BREAKING NEWS

ఆవకాయ - మాగాయి

ఆవకాయ పేరు వింటే,, నోట్లో నీరూరని వారుండరు.
డాక్టర్లు వద్దని చెప్పినా , BP లు షుగర్లు, అల్సర్లు, కడుపుమంటలు లాంటివి ఎన్ని ఉన్నా ,,, ఆ.. ఒక్కసారికి ఏం కాదులే అని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. 

ఇంతటి రుచికరమైన మన ఆవకాయ గురించి చాలా మంది కవులు , రచయితలు కూడా చాలా గొప్పగా వర్ణించారు.
ఆవకాయతో బాటు మాగాయి , తొక్కు పచ్చడి , కొరివికారం లాంటి నిలవ పచ్చళ్ళు ఆయా సీజన్స్ లో పెట్టుకుని సంవత్సరం పొడవునా తినే అలవాటు మన తెలుగువారి సొంతం.

కూర లేకపోయినా , అనుకోకుండా అతిధులు వచ్చినా ఆపద్బాంధవుడిగా ఆదుకునే ఆవకాయను ఎంతో ప్రేమిస్తారు.
ఇంతగా ఇంతమంది నోరూరించే ఈ ఆవకాయ తయారు చేయడం అంత సులువు కాదు సుమా..

పూర్వం చాలా శ్రద్దగా , నిష్ఠగా ,శుచిగా,శుభ్రంగా పెట్టేవారు.
ఈ ఆవకాయ పెట్టడానికి  కలెక్టర్ రకం , లేదా పుల్ల రకాలైన కోళంగోవ , సువర్నరేఖ, రసాలు లాంటి మేలు రకం మామిడికాయలు అవసరం.సుమారుగా మే నెల మొదటివారం అనువుగా ఉంటుంది. 

ముందుగా చక్కని సన్న ఆవాలు తెచ్చుకుని రాళ్లు రప్పలు లేకుండా బాగుచేసి , బాగా ఎండపెట్టి రోట్లో మెత్తగా దంపుకుని దానిని జల్లెడ పట్టి జాగ్రత్త చెయ్యాలి.
మంచి మేలురకం మిరపకాయలు తెచ్చుకుని బాగా ఎండపెట్టి రోట్లో మెత్తగా దంచుకుని జల్లెడ పట్టాలి.

ఉప్పు కల్లులు బాగా ఎండబెట్టి గుండగా దంచాలి. 
మెంతులు , వెల్లుల్లి , పసుపు , బెల్లం లాంటి పదార్దాలు అన్నీ పేరు పేరునా అమర్చుకోవాలి.
నీరు తగలకుండా జాగ్రత్త వహించాలి.

అప్పుడు మామిడి తోటకు వెళ్లి ,  కాయ క్రింద పడకుండా చెట్టునుండి డైరెక్ట్ గా కోయించి తెచ్చుకోవాలి. అలా తెచ్చిన కాయలను శుభ్రంగా తుడుచుకుని ముక్కలుగా చేసుకుని , ముందుగా సిద్ధం చేసుకున్న ఆవగుండ మొదలైనవాటితో ఈ ముక్కలను కలిపి ఒక జాడీలో వేసి మూత పెట్టాలి. కొన్నాళ్ళకు బాగా  ఉరి ఘుమ ఘుమ లాడే ఊరగాయ రెడీ...
అయితే ... ఇదంతా ఆ రోజుల్లో సంగతి.

తరవాత కాలంలో అన్నీ రెడీ మేడ్ వచ్చేసి డైరెక్టుగా పొడుల రూపంలోనే పేకట్లుగా లభిస్తున్నాయి. మార్కెట్ కు వెళ్లడం అక్కడ రెడీగా ఉన్న మామిడికాయలను కొనుక్కుని , అక్కడే ముక్కలుగా కొట్టించుకుని ఇంటికి తెచ్చుకుని ప్లాస్టిక్ బకెట్స్ లో వేసుకోవడం.
అదీ ఓపిక లేని వారికోసం తయారు చేసిన ఆవకాయ కూడా షాప్ లో దొరుకుతోంది.

అందుకే ఆవకాయ వ్యాపారం "మూడు పువ్వులు - ఆరు కాయలు" అన్నట్లుగా ఉంది. 
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలే కాకుండా సైకిల్ వాలాలు కూడా ఈ వ్యాపారంలో రెండు చేతులా సంపాదిస్తున్నారంటే ఈ ఆవకాయకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్లు వద్దంటే , BP లతో , అల్సర్లుతో , షుగర్లుతో బాధపడుతూ తినే వారు ఉంటేనే డిమాండ్ ఇంతలా ఉంటే ...ఇవేవీ లేకపోతే ఈ డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి.

Photo Gallery