BREAKING NEWS

సుగుణాభిరాముడంట...!

ఒకే మాట..
ఒకే బాణం..
ఒకే సతి... 
ఇవే రాముడి ఆదర్శాలు...!
తల్లిదండ్రులకిచ్చిన మాటను జవదాటకుండా, సింహాసనాన్ని ఆశించకుండా, సతీసమేతంగా కారడవులనే ఆశ్రయించిన ధర్మవంతుడు. సకల గుణాల్ని ఇముడ్చుకున్న సుగుణాభిరాముడు.
ప్రతి అడుగు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసమే వేశాడు. పరోపకార పారాయణుడైన రాముని రాజధర్మం తిరుగులేనిది.

మనుష్యుల్లోని సంబంధ బాంధవ్యాలు, బంధు ధర్మాలు తెలిసిన రామున్ని ధర్మఙ్ఞ: అంటారు. 

సత్యంచేత లోకాన్ని, ధర్మంచేత ప్రంపంచాన్ని, స్పృశుశ్యచేత గురువుల్ని, దీనులని దానగుణములచేత, శత్రువులను తన పౌరుషపరాక్రమములచేత గెలిచి పరిపూర్ణమైన నరుడిగా జనించిన అవతారమే శ్రీరాముడు! 

ఇతిహాసంలో చోటుచేసుకున్న యధార్థగాథ 'శ్రీరామాయణం'. లక్షలాది తరాల ముందు త్రేతాయుగంలో జరిగిన ఈ వాస్తవగాథ నాటికి, నేటికి, ఏనాటికైనా అనుసరణీయం!
 
ఉత్తరప్రదేశ్ లో అయోధ్య, తమిళనాడులో రామేశ్వరం, తెలంగాణలో భద్రాచలం ఆలయాల్లో రాములవారి కల్యాణాన్ని ఈరోజునే నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తారు. రామనామాన్ని కోటిసార్లు రామకోటిగా రాసి స్వామివారికి సమర్పిస్తారు భక్తులు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితోపాటు సీతాదేవిని, లక్ష్మణున్ని, ఆంజనేయుని కూడా ఆరాధిస్తుంటారు.
 
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్నే మనం పండుగలా జరుపుకుంటున్నాం. పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు  సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిపారు. 

ఈ చైత్ర శుద్ధ నవమిరోజున 

తెలంగాణాలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. దేవాలయాలను అందంగా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. ముఖ్యమంత్రి తన తలమీద తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకురావడం జరుగుతుంది.ఈ పండగరోజున ప్రతిఒక్కరూ తమ ఇళ్ళలో చిన్న సీతారాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.వీధుల్లో సైతం విగ్రహాలను ఊరేగిస్తారు. 
 
రాముని జననం...:-
 
శ్రీరామనవమి అనగా 'నవమి రోజున జనించిన రాములవారి పుట్టినరోజు' అని అర్థం. వసంత మాసంలో చైత్ర శుద్ధ నవమి అయిన గురువారం రోజున పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయాణంలోని బాలకాండలో రాముని జననం, సీతాదేవి కళ్యాణం చక్కగా వివరించడమైంది. అదే వాస్తవమని చరిత్ర కూడా చెబుతోంది. 

దాని ప్రకారం సూర్యవంశపు రాజుల పాలనలో ఉన్న కోశల దేశానికి రాజధాని అయిన అయోధ్యను దశరథుడు పరిపాలిస్తున్న రోజులవి. అధర్మం రాజ్యానికి ఆమడదూరంలో ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నా, రాజుకు మాత్రం సంతానం లేదన్న దిగులు బాధించేది. ఒకరోజు తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో కూర్చొని ఉండగా వశిష్ట మహాముని అపుడే వచ్చి... వారి బాధను గమనించి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిష్టి యాగాన్ని జరిపిస్తే, తక్షణం మీకు సంతానం కలుగుతుందని ఉపదేశిస్తారు.

ఆయన మాటను గౌరవించి రుషశ్రుగండనే మహర్షి ఆధ్వర్యంలో అశ్వమేధ, పుత్రకామిష్టి యాగాలను నిర్వహిస్తారు దశరథుడు. ఆ యజ్ఞంలోంచి యజ్ఞ పురుషుడొకడు వచ్చి వీరికొక పాయసాన్ని అందజేశారట. అలా యజ్ఞ ఫలితమైన పాయసాన్ని దశరథమహారాజు మొదటి సగభాగాన్ని కౌసల్యకిచ్చి, మిగిలిన సంగంల్లోంచి కైకేయి, సుమిత్రలకిచ్చాడు. కొన్ని మాసాల తరువాత కౌసల్య రాముడ్ని, కైకేయి భరతుడ్ని, సుమిత్ర లక్ష్మణుడు, శత్రజ్ఞుడనే కవలలను ప్రసవిస్తారు. ఈ నలుగురు రాకుమారుల జన్మదినాన్ని ఆ రాజ్యంలోని ప్రజలంతా వేడుకగా జరుపుకున్నారు.

ఆ జనకులకు ఈ నలుగురు కుమారుల్లోనూ అమిత ప్రీతిపుత్రిడు శ్రీరాముడే! పెద్దయ్యేకొద్ది అన్నిరకాల విద్యలు నేర్చుకున్నారు. 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత విశ్వామిత్రా మహాముని ఒక యాగం చేసుకొనే దశలో సాయంగా దశరథ పిల్లల్ని తన వెంట రమ్మని అడిగారట. కానీ దశరథుడు పుత్ర వ్యామోహంతో పిల్లల్ని పంపడానికి ముందు ఇష్టపడలేదు. దీంతో విశ్వామిత్రుడు ఆగ్రహించి శపిస్తాడేమోనన్న భయంతో వశిష్ట మునివారు ఆలోచించి... విశ్వామిత్రుడికి అస్త్ర,శస్త్ర విద్యల్లో ప్రావీణ్యం ఉంది. కాబట్టి రాకుమారులను ఆ మహమునితో పంపించమని బోధిస్తాడు.

పెద్దకుమారుడైన రాముడ్ని, లక్ష్మణున్ని ఇద్దరిని పంపిస్తారు. దారిలో వెళ్లేటప్పుడు వీరిరువురికి బోలెడన్ని కథలు చెప్పారట విశ్వామిత్రుడు. అలా దార్లో ఎదురైన తాటక అనే రాక్షసిని సంహరించి, ఆశ్రమానికి చేరుకున్నారు. అయినా అక్కడ రాక్షసుల భయం ఎక్కువగా ఉండేది. ప్రధానంగా మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు. విశ్వామిత్రుడు చేయదల్చిన యాగం గొప్పది కావడంతో ఆశ్రమం చుట్టూ రాక్షసమూక చేరి, యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. అలా చాలామంది రాక్షసుల్ని అంతమొందించినప్పటికీ మారీచుడు తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న మారీచుడే సీతారాములు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రాములవారి నుంచి వేరుచేయడానికి బంగారు జింకగా వేషం మార్చి, రావణాసురుడు పన్నిన మాయోపాయంలో భాగస్వామి అయ్యాడు.

అలా ఆ యజ్ఞం పూర్తయిపోయింది. అటు పిమ్మట మిథిలా నగరంలో జనకమహారాజు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్లి చూసొద్దాం. ఆయన దగ్గర ఒక పెద్ద ధనస్సు ఉంది. చాలా గొప్పదని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో చెప్తాడు. అలా వాళ్ళు సరేనని అనడంతో మిథిలా నగరానికి చేరుకున్నారు ఆ ముగ్గురు. యజ్ఞశాలలోనున్న జనక మహారాజుని కలిశారు. వారితో జనకమహారాజు మాకు వంశపారపర్యంగా వస్తున్న ఈ శివ ధనస్సును ఎక్కుపెట్టడానికి చాలామంది రాజులు యత్నించారు. కానీ ఎవరికి సాధ్యపడలేదు. ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కుపెడతారో వారికి కన్యాదానం చేయాలని నిశ్చయించుకొన్నాను. 

అది సాధారణ విల్లు కాదు. తాడు కట్టి విల్లు ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉండదు. పట్టుకోవడానికి వీలుగా ఉండే భాగం మాత్రమే ఉంటుంది. ఆ తాడు సైతం ఒకపక్క మాత్రమే చుట్టబడి ఉంటుంది. దాన్ని పైకి పట్టుకొని ఇంకో చివర ముడి వేయాల్సి ఉంటుంది. అది విని శ్రీరాముడు ఆ ధనస్సును పట్టుకొని వంచి బిగుస్తున్న క్రమంలోనే అది విరిగిపోయింది. దీంతో శివధనస్సును విరిచిన రాములవారి శక్తి, పరాక్రమం చూసి, ఇంతటీ పరాక్రమవంతుడికే నా కూతుర్ని కన్యాదానం చేస్తానని అంటాడు. ఇదే విషయమై దశరథుడుకి వర్తమానం పంపితే, అయోధ్య పరివారమంతా రావడం జరిగింది. 

సీతాకళ్యాణం కన్నా ముందే అహల్య శాపవిమోచన జరుగుతుంది. ఏ విధంగా అంటే.... వచ్చే దారిలో ఆయన కాలి వేలు తగిలి అహల్య రాయిగా మారిందనేది ఒక వృతాంతం. కానీ అహల్య తన తపశ్చర్యలో భాగంగా వాయుభక్షణం(అదృశ్యరూపంలో ఉంటూ గాలి తింటూ జీవించటం) చేస్తుండగా రాముడు ఎదురవ్వడంతో ఆవిడ దృశ్యమానమై అందరికీ కనపడింది.  అలా ఆమెకి శాపవిమోచనం కలిగింది. దీన్ని ముందే గ్రహించిన గౌతమ మహర్షి కూడా అక్కడికే వచ్చేశారు. రాముడ్ని ఆశీర్వదించి, తిరిగి ఆశీర్వాదాలు పొంది అక్కడినుంచి వెళ్లిపోతారు అహల్య, గౌతములు. తరువాత సీత, ఊర్మిళను రామ, లక్ష్మణులకు, మాండవి, శ్రుతకీర్తులిద్దర్ని భరత, శత్రుజ్ఞులకిచ్చి వివాహాం చేయుటకు ఇరువురి తల్లిదండ్రులు నిశ్చయించారు. కానీ ఉత్తర పాల్గుణ నక్షత్రంలో జరిగిన రాముడి వివాహాన్ని మనం పునర్వసు నక్షత్రంలో జరిగినట్లుగానే చేసుకుంటున్నాం. ఇది భద్రాద్రి నుంచి వస్తున్న ఆనవాయితీ!
 
◆నవమిరోజున రాములవారి కళ్యాణం జరిపి, మరుసటి రోజైన దశమినాడు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు.
 
నైవేద్యంగా...:-
 
◆శ్రీరాములవారికి వడపప్పు, పానకంను మహాప్రసాదంగా నివేదిస్తారు. మిరియాలు, యాలకులు వేసి చేసిన ఈ పానకం తీసుకోవడంవల్ల ఈ మాసంలో వచ్చే గొంతు సంబంధ వ్యాధులకు ఉపశమనం కలిగి, ఔషధంలా పనిచేస్తుందని లౌకికంగా చెబుతారు.
 
◆ఇక వడపప్పును పెసరపప్పుతో చేయడం వల్ల శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుందని, జీర్ణశక్తిని పెంచుతుందని ప్రతీతి. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ'దెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. 
 
◆పరమపవిత్రమైన ఈ రోజున శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లలమామిడి వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణం వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. 
 

Photo Gallery