BREAKING NEWS

తొలి తెలుగు నాటకకర్త: కందుకూరి

తొలి నవల,
తొలి పత్రిక,
తొలి సంస్థ,
తొలి ప్రహాసనం,
తొలి నాటకం,
తొలి వితంతు వివాహాం జరిపి...
సంఘంలో వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా తెలుగు జాతికి ఆద్యులు, ఆరాధ్యులు అయ్యారు.
సాధారణ బడి పంతులు నుంచి ప్రజల్లో వేళ్ళునాటుకున్న సాంఘిక దూరాచారాల్ని రూపుమాపి నవయుగ వైతాళికుడయిన్నాడు. ఆయన మరెవరో కాదు... "కందుకూరి వీరేశలింగం" పంతులు. నేడు వీరేశలింగంగారి 174వ జయంతి, అంతేకాక తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా ఆయన గురించిన విశేషాలు:
 
వ్యక్తిగత జీవితం:

 
1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు కందుకూరి వీరేశలింగం జన్మించారు.
వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామం నుంచి రాజమండ్రికి వలస రావడంతో వీరేశలింగం ఇంటిపేరు కందుకూరిగా స్థిరపడిపోయింది.
బాల్యంలోనే బాలరామయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణి కల్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైన గ్రంథాల్ని నేర్చుకున్నారు.
12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో చేరాడు.
చదువుకునే రోజుల్లోనే కేశుబ్ చంద్రసేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు.
13వ ఏటా 8ఏళ్ల బాపమ్మ(రాజ్యలక్ష్మమ్మ)తో వివాహామైంది.
 
ఉపాధ్యాయ వృత్తి:
 
విగ్రహారాధన, పూజలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. దెయ్యాలు, భూతాల్లాంటి మూఢనమ్మకాల్ని కొట్టిపారేయడానికి అర్ధరాత్రులప్పుడు శ్మశానానికి సైతం వెళ్లారు.
ఆ రోజుల్లో లంచగొండితనం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటే లంచం ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగాన్నే కాదనుకున్నారట. ఆయన న్యాయవిద్య అభ్యసించినప్పటికీ, న్యాయవాద వృత్తిలో ఎక్కడ అసత్యం చెప్పాల్సొస్తుందని ఆ వృత్తిని చేపట్టలేదు.

ఆఖరికి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తినే ఆయన స్వీకరించారు.
25 సంవత్సరాలపాటు రాజమండ్రిలో  తెలుగు పండితుడిగా పనిచేసి, తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనూ తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేశాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఎన్నో గ్రంథాలు రాశారు, పత్రికలు పెట్టారు, సమాజహితమైన సంస్థల్ని స్థాపించారు.
 
సంఘసేవ...:
 
◆ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించారు. స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కోసం పాఠశాలను సైతం ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహా విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు, పుస్తక సామగ్రిని అందజేశారు. 
 
◆అప్పటి సమాజంలో చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు వెళ్లకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేశారు. 1874లో అంటే వీరేశలింగంగారు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్త్రీ పునర్వివాహంపై చాలా సమావేశాలు జరిగాయి. అయితే అది అంత తేలికగా సాధ్యపడలేదు.
బాల్య వితంతువులు ఎప్పటికీ అలానే ఉండిపోవాలే తప్ప, మరలా వివాహం చేసుకోరాదని ఆ సమావేశాలకు వచ్చిన పెద్దలు, ప్రజలు, పాండిత్యులు ఆయన చెప్పిన విషయాల్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాక, దూషించారు, దౌర్జన్యానికి తెగబడ్డారు. 

అలా ఆయన 7 సంవత్సరాలపాటు ఎన్నో సమావేశాలు, సభలు నిర్వహించి ఒక ఉద్యమంలా చేపట్టడం వల్లే ఈ స్త్రీ పునర్వివాహం కార్యరూపం దాల్చింది. అలా 40 వితంతు వివాహాలు జరిపించాడు.
 
◆నాటక రంగంలోనూ విశేష కృషి చేశారు. తొలి నాటకం, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడిగా ముద్ర వేశారు.
 తొలి నాటకమైన 'బ్రాహ్మ వివాహం' ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. ఈ నాటకంలో ముక్కుపచ్చలారని బాలికను, కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని అడ్డుకున్నారు. ముసలి వాళ్ల పెళ్లి ఆశను మొగ్గలోనే తుంచేసి ప్రేక్షకుల కళ్ళు తెరిపించారు. ఆ డబ్బుకు ఆశపడి పిల్లల జీవితాలను నాశనం చేసే తల్లిదండ్రులను, పెళ్లి పెద్దలను తీవ్రంగా వ్యతిరేకించడమే ఈ నాటక ఉద్దేశం. ఇలానే వ్యవహార ధర్మ బోధిని, కన్యాశుల్కం, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహారిచంద్ర, రత్నావళి లాంటివి ప్రసిద్ధి చెందినవి. మొత్తం 16 నాటకాలను రచించారు.
 
సాహిత్య కృషి:
 
◆సమాజంలోని దూరాచారాలను అరికట్టేందుకు 1874 అక్టోబర్ లో 'వివేకవర్ధిని' అనే పత్రికను ప్రారంభించారు.
'సంఘంలోని దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని కార్యకలాపాలను ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం' ఈ పత్రిక లక్ష్యమని ఆయన మొదటి సంచికలో తెలియజేశారు. చెప్పడమే కాదు, అలాగే నడిపారు కూడా. వివేకవర్థిని పత్రిక అవినీతిపరులపాలిట సింహస్వప్నమయింది.
 
◆'హాస్య సంజీవిని' అనే హాస్య పత్రికను ప్రారంభించి, తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. స్త్రీల కోసం 'సతీహిత బోధిని' అనే పత్రికను నడిపించారు.
 
◆ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. 
 
◆1905లో సమాజ సేవ కోసం 'హితకారిణి' అనే ధర్మసంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికే రాసిచ్చేసారు. 
 
◆తెలుగు ప్రక్రియలైన తొలి నవల, తొలి నాటకం, వచన రచనవంటి అనేక ప్రక్రియలకు ఆయనే నాంది పలికారు.
బడి పిల్లల కోసం పలు వాచకాలు రాశారు. 
 
సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసారో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాశారు. పత్రికలకు అడపాదడపా వ్యాసాలు రాస్తూ ఉండేవారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశారు. 
 
◆రచనలు: 'రాజశేఖర చరిత్ర' 1878లో రాసిన తొలి తెలుగు నవల ఇది.
'సత్యరాజా పూర్వ దేశయాత్రలు' ఆయన రచనల్లో ప్రముఖమైనవి. స్వీయ చరిత్ర, ప్రహాసనం, తెలుగు కవుల జీవిత చరిత్రలు
మొదలైన ప్రక్రియలను రాశారు. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
 
◆యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు  'గద్య తిక్కన' అనే బిరుదు ఉంది. పద్యాలు రాయడంలో అద్వితీయుడైన తిక్కనలానే, గద్యాలు రాయడంలో వీరేశలింగం గొప్పవారు కావడంతో ఆయనకు 'గద్య తిక్కన' అనే బిరుదు వచ్చింది.
 
బాల్య వివాహాలు, లింగ వివక్ష, నిరక్షరాస్యత, అస్పృశ్యతలాంటి సాంఘిక దూరాచారాలపై చివరివరకు పోరాడిన యోధుడు. దక్షిణదేశపు రాజారాంమోహన్ రాయ్ గా పేరుగాంచిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం 1919 మే 27న మరణించారు.