BREAKING NEWS

'లంక'కేమైంది…?!

శ్రీలంక ప్రస్తుతం ఎమర్జెన్సీని విధించింది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంక ప్రజల్లో రోజురోజుకూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రెసిడెంట్​కు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనలను అణచివేయడానికి ప్రెసిడెంట్​ గొటబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అసలు ఎమర్జెన్సీ విధించేందుకు గల పరిస్థితులు, కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం:
 
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో అల్లర్లు జరిగే పరిస్థితి రావడంతో 36 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు గత శనివారమే ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ కర్ఫ్యూ సోమవారం, అంటే ఈరోజు ఉదయం 6 గంటల వరకూ దేశవ్యాప్తంగా అమలులోనే ఉంది. అల్లర్లకు పాల్పడతారని ఎవరిమీదైనా అనుమానం వస్తే, అది ఎవరైనా సరే వారెంట్లు లేకుండానే అరెస్ట్ చేయొచ్చని మిలిటరీకి ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం. అధ్యక్షుడి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతి భద్రతలను కాపాడేందుకు, నిత్యావసరాలను అందించేందుకే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు రాజపక్స వెల్లడించారు.
 
ఏమైందంటే

ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. అక్కడి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంతలా అంటే కిలో బియ్యం 500ల శ్రీలంకన్ రూపాయలైతే, 400 గ్రాముల పాలపొడి 800ల శ్రీలంకన్ రూపాయలకు చేరింది. షాపుల్లో సరిపడా నిత్యావసరవస్తువులు లేక ఖాళీగా ఉంటున్నాయి. పెట్రోల్ బంక్ ల వద్ద ఉన్న ప్రజలను కంట్రోల్ చేయడానికి శ్రీలంకన్ ప్రభుత్వం ప్రత్యేకంగా మిలట్రీని నియమించింది.

పరీక్షలను నిర్వహించడానికి కనీసం రాసేందుకు పేపర్లు, పెన్నులో సిరా లేక పరీక్షలను రద్దు చేసింది ఆ దేశ ప్రభుత్వం. చాలామంది శ్రీలంకలో ఉండలేక బతుకుదెరువు కోసమని సముద్ర మార్గాన ఇండియాకు వలస వస్తున్నారు. అలా రావడం అక్రమం, అన్యాయమన్న కారణంతో వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అప్పు ఉంటుంది. ఆ అప్పును డెబిట్ అని అంటారు. తమ దేశానికి వచ్చే ఆదాయం సరిపోనప్పుడు ఇలా అప్పు తీసుకుంటుంది. ఆ అప్పును తమ దగ్గర ఉన్న బ్యాంకుల దగ్గరో, స్టాక్ మార్కెట్ లో బాండ్ లను జారీ చేయడం ద్వారానో లేదా వేరే దేశాల దగ్గరో, ఇంటర్నేషనల్ బ్యాంకుల వద్ద అప్పు తీసుకుంటుంది.

తీసుకున్న అప్పును వాయిదా పద్ధతుల్లో చెల్లించాలి. ఎలాగైతే మనం నెల నెలా ఇంస్టాల్ మెంట్ రూపంలో కడతామో అలానే దేశాలు తీసుకునే అప్పు.. ప్రతినెల, సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వేరే దేశాల వద్ద కానీ ఇంటర్నేషనల్ బ్యాంకుల వద్ద కానీ అప్పు తీసుకుంటే దానిని ఎక్స్టర్నల్ డెబిట్ లేదా ఫారెన్ డెబిట్ అని అంటారు. వేరే దేశాల నుంచి అప్పును డాలర్స్ లోనే తీసుకుంటారు. ఇక ఇదే స్టాండెడ్ కరెన్సీ అన్నమాట. డాలర్స్ లో తీసుకున్న అప్పుని డాలర్స్ లోనే తీర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంకకి ఎక్స్టర్నల్ డెబిట్ 56 బిలియన్ డాలర్ల వరకు అప్పు ఉంది. ఇందుకుగాను శ్రీలంక ఈ సంవత్సరం 6 బిలియన్ డాలర్లను కట్టాలి.

కానీ శ్రీలంక వద్ద కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్య ఇదే. అంత అప్పు ఎందుకు తీసుకుంది ఇప్పుడు అది ఎలా తీర్చుతారనేది ప్రధాన సమస్య. శ్రీలంక వేర్వేరు దేశాల నుంచి అప్పు తీసుకోవడం మొదలు పెట్టి ఆ అప్పుని వాళ్ల బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్ మెంట్ నుంచి జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ వంటి ఇంటర్నేషనల్ బ్యాంకుల నుంచి రకరకాల పద్ధతుల్లో అప్పు తీసుకుంది. వడ్డీ అనేది కేవలం సవంత్సరానికి ఒక శాతం మాత్రమే ఉంటుంది. రిపేమెంట్ టైం కూడా 25- 50 ఏళ్లుగా ఉంటుంది. దీనిని కన్సేసరి లోన్ అని అంటారు. 
 
అప్పుఎలా మొదలైందంటే…?!

2010లో శ్రీలంక  తమ దేశ అభివృద్ధి కోసం ఇతర దేశాల నుంచి అప్పు తీసుకోవడం మొదలు పెట్టింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టాలంటే వారి దగ్గర ఉన్నవి సరిపోవు. అందుకు ఇతర దేశాల నుంచి తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా వేరే దేశాల నుంచి తీసుకునే అప్పును కమర్షియల్ లోన్స్ అని అంటారు. ఇక్కడ వడ్డీ సవంత్సరానికి 6 శాతం ఉంటుంది. రీపేమెంట్ గడువు 5-10 సవంత్సరాల వరకు ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కమర్షియల్ లోన్స్ ఎక్కువయ్యాయి. శ్రీలంక చైనా నుంచి ఇంటర్నేషనల్ సొరేన్ బాండ్స్ నుంచి అప్పు తీసుకుంది. వాటితో హైవే ప్రాజెక్ట్స్ ని కొని, డెవలప్ మెంట్ దిశగా ప్రాజెక్టులను నిర్మించింది. అలా కాంట్రాక్షన్ చేసిన వాటిలో హంబెంటోట పోర్ట్ కూడా ఉంది.

ఇది శ్రీలంకలో 2వ అతి పెద్ద పోర్ట్. శ్రీలంక అప్పు తీసుకున్నప్పుడు అక్కడ డాలర్ల చొప్పున ఆదాయం బాగానే ఉండేది. అయితే ఈ ఆదాయం అనేది పర్యాటకుల నుంచి ఎక్కువగా వచ్చేది. అలాగే టీ, కాఫీ పొడులను ఎగుమతి చేయడం ద్వారా కూడా ఆదాయం బానే వచ్చేది. ఇతరేతర ఆదాయం కోసం కేవలం వీటి మీదే ఆధారపడుతూ వచ్చింది. కొత్త రంగాలను పెద్దగా ప్రమోట్ చేయలేదు. వేరే దేశాల ముడిసరుకును పెద్దగా తెచ్చుకోలేదు. అందువల్ల డాలర్ ఆదాయం అక్కడికే ఆగిపోయింది. కానీ అప్పులు తీసుకోవడం మానేయలేదు. ప్రతి సంవత్సరం కట్టాల్సిన ఇంస్టాల్ మెంట్స్ పెరిగిపోయాయి. మరోపక్క దేశానికి వచ్చే ఆదాయం అనేది సరిపోవడం లేదు.
 
◆ 2017లో హంబెంటోట పోర్టులో 85% వరకు షేర్లను చైనీస్ వాళ్లకి 1.12 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. చైనా నుంచి అప్పు తీసుకొని, శ్రీలంక ఇతర వాటికి కట్టడం జరిగింది. మళ్లీ ఆ అప్పుని తీర్చడం కోసం దానిని చైనాకే అమ్మేసింది. ఇది చాలదనట్లు ఈ పోర్ట్ నష్టాల్లో ఉంది. అందుకే మొత్తంగా అమ్మేశారు. 

◆ 2019లో చర్చిలలో, లగ్జరి హోటళ్లలో వరుస బాంబు పేలుడ్లు జరిగాయి. ఈ దాడుల్లో భాగంగా దాదాపు 269 మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వారిలో 45 మంది ఫారినర్స్ ఉన్నారు. ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని తెలిసి, విదేశీయులు శ్రీలంకకి వెళ్లడం మానేశారు. దీంతో పర్యటకరంగం దెబ్బతింది. అక్కడి డాలర్ కరెన్సీ తగ్గిపోయింది. 

◆ 2020 కరోనా లాక్ డౌన్ విధించడం వల్ల ఫారెన్ కరెన్సీ దాదాపుగా వాడకం తగ్గిపోయింది. 

◆ 2021లో కెమికల్ ఫెర్టీలైజర్స్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని నిర్ణయించింది దేశ ప్రభుత్వం. ఇలా చేయడం వలన ఫారెన్ కరెన్సీ మిగిలిపోయి, సహజసిద్ధంగా పెంచినవాటిని ఎక్కువ ధరకు అమ్మి, కొత్తగా డబ్బును జమ చేసుకోవచ్చని భావించింది. దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ లో శ్రీలంక మొదటి స్థానంలో ఉంటుందని అనుకుంది. కానీ అలా జరగలేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని గ్రహించి, అసలు పంటలు వేయడమే మానేశారు. ఇంకొంతమంది ఎక్కువ ఖర్చు చేసైనా పంటలు వేస్తే, 30 బస్తాలు దిగుబడి రావాల్సిన చోట 5 బస్తాలే వచ్చాయి.

పంట దిగుబడి లేక నిత్యావసర సరుకులు లేక రోడ్ల మీది షాపులన్ని ఖాళీ అయిపోయాయి. అందువల్ల శ్రీలంకలో ఆహార సంక్షోభం వచ్చింది. అక్కడి ప్రజలకు సరిపడా మిగులు ఆహారం ఇప్పుడు అక్కడ లేదు. పక్క దేశాల నుంచి తెచ్చుకోవాలన్న డాలర్ కరెన్సీ లేదు. ఉన్నవి కూడా అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ మంచిదే, కానీ ఆచరణ సరిగా లేక అది విఫలమైంది. వేరే దేశాల నుంచి తీసుకున్న అప్పులు కట్టకపోతే సావర్జిన్ క్రెడిట్ రేట్ తగ్గిపోతుంది. నిజానికి ఈ క్రెడిట్ రేట్ అనేది తగ్గకూడదు. ఇది తగ్గకూడదనే అప్పులను తీర్చడానికి కొత్త అప్పులను తీసుకుంటుంది శ్రీలంక. 
 
ఇండియా చేయూత

ఇండియా నుంచి 40 వేల టన్నుల బియ్యం  శ్రీలంక ప్రజలను ఆదుకునేందుకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. నూరు కోట్ల డాలర్ల క్రెడిట్ లైన్ కింద ఈ సాయం చేసేందుకు కేంద్రం ఆమోదించింది. శ్రీలంక స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్​కు గత శనివారమే దక్షిణాది ప్రాంతాలలోని ట్రేడర్ల నుంచి క్రెడిట్ ఫెసిలిటీ అగ్రిమెంట్ కింద ఆహార ధాన్యాలను పంపడం మొదలుపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఇండియా సాయంతో శ్రీలంకకు కొంత ఊరట లభించనుంది. ధరలు కూడా కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. ఇండియా నుంచి అందిన డీజిల్​లో 6 వేల మెట్రిక్ టన్నులు పవర్​ ప్లాంట్లకు వాడతామని అక్కడి అధికారులు చెప్పారు.