BREAKING NEWS

అమ్మ కోసం కొడుకు పడిన తపనే.. కేజీఎఫ్-2…!

 సౌత్‌ నుంచి నార్త్‌ దాకా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లను కురిపిస్తున్నాడు కన్నడ స్టార్‌ యశ్‌.
ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కేజీఎఫ్‌-2'. కేజీఎఫ్‌ చాప్టర్‌కు-1కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించాడు. ఏప్రిల్‌ 14న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలను వసూలు చేస్తుందీ చిత్రం…

వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది కేజీఎఫ్‌ చాప్టర్‌-2. మూడు రోజుల్లోనే రూ. 400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 552 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి! అది చూసేముందు ఈ సినిమా రివ్యూతోపాటు కేజీఎఫ్ అసలు కథ వెనకున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
కేజీఎఫ్-2 తారాగణం

నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్‌ తదితరులు,
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌,
నిర్మాత:విజయ్ కిరగందూర్,
దర్శకుడు:  ప్రశాంత్‌ నీల్‌,
సంగీతం: ర‌వి బ‌స్రూర్,
సినిమాటోగ్ర‌ఫీ: భువ‌న్ గౌడ‌.
 
సినీఅభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్‌-2 కూడా ఒకటి. 2018లో వచ్చిన ఈ ‘కేజీయఫ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డును సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తుందంటే.. అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్‌-2ను మరింత హైప్ తో కూడిన టీజర్‌, ట్రైలర్‌ని చూపించారు చిత్ర బృందం. బాహుబలి సీక్వెల్ తర్వాత మరో సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు అంతలా వేచి చూసిన సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్‌-2 అనే చెప్పొచ్చు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ చిత్రం గురువారం(ఏప్రిల్‌ 14) తెర మీదకు వచ్చింది. పార్ట్‌-1 సూపర్‌ హిట్‌ కావడం, పార్ట్‌-2 టీజర్‌, ట్రైలర్‌ క్రేజ్ క్రియేట్‌ అయింది. కేజీయఫ్ మొదటి భాగాన్ని ఆదరించినట్లే, కేజీయఫ్‌-2ను ఆదరించారనే చెప్పొచ్చు.
 
కథలోకి వెళ్తే

కేజీయఫ్‌ మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్‌-2 కథ మొదలవుతుంది. మొదటి భాగంలో రాకీ భాయ్‌ కథను ప్రముఖ రచయిత ఆనంద్‌ వాసిరాజు(అనంత్‌ నాగ్‌) చెబితే.. పార్ట్‌-2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్‌ రాజ్‌) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌ను రాకీ భాయ్‌(యశ్‌) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే రకరకాల చిత్రహింసల నుంచి బయటపడటంతో అక్కడి కార్మికులు యశ్‌ని తమ రాజుగా భావిస్తారు. అందుకు ప్రతీగా తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.

ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలోనే… 'నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌' వ్యవస్థాపకుడు… సూర్యవర్ధన్‌ సోదరుడు అధీరా(సంజయ్‌ దత్‌) తెరపైకి వస్తాడు. రాజకీయంగా రాకీబాయ్‌ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని సామ్రాజ్యం, ఘనత గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్‌(రవీనా టాండన్‌).. అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్‌ ప్రభుత్వం తనకు ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్‌ ఏం చేశాడు?, తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?, తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏం చేశాడు? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
 
ఎలా ఉదంటంటే..

2018లో చిన్న సినిమాగా విడుదలై, అతి భారీ విజయం సాధించిన చిత్రం ‘కేజీయఫ్‌’. తల్లి చెప్పిన మాటలు, ఆ మాటల ప్రభావంతో పెరిగిన కొడుకు, చివరకు ఓ సామ్రాజ్యానికే అధినేతగా ఎదిగేలా చేసింది… ఇలా కేజీయఫ్‌ చిత్రం సాగుతుంది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయన్నది కేజీయఫ్‌-2లో చూపించారు. కేజీయఫ్‌లానే పార్ట్‌-2లో హీరో ఎలివేషన్‌, యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. 

ఫస్టాఫ్‌లో రాకీభాయ్‌ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్‌ భాగస్వాములతో జరిపిన మీటింగ్‌, ఇయత్‌ ఖలీల్‌తో జరిపిన డీల్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్‌ హైరేంజ్‌లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం కాస్త సినిమాటిక్‌గా అనిపించేస్తుంది. ‘కేజీయఫ్‌’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. పైగా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమోననిపిస్తుంది. అయితే కథని మాత్రం అంతే స్థాయిలో​ తీసుకురాలేకపోయాడు.
 
కేజీయఫ్‌ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలోని విలన్లు, వారు ఎలాంటి ఎత్తులు వేస్తారు.. చివరకు ఎం జరుగుతుంది అనేది అంచనా వేసేయగలరు. వారి అంచనాలకు తగ్గట్టే పార్ట్‌-2 సాగుతుంది. కథలో ట్విస్ట్ లు లేకపోవడం మైనస్‌. ఇక అధీర పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్‌, అధిరాకు మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ మాత్రం అంతగా ఆసక్తికరంగా అనిపించవు. అధిర పాత్రను మరింత బలంగా చూపించాల్సింది.

ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో తల్లి సెంటిమెంట్ కాస్త తక్కువనే చెప్పాలి. అప్పుడప్పుడు తల్లి మాటలను గుర్తుచేస్తూ కథను ముందుకు నడిపించారు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ అంతగా ఆకట్టుకోకపోయినా… చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్‌ మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. 
 
★ సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి… తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాన్ని మాత్రం థియేటర్ లోనే చూసి తీరాలి.
 
ఎవరెలా చేశారంటే..

కేజీయఫ్‌2లో యశ్‌ నటన.. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ అదరగొట్టేశాడు. రాకీ భాయ్‌ పాత్రకు యశ్‌ తప్ప మరొకరు సెట్‌ కాలేరన్న భావన కలిగేలా పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా మంచి నటనను కనపరిచాడు.
అధీరాగా సంజయ్‌ దత్‌  నటన బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ప్రధానమంత్రి రమికా సేన్‌  పాత్రకి ర‌వీనా టాండ‌న్ న్యాయం చేసింది. రావు రమేశ్‌, ఈశ్వరి భాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండటమే ఈ సినిమా గొప్పదనం!
 
సాంకేతికంగా

ఈ సినిమాకు మరో ప్రధాన బలం.. ర‌వి బ‌స్రూర్ సంగీతం. అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. భువ‌న్ గౌడ‌ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! కేజీయఫ్‌ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా ఉన్నతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
 
తెర వెనుక హీరో

ఈ సినిమా ఎడిటింగ్ ఉన్నతంగా తీర్చిదిద్దడం  వెనుక పంతొమ్మిదేళ్ల ఉజ్వల్ కులకర్ణి ఉన్నాడంటే, నమ్మశక్యం కాదు. ఉజ్వల్ చదివేది పీయూసీ. కొన్ని లఘు చిత్రాల్లో పని చేసిన అనుభవం మాత్రమే తనది. దర్శకుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి సన్నివేశాన్ని గొప్పగా తీసి, తెర వెనుక హీరోగా మారాడు. ఇటువంటి ఉజ్వల్ గాథలు నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
 
అసలు కేజీఎఫ్ కథ..!
నిజానికి కేజీఎఫ్ అనేది ఉందా?, అంటే అసలు కేజీఎఫ్ కు, సినిమా కేజీఎఫ్ కు చాలా వ్యత్యాసం ఉంది…
కేజీఎఫ్అంటే, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్…
అప్పట్లో కర్ణాటక ప్రాంతాన్ని మైసూరు రాజ్యంగా పిలిచేవారు. ఆ తరువాత ఎంతోమంది రాజులు దీన్ని పరిపాలించారు. అలా.. 1799లో ఈ రాజ్యాన్ని టిప్పు సుల్తాన్ పాలించాడు. 
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నింటిలో టిప్పుదే పై చేయి. ఎన్నో యుద్ధాల అనంతరం టిప్పు మరణించాడు. దానర్థం ఆ యుద్ధంలో ఓడిపోయాడు. 

◆ టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత ఆ రాజ్యాన్ని… బ్రిటీషర్లు తమకు అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తిని రాజుగా నియమించి, రాజ్యాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. 

◆1850ల్లో బ్రిటీష్ అధికారులు మైసూరు లోని కోలార్ అనే ప్రాంతాన్ని సర్వే చేయడం మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో బంగారం దొరుకుతుందన్న పుకారు వారెన్ అనే అధికారి విన్నాడు. 

◆ అతను అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చాడు. ఎవరైతే మట్టిలోంచి బంగారం వెలికి తీస్తారో, వారికి మంచి బహుమానం ఇస్తానని అంటాడు. గ్రామ ప్రజలంతా ఎడ్ల బళ్లలో మట్టిని పోసుకొని, జల్లెడ పట్టగా బంగారపు రేణువులు బయటపడ్డాయి. 

◆ బంగారు గనులున్న చోటు చూసి వారెన్… పై అధికారులకు ఓ లేఖ రాశాడు. ఇక్కడ బంగారు గనులున్నాయి. ఇవి గనుక వెలికి తీస్తే, విలువైన సంపదను పొందొచ్చని ఆ లేఖ సారాంశం. కానీ అధికారులు వచ్చి, ఆ గనుల్ని సర్వే చేయగా, అవి పెద్దగా లాభదాయకం కాదని తెలుసుకొని, వదిలేస్తారు.

◆లావెల్ అనే మరో బ్రిటీష్ సైనికుడు, వారెన్ రాసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురుంచి చదివాడు. అది చదివి ఆసక్తి కలిగి, బెంగళూరు నుంచి కోలార్ కు పయణమయ్యాడు. 

◆ రెండు సంవత్సరాలపాటు సుదీర్ఘమైన పరిశోధన చేశాడు. గోల్డ్ మైనింగ్ చేయడం కోసం తనకు లైసెన్స్ ఇవ్వాల్సిందిగా మైసూరు రాజుకు ఒక లేఖ రాశాడు.

◆ ఆ రాజు, గోల్డ్ మైనింగ్ కు కాకుండా, బొగ్గు మైనింగ్ కు అంగీకారమిస్తాడు. 

◆ రెండు సంవత్సరాలపాటు కొంతమంది కూలీలా సాయంతో, అక్కడ బంగారం తవ్వకాలు జరుపుతాడు. దీనివల్ల బంగారం నిధి మాత్రం పెరగలేదు. ఇతని గురుంచి తెలుసుకున్న 'కోలార్ కన్సెసరీ సంస్థ' అతని వద్దనున్న బంగారం గనుల్ని కొనుగోలు చేసింది. 

◆ ఈసారి గోల్డ్ ను వెలికి తీయడానికి, ఆ కమిటీ టెక్నాలజీని ఉపయోగించింది. ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా యంత్రపరికరాలను దిగుమతి చేసుకుని మరీ మైనింగ్ చేయడం మొదలు పెట్టింది.
 
◆1900కి ఆ గనులకి దగ్గర్లో ఓ టౌన్ షిప్ ను కట్టారు. ఆ టౌన్ షిప్ కి 'కేజీఎఫ్' అని పేరు పెట్టారు. అనతికాలంలోనే అక్కడ ఎంతోమంది బ్రిటీషర్లు, విదేశీయులు స్థిరపడిపోయారు.

◆ లాంతర్లు, కిరోసిన్ దీపాల సాయంతో మైనింగ్ చేయడం కష్టంగా భావించిన ఇంజినీర్లు కావేరి నది ఒడ్డున హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ను నిర్మించారు. 

◆ ఆ పవర్ ప్లాంట్ పొడవు దాదాపు 150 కిలోమీటర్లు. అప్పట్లో ప్రపంచంలోనే అతి పొడవైన వైర్లను కలిగిన ప్లాంట్ ఇది. ఆసియాలోనే రెండో పెద్ద ప్లాంట్(మొదటి ప్లాంట్ జపాన్ లో ఉండేది). 

◆ 1902 కల్లా కేజీఎఫ్ అంతటా కరెంట్ సప్లై ఉంది. కానీ గోల్డ్ నిల్వలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఇక్కడ ఫోకస్ తగ్గి, ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ మీద ఫోకస్ పెరిగింది. 

◆ భారత్ కు స్వాతంత్య్రం వచ్చాక, ఈ కేజీఎఫ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1957కల్లా అన్ని గోల్డెమైన్స్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి. 

◆ ఒకసారి నెహ్రూ గారు పదవిలో ఉండగా, దేశాభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంక్ వద్ద అప్పు కోసం వెళ్తాడు. కానీ సరిపడా ప్రాపర్టీ ని హామీగా చూపకపోవడంతో…లోన్ ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ వెనక్కు తగ్గింది. అప్పుడు నెహ్రూ మా దగ్గర వెల కట్టలేని ఆస్తి ఉంది. అదే కేజీఎఫ్ అని చెప్పాడు. 

◆ 2001 వచ్చేసరికి, కేజీఎఫ్ లో 3 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వి ఉన్నారు. ఉద్యోగుల జీతాలు, ఇతర యంత్రాంగం ఖర్చులు భరించలేక, ఇక మైనింగ్ ను ఆపేద్దామని భావించింది ప్రభుత్వం. 

◆ ఒకప్పుడు ఇండియాలో ఉత్పత్తి అయ్యే బంగారంతో పొలిస్తే, 95 శాతం కేజీఎఫ్ లోనే దొరికేది. 2001కి అది జీరో శాతానికి పడిపోయింది. 

◆ కేజీఎఫ్ లో చాలా బంగారం ఉంది. కానీ అది చాలా లోతుల్లో ఉంది. అంత లోతుల్లో బంగారాన్ని వెలికి తీయడం వల్ల ఎటువంటి లాభం లేదు. 

◆ ఇక్కడ మైనింగ్ అనేది, 200ల సంవత్సరం నుంచే మొదలయ్యింది. ఇప్పటికి గోల్డ్ ను వెలికి తీసే టాప్ ప్లేస్ ఏదైనా ఉందంటే, అది కర్ణాటక!