BREAKING NEWS

తెలుగు వారి తొలి యుగాది...

శిశిరంలో రాలిపోయిన ఆకులు,
వసంతంలో మళ్ళీ కొత్తగా చిగురించి, కోయిల కుహకుహలతో ఆహ్వానం పలికినట్లు...
'ప్లవ' సంవత్సరాది పేరు గల ఈ ఏడాదికి స్వాగతం పలికే సమయం వచ్చేసింది.
'ప్లవ'ను ప్రతిభకు చిహ్నంగా భావిస్తారు. 

గత సంవత్సరాదిలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రతీ ఒక్కరిని భయకంపితుల్ని చేసి, సగటు జీవనశైలిని స్తంభింపజేసింది. ఇక ఈ ఏడాదైనా వాటన్నిటినీ అధిగమిస్తూ, జీవితాల్లో విజయంవైపుగా కొత్త బాటలు వేయాలని ఆశిద్దాం...
 
సంవత్సరాదికి ఉగాది పేరెలా?
శిశిరం వెళ్లిపోయి వసంత రుతువుతో మొదలయ్యే ఈ మాసం ఎంతో ప్రత్యేకమైంది.
చాంద్రమానాన్ని అనుసరించి ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం.
చాంద్రమాన పద్ధతిలో వసంతం, కొత్త ఏడాది ఒకేరోజు ప్రారంభమవుతాయి.
ఉగాది అనేది 'యు'గాది అనే పదం నుంచి వచ్చింది.
యు అంటే నక్షత్రం
గ అంటే గమనం అనగా,
నక్షత్ర గమనాన్ని  అనుసరించి ఉగాది పర్వదినం పుట్టింది.
దీన్నే 'సంవత్సరాది' అని కూడా అంటారు.
నూతన ఉత్సాహాలకు నాంది పలికేదే ఉగాది. 
 
ప్రత్యేకత:

ఈరోజున కొత్త చింతపండు, బెల్లం, మిరియాలు వంటి పంటలను వాడటం మొదలు పెడతారు.
నిజానికి సంవత్సరానికి సరిపడ పదార్థాల్ని ఉగాది అయితే తప్ప వాడటం మొదలుపెట్టే వారు కాదు.
కొత్త పనులకు, లక్ష్యాలకు శ్రీకారం చుట్టేది కూడా ఈ రోజునే!
ఇప్పటివరకు చేసిందేమిటి?, ఇకముందు చేయాల్సిందేమిటి?, ఇదివరకు మిగిలిందేంటీ?, ఇకపై సాధించాల్సిందేంటనే అంశాల గురుంచి ఈ రోజునే నిర్ణయం తీసుకోవడానికి అనువైన కాలమని సూచిస్తారు పూర్వీకులు.
 
పచ్చడి పరమార్ధం:

మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయం(వగరు), లవణం(ఉప్పు), వేప(చేదు)లాంటి ఆరు రుచులను కలగలిపితే ఏర్పడిన ద్రావణమే ఉగాది పచ్చడి.  జీవితం కూడా ఈ షడ్రుచుల సమ్మేళనం లాంటిది. ఇవన్నీ సమపాలలో ఉండటమే మనకు శ్రేయస్కరం. జీవితంలో కష్టమొస్తుంది, నష్టమొస్తుంది, సుఖమొస్తుంది, మోసపోవడం జరుగుతుంది, మోసపుచ్చడం జరుగుతుంది. వీటన్నిటిని స్వీకరించి, తదనుగుణంగా జీవించవలసిందేనని ఉపదేశిస్తుంది ఈ ఉగాది.
 
ఉగాదిరోజు నుంచి శ్రీరామనవమి వరకు ఈ పచ్చడిని సేవిస్తే ఆరోగ్యానికి మేలని శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చిగుర్లని రోజుకి రెండు చొప్పున ఓ సంవత్సరం పాటు తిన్నట్లైతే ఎటువంటి తరుణ వ్యాధులు(ఉదా: జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు) లాంటివి రాకుండా ఉంటాయి. ఈ పచ్చడి ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు.
 
ఈరోజున ముఖ్యంగా ఆచరించాల్సినవి:
 
1. తైలాభ్యంగనం: ఈరోజున ఆచరించే వాటిల్లోనే ముఖ్యమైంది ఇది. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటూ స్నానం చేయడం. 
చలి వెళ్లిపోయి ఎండ వస్తుంది కాబట్టి శరీరంలో అంతకుముందున్న మాలిన్యాలు పోయి, శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గి, చల్లబరిచేలా చేస్తుంది. జీర్ణక్రియను సైతం పెంచుతుంది.
 
2. నూతన వస్త్రధారణం: నూతన సంవత్సరాది రోజున కొత్త బట్టలు కట్టుకోవడం మంగళకరం. దీనివల్ల మనసు, శరీరం కూడా ఉత్తేజవంతమవుతాయి. 
 
3. ఇష్ట దేవతారాధన:  కొత్త సంవత్సరం పేరును ఒకటికి రెండుసార్లు జపించడం. లేదా ఇష్ట దేవతారాధన చేసిన ఆ ఏడాదంతా దైవనుగ్రహం లభిస్తుందంటారు. మరీ ముఖ్యంగా బ్రహ్మకు పూజ చేయాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. దవనం మంచి పరిమళం గల పత్రం. ఇది ఈ మాసంలో విరివిగా దొరుకుతుంది దీంతో పూజించడం మంచిదంటారు. ఈ రోజున దైవ దర్శనంతో పాటు, గో దర్శనం చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం దక్కుతుంది.
 
4. నింబపల్లవ భక్షణం: ఈరోజున వేపపువ్వుతో చేసిన పచ్చడిని తప్పనిసరిగా తీసుకోవాలి. వేపలో ఔషధ గుణాలు ఉండటం చేత చర్మ సంబంధ వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
 
5.పంచాగ శ్రవణం: అసలు పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంగాల సమూహం. పంచాంగం  వినడమనేది రామాయణం, భాగవతంలాంటి పవిత్ర గ్రంథాల్ని పారాయణం చేసిన దాంతో సమానమట. పంచాంగం వినడం వల్ల ఆయా గ్రహస్థితులు, శుభాశుభాలు, రాజపూజ్యం, అవమానం, ఆదాయ- వ్యయాలు మొదలైన విషయాలు తెలుస్తాయి. వీటన్నిటిని తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని, సమస్యల్ని ముందే గ్రహించి పరిష్కరించుకోవచ్చనేది దీన్ని ముఖ్యోద్దేశం!
 
వసంత నవరాత్రులు:

మనకు నవరాత్రులు అనగానే గణపతి, దేవీ నవరాత్రులే గుర్తొస్తాయి. కానీ ఈ రెండు నవరాత్రులే కాక చైత్ర మాసంలో కూడా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక నవరాత్రుల్ని నిర్వహిస్తారు. వీటినే వసంత నవరాత్రులు అంటుంటారు. శక్తి రూపేణా ఆరాధించిన విష్ణువుకు సంబంధించిన నవరాత్రుల్ని ప్రతీతి. ఈ వసంత నవరాత్రులు ఉగాది రోజున మొదలై శ్రీరామనవమి వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ వసంత నవరాత్రి చివరి రోజున రాముడు జన్మించాడని, అందుచేతనే శ్రీరామనవమి అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.
 
చరిత్ర ప్రకారం:

పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ఆజ్ఞకి అనుగుణంగా ఏ రోజున సంవత్సర ఆదిని ప్రారంభిస్తే అందరూ సుఖసంతోషాలతో ఉంటారో గమనించిన విష్ణువు, బ్రహ్మకి ఆజ్ఞ చేశాడట. ఉగాదిని మంచిరోజున సృష్టి చేయమని. ఆయన ఆలోచించి తెలుగు సంవత్సరాలు అరవై ఉంటే, అందులో మొదటిదైన ప్రభవ సంవత్సరం, రెండు అయనాల్లో మొదటిదైన ఉత్తరాయణం, రుతువుల్లో మొదటిదైన వసంత రుతువు, వసంత రుతువులో మొదటిదైన చైత్రమాసం, చైత్ర మాసంలో మొదటిదైన శుద్ధ పక్షం, శుద్ధ పక్షంలో మొదటిదైన పాడ్యమి రోజు, పాడ్యమి రోజున మొదటిదైన పగలు, పగలులో మొదటిదైన బ్రాహ్మి ముహూర్తం, బ్రాహ్మి ముహూర్తంలో మొదటిదైన ప్రథమ ప్రాణాయమం, ప్రథమ ప్రాణాయమంలోని సృష్టి, లయ, స్థితి మూడింటిల్లోనూ మొదటిదైన సృష్టిని బ్రహ్మ చేపడితే అయ్యిందట ఉగాది.
 
◆ ఈ పండుగను తెలుగువారు, కన్నడిగులు, తమిళులు, మహారాష్ట్రులు, ఒకేరోజు చేసుకోవడం మనం చూస్తుంటాం. 
మరాఠిలో గుడి పడ్వాగా, తమిళనాడులో పుతాండుగా, మలయాళంలో విషుగా, సిక్కులు వైశాఖీగా, బెంగాల్లో పోయ్ లా భైశాఖీగా పలు పేర్లతో ఈ ఉగాదిని జరుపుకోవడం విశేషం!