BREAKING NEWS

న్యాయవాది టూ న్యాయమూర్తి...!

ఎటువంటి న్యాయరంగ బ్యాక్ డ్రాప్ లేకుండానే, న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి, అట్నుంచి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన  న్యాయమూర్తిగా అపార అనుభవం గడించిన ఆయన  నేడు దేశం గర్వించదగ్గ స్థాయిలో న్యాయమూర్తి పీఠాన్ని అధిరోహించనున్నారు. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ 'నూతలపాటి వెంకట రమణ'ను నియమిస్తున్నట్లుగా రాష్ట్రపతి ఉత్తర్వులివ్వడమైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవమిది. ఎన్వీ రమణ అందరిలానే సామాన్య రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ, న్యాయవిద్యను చేపట్టి, సీనియర్ న్యాయవాదిగా కీలక పదవుల్లో ఎన్నో కేసులను విజయవంతగా పరిష్కరించారు. 

ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే 2021 ఏప్రిల్(ఈ నెల) 23న పదవి విరమణ చేయనున్నారు. 24వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేసి, సీజేఐ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
  
కుటుంబ నేపథ్యం:
 
1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో నూతలపాటి గణపతి రావు, సరోజినీదేవీ దంపతులకు జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. ఈయన పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా, స్వతహాగా ఈ స్థాయికి ఎదిగిన తీరు ప్రతిఒక్కరికీ ఆదర్శమే!
 
పొన్నవరంలో ప్రాథమిక విద్యను చేపట్టి, కంచికచర్లలో విద్యాభ్యాసం సాగించారు. అమరావతిలోని ఆర్ వీవీఎస్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.1983 ఫిబ్రవరి 10వ తేదీన న్యాయవాదిగా  పేరు నమోదు చేసుకొని, న్యాయ వృత్తిని చేపట్టారు. 2000 సంవత్సరం జూన్ 27న ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై, అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఆపై దిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారు.

2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ ఎన్వీ రమణకు తన కుటుంబంలో ఇదివరకు ఎక్కడ కూడా న్యాయరంగ నేపథ్యం ఉన్న దాఖలాలు లేవు. అయినా  న్యాయవాదిగా ఎన్నో వేల కేసులకు తీర్పులిచ్చారు.
 
కొన్ని ముఖ్యమైన చారిత్రక తీర్పులు:
 
◆ జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ నిలిపివేయడం పై స్పష్టమైన వివరణను ఇచ్చారు. ప్రాథమిక హక్కులో భాగంగా ఇంటర్నెట్ ద్వారా వ్యక్తపరిచే భావప్రకటన గురుంచి అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కు గురుంచి సవివరంగా తెలిపారు. దాని ఫలితమే కశ్మీర్ లో మళ్ళీ ఇంటర్నెట్ తిరిగి వచ్చింది.

◆ రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కాక, శాసనసభలో బల పరీక్ష ఎంత ముఖ్యమో శివసేన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా తెలియజెప్పారు. 

◆ ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న నేర సంబంధిత కేసుల విచారణలో నెలకొన్న జాప్యాన్ని నివారించి, క్రమబద్ధీకరణకు వీలుగా ఆశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్వీ రమణ పలు ఆదేశాలు జారీ చేశారు.

◆జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థకు జస్టిస్ ఎన్వీ రమణ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతల్ని సైతం నిర్వర్తిస్తున్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారికి నాణ్యమైన న్యాయ సేవలు అందించడంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు.

◆కరోనా లాక్డౌన్ సమయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో లోక్ అదాలత్ లు నిర్వహించి దాదాపు 48 లక్షల కేసులను ఆయన ఆధ్వర్యంలో పరిష్కారానికి నోచుకున్నాయి. 

◆ జాతీయ మహిళా కమిషన్ ఆయన ఆధ్వర్యంలోని సంస్థతో కలిసి మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. మహిళలపై నేరాలు ఎక్కువగా నమోదైన 8 రాష్ట్రాల్లోని మహిళల కోసం న్యాయసాక్షరతా తరగతుల్ని నిర్వహించడం జరిగింది. దీనికి మంచి స్పందన రావడంతో అన్ని రాష్టాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని ఎన్వీ రమణ నిర్ణయించారు.

◆వాణిజ్య చట్టాలకు సంబంధించిన అంశాల్లోనూ ఆయన తీర్పులు వెలువరించారు.
  
తొలి తెలుగు సీజేఐ కోకా సుబ్బారావు:
 
న్యాయవాద కుటుంబంలో పుట్టి, పెరిగిన జస్టిస్ కోకా సుబ్బారావు 1966-67 మధ్య కాలంలో భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా, ఆ తర్వాత ఇన్నేళ్ళకి.. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత దేశ సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించబోతున్న రెండో తెలుగు న్యాయమూర్తిగా ఖ్యాతి గడించారు. 

◆ 16వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ఎక్కువకాలం పని చేశారు. 1978- 85 మధ్య కాలంలో దాదాపు 2,696 రోజులు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు.

◆అలాగే తక్కువకాలం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ కేవలం 17 రోజులు మాత్రమే పని చేశారు.
   
మాతృభాషంటే అంత్యత ప్రీతి...!
 
ఎంత స్థాయిలో ఉన్నా, ఆయనకు మాతృభాష అంటే ఎనలేని మక్కువ, మమకారం. న్యాయవ్యవస్థలోనూ తెలుగు భాష వాడకం పెంచాలని  న్యాయమూర్తులను కోరుతూ ఉంటారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సుల్లో పాల్గొని తెలుగు భాషకు ఎదురవుతున్న నిరాదరణను గూర్చి ప్రసంగిస్తూ ఎంతో ఆవేదనకు గురయ్యేవారట.అవసరం మేర ఆంగ్లం, హిందీ తదితర భాషల్ని నేర్చుకోవాలే తప్ప, పూర్తిగా ఆంగ్లంపైనే ఆధారపడకూడదని పలు కార్యక్రమాల్లో ఆయన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
 
ఎన్వీ రమణ పదవీ కాలం: 2021 ఏప్రిల్ 24వ తేదీ నుంచి 2022 ఆగస్టు 26వ తేదీ వరకు ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా ఉండనున్నారు.
    

Photo Gallery