BREAKING NEWS

తమిళ్ కమెడియన్ వివేక్ C/o కామెడీ

'వివేక్'...
తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తమిళంలో టాప్ కమెడియన్. ఆయన హాస్యనటుడిగా చేసిన తమిళ సినిమాలు తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.

సింగంలో 'ఇదే రగులుతున్న అగ్ని పర్వతం' అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ పాటతో దెబ్బలు తినే పోలీస్ పాత్రలో... శివాజీలో రజనీకాంత్ కి వెంటే ఉండే మామ పాత్రలో... రఘువరన్ బీటెక్ లో హీరో రఘువరన్ కి సాయపడే సుందరం పాత్రలతో అలరించిన వివేక్ ని కోల్పోవడం అటు సినీ పరిశ్రమకు, ఇటు అభిమానులకు తీరని లోటనే చెప్పుకోవాలి. ఆయన జీవిత విశేషాల గూర్చి ప్రత్యేకంగా...
 
జననం:

1961 నవంబర్ 19న అంగయ్య, మనియమ్మల్ దంపతులకు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో
కోవిలపట్టిలో జన్మించారు వివేక్. పూర్తి పేరు వివేకానందన్. భార్య అరుల్ సెల్వి, కొడుకు ప్రసన్న కుమార్, కుమార్తెలు అమృత నందిని, తేజస్విని.
 
విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కోవిలపట్టిలో  పూర్తి చేశారు. మాధ్యమిక విద్యను  తూత్తుకుడిలో చదివారు. మధురైలోనున్న అమెరికన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత చెన్నై సెక్రటేరియట్ లో ఉద్యోగం చేశారు. 
 
నటనపై ఆసక్తి ఎలా..?
 
చిన్నప్పట్నుంచి ఆయనకు నటనంటే ఇష్టం! నాటకాల్లో నటించడమే కాక కొన్ని నాటకాలకు రచనా సహకారం అందించారు. ఖాళీ సమయాల్లో మద్రాస్ హ్యూమర్ క్లబ్ లో పాల్గొనేవారు. హాస్యం ద్వారా సామాజిక చైతన్యం పెంచవచ్చని మూఢ నమ్మకాలు, జనాభా పెరుగుదల, అవినీతి, ఆడశిశువుల హత్యలు, నగరంలోని మురికివాడల కష్టాల గురుంచి నవ్విస్తూనే సెటైర్లు వేస్తూ, తనవంతు కృషి చేశారాయన.

ఈ క్లబ్ లో ప్రతిభ ఉన్న చాలామంది స్టాండప్ కామెడీ చేసేవారు. వివేక్ కూడా మైమ్(మాట్లాడకుండా సైగలతో నటించడం)చేసి ఎంతోమందిని నవ్వించారు. ఆయన చేసిన మైమ్ గోవింద రాజన్ గారికి బాగా నచ్చడంతో, ప్రముఖ దర్శకుడైన బాలచందర్ గారికి పరిచయం చేశారు. ముందునుంచి రచన పట్ల ఆసక్తి కనబర్చడంతో, బాలచందర్ గారు వివేక్ ను ముందుగా రచయితగా పరిచయం చేస్తానని అన్నారు. 1984లో స్క్రిప్ట్ రైటర్ గా తీసుకున్నారు. అలా 4 సంవత్సరాలపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పని చేశారు.

1998లో ఆయనకు బ్రేక్ వచ్చింది. డేట్స్ దొరకనంత బిజీగా అవకాశాలు తలుపు తట్టాయి. అప్పట్లో ఆయన కామెడీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. హీరోలతో పాటు సమానంగా ఆయనకు పోస్టర్లు వేశారంటే అతిశయోక్తి కాదు. 
బాయ్స్ చిత్రం విజయానికి ఆయన నటన ఎంతో కీలకం.
అపరిచితుడు చిత్రంలో ఆయన హాస్యం, నటన అద్భుతం.
 
సినీరంగ ప్రవేశం:-
 
కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో సినిమాల్లో హాస్య నటుడిగా మర్చిపోలేని పాత్రలు చేశారు. ప్రధానంగా రజనీకాంత్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్, ధనుష్ లాంటి తదితర హీరోలతోపాటు తెరని పంచుకున్నారు.

శంకర్ తెరకెక్కించిన 'బాయ్స్' చిత్రంలో బాయ్స్ కు సాయం చేసే పాత్రలో చేసి ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

అపరిచితుడు, శివాజీ సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా చేసి తన నటనతో నవ్వించారు.

బాయ్స్, అపరిచితుడు, సింగంలాంటి హిట్  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు వివేక్. 
 
◆ఆయన కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్లకే డెంగీ జ్వరం వచ్చి చనిపోవడంతో చాలా కుంగిపోయారు. సంవత్సరంపాటు నటనకు దూరంగా ఉన్నారు. అందుల్లోంచి బయటపడటానికి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. 

ఇప్పటివరకు తెలుగు, తమిళ్ తోపాటు మొత్తం 300కి పైగా సినిమాల్లో నటించారు.
 
గుర్తింపు:
 
◆ఆయన నటనకుగానూ తమిళనాడు ప్రభుత్వం నాలుగుసార్లు ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు ఇచ్చింది.
ఆవి వరుసగా 2002, 2003, 2004 సంవత్సరాలకుగానూ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి.

◆అంతర్జాతీయ తమిళ చిత్ర పురస్కారం సైతం అందుకున్నారు.

◆2009లో గౌరవ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.

◆సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ఇచ్చింది.

 అందరి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఒక్క కమల్ హాసన్ గారితో నటించలేదనే కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. 
ఇటీవలే భారతీయుడు-2లో నటించడానికి ఎంపికయ్యారు. కొంతభాగం షూటింగ్ జరిగింది. కానీ తెరపై ఆయన సినిమాని చూడకుండానే ఈ నెల 17న గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 59 సంవత్సరాలు.
ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ నెల 16వ తేదీన కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుండెనొప్పి రావడంతో అదే రోజు రాత్రి కన్నుమూశారు.
 
ఇతరాంశాలు:
 
◆ వివేక్ గారు సామాజిక కార్యకర్త, అలానే  ప్లే బ్యాక్ సింగర్.

◆ఆయన కలాంగారికి వీరాభిమాని.

గ్రీన్ కలాం పేరిట పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ 33లక్షల మొక్కలను నాటించారు.
 
◆ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సినీతారలైన సూర్య, జ్యోతిక, కార్తిలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రచార కర్తగా పనిచేశారు.
 
◆తెలుగువారికి సుపరిచితుడైన వివేక్ అబ్దుల్ కలామ్, ఏ.ఆర్. రెహమాన్ లాంటి ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూలు చేసి టీవీ వ్యాఖ్యాతగా ప్రశంసలు పొందారు. 
 
◆2003లో మిరిండాలాంటి సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు సైతం వివేక్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నాయి. మొట్టమొదటిసారి స్టార్ హీరోలు కాకుండా కమెడియన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమనేది అరుదైన విషయమనే చెప్పుకోవాలి.