుమ్మడి గింజలు పావు కప్పు 
ఉప్పు మరియు మిరియాల పొడి రుచికి సరిపడా 
పావు కప్పు క్రీం 
 
బ్రోకలి రోస్టెడ్ ఆల్మండ్ మరియు పాస్తా సలాడ్ తయారు చేసుకునే విధానం:
 

ముందుగా పాస్తా ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బ్రోకలీ కాస్త ఉల్లిపాయలు గుమ్మడి గింజలు క్రీమ్ మరియు ఉప్పు మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పలుకులుని పైన వేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే.
 
 బీన్స్ క్యారెట్ మరియు నూడిల్స్ సలాడ్:
 
క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలానే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి మరియు విటమిన్ కె, బీటా-కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటాయి బీన్స్ కూడా ఆరోగ్యానికి మంచిదే. తక్కువ కేలరీలు ఉన్న నూడిల్స్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా రాదు.
 
 బీన్స్ క్యారెట్ మరియు నూడిల్స్ సలాడ్ కి కావలసిన పదార్ధాలు:
 
 కట్ చేసిన బీన్స్ ఒక కప్పు 
క్యారెట్ ముక్కలు ఒక కప్పు
 రెండు కప్పుల నూడిల్స్ 
రెండు టేబుల్ స్పూన్ల నూనె 
ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు 
రెండు స్పూన్ల వెనిగర్
 కొద్దిగా పుదీనా ఆకులు 
రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి 
 
బీన్స్, క్యారెట్ మరియు నూడిల్స్ సలాడ్ ని తయారు చేసుకునే విధానం:

 
ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో బీన్స్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నూనె వేసి వేయించాలి. నూడిల్స్ ని  ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో నూడిల్స్, బీన్స్ మరియు ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి కొద్దిగా వెనిగర్ వేయాలి. దాంట్లో సాల్ట్ మరియు మిరియాల పొడి వేసి పైన పుదీనా ఆకులతో సర్వ్ చేసుకోవాలి అంతే.
 
మామిడి దోస బటాని సలాడ్:
 
పచ్చి మామిడి లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురవకుండా ఉంచుతుంది. అలానే ఒంట్లో ఉండే వేడిని కూడా ఇది తగ్గిస్తుంది. సన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అలానే దోస కూడా ఎక్కువ నీటితో ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. అలానే బటాని లో ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, ఐరన్, సెలీనియం మరియు మెగ్నీషియం ఉంటాయి.
 
 మామిడి దోస బటాని సలాడ్ కి కావాల్సిన పదార్థాలు:

 
 నానబెట్టిన బఠాణీలు ఒక కప్పు 
కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఒక కప్పు 
కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఒక కప్పు 
కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమామిడికాయ ముక్కలు ఒక కప్పు 
కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 
ఉప్పు రుచికి సరిపడా 
కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర ఆకులు 
రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం 
ఒక స్పూన్ ఆయిల్ 
 
మామిడి దోస బఠాని సలాడ్ తయారు చేసుకునే విధానం:

 
 నానబెట్టుకున్న బఠానీలని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పదార్థాలన్నిటినీ యాడ్ చేసి పైన కొత్తిమీర పుదీనా వేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే.