BREAKING NEWS

ఫంక్షన్ లు - ఖర్చులు....

పెళ్లికి  పేదా ధనిక బేధం ఉండదంటారు. ఉన్నంతలో ఎవరైనా వాళ్ళ స్థాయికి మించే ఖర్చు చేస్తారు కాబట్టి. పూర్వం అయితే ఇంటి బయట విశాలమైన స్థలం ఉండేది కాబట్టి , ఆరుబయట చలువ పందిళ్లు వేసి పెళ్లిళ్లు చేసేవారు. పెళ్లికి వచ్చిన అతిథులకు , ఇరుగు పొరుగు ఇళ్ళల్లోనూ , బంధువుల ఇళ్లల్లోనూ, ఊర్లో ఇంకా తెలిసిన వారి ఇళ్లల్లోనూ వసతి సదుపాయం కల్పించే వారు పెళ్లి వారు.

కానీ క్రమేపి స్థలాల విలువ అమాంతం పెరగడం మొదలయ్యాక పల్లె , పట్నం తేడా లేకుండా స్థలాలను అంగుళాలలో కూడా కొలుస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో ...!
ఈ పరిస్థితులలో ఎవరు ఇల్లు కట్టుకున్నా  ఇంటిముందు స్థలం విశాలంగా కాదు కదా పట్టుమని పది గజాలు కూడా వదలడం లేదు. ఎప్పుడైనా రాక రాక ఓ సారి అతిధి వస్తేనే వసతికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. మరి పూర్వంలా ఇళ్లల్లో శుభకార్యాలు ఎలా చెయ్యగలరు ???
అందుకే ..

         ఏ చిన్న శుభకార్యం అయినా ఫంక్షన్ హాల్స్ వైపు చూస్తున్నారు. ముందుగా ఓ నాలుగైదు చూడ్డం , అన్నింట్లో ఎదో ఒకటి నచ్చి సెలక్ట్ చేసుకోవడంతో మొదలవుతుంది ...అసలు కథ...

ఫంక్షన్ హాల్ రేటు ఇంత అని చెప్పగానే ,,, పరవాలేదు మన బడ్జెట్ లోనే ఉంది కదా అనుకునేలోగా రూమ్ లో ఉన్న వస్తువులు అంటే  ప్లాస్టిక్ జగ్గు లేదా మూత పోయినా , గాజు గ్లాస్ బద్దలైపోయినా, తాళం చెవి మిస్ అయ్యినా, రిమోట్ లాంటివి పోయినా , కరెంట్ పోయినా, (జనరేటర్ వేస్తారుట)అదనపు చార్జీలు.
ఇవే కాకుండా డెకరేషన్ అదనం ,  హౌస్ కీపింగ్ అదనం , పవర్ అదనం ఇలా మెల్ల మెల్లగా ఒక్కో పాయింట్ చెబుతారు.

అప్పుడు మొదలవుతుంది ...నరాలు తెగిపోయే టెన్షన్.ఇంత బడ్జెట్ భరించగలమా ? మనకు వర్కౌట్ అవుతుందా ?? ఇంకా ఎక్కడైనా తగ్గించగలమా?? వేరే దగ్గర ఇంకా తక్కువకు ఉంటుందేమో? ఇలా వందల ఆలోచనల తర్వాత ఏదో ఒక్కటి ఫిక్స్ అవుతారు.  అది  తప్ప మరో ప్రత్యమ్నాయం లేదు కదా.. .

మిగిలినవన్నీ ముందుగానే బేరం ఆడుకుని ఓ ఫిగర్ నిర్ణయించుకున్నా.  పవర్ మాత్రం ముందుగా నిర్ణయించేది కాదు...
"ఎంత వాడుకుంటే అంత"
బతుకు జీవుడా అనుకుని అడ్వాన్స్ చెల్లించి , ఫంక్షన్ రోజు వచ్చాక అన్ని కండిషన్స్ గుర్తుకొస్తాయి... ఎందుకొచ్చిన తలపోటు అనుకుని , మాకు రిమోట్స్ వద్దు , గ్లాసులు వద్దు , మేము చెప్పినప్పుడు మాత్రమే చెప్పిన దగ్గర మాత్రమే AC లు వెయ్యండి, ఆపమనగానే ఆపేయండి , లైట్స్ అన్నీ వెయ్యొద్దు , లిఫ్ట్ కూడా కొంతసేపు ఆపేయండి లాంటి సూచనలు ఇస్తూ ,  వారు వచ్చిన శుభకార్యం మీద కన్నా కరెంట్ బిల్ ఎలా తగ్గించాలి అనే దానిపై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. మొత్తం మీద డబ్బు ఖర్చు పెడుతూ కూడా పేదరికం అనుభవించక తప్పడం లేదు.. ఏంటో ఇప్పటి పద్దతులు... ఎవరికీ అర్థం కావు... ఎప్పటికీ అర్థం చేసుకోలేరు... 

                   ఫంక్షన్ హాల్ ధరలు కూడా రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఏ చిన్న ఫంక్షన్ చేయాలి అన్నా తక్కువలో తక్కువ 50 వేలు లేనిదే ఒక చిన్న హాల్ కూడా అద్దెకు దొరకదు. ఇక ఇందాక చెప్పుకున్న "అదనపు" లెక్కలు అన్నీ కలిపితే లక్ష దాటుతుంది.. కాబట్టి ఈ రోజుల్లో కాస్త ఆచితూచి ఖర్చులు పెడుతున్నారు. నిజంగా ఆ ఖర్చు అవసరమా లేదా అని ఆలోచించిన తర్వాతే ఏ ఖర్చయినా పెడుతున్నారు.

అవసరం లేకపోతే సేవింగ్స్ చేసుకున్న ఇలా ఫంక్షన్స్ టైమ్ లో ఖర్చు పెడుతున్నారు... ఏది ఏమైనా కాలంతో పాటు మనుషుల అలవాట్లు, సాంప్రదాయాలు కూడా మారుతూ వస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు...

Photo Gallery