BREAKING NEWS

కమ్యూనికేషన్ - పెద్ద పరేషాన్...

కమ్యూనికేషన్... మనం చెప్పాలి అనుకునే విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేలా చెప్పడమే కమ్యూనికేషన్... ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఒక స్కిల్... కానీ ఎంత చదువుకున్నా , ఎన్ని డిగ్రీలు సాధించినా ఈ ఒక్క స్కిల్ లోనే చాలా మంది వెనుకబడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు...

ఇది ఎవరో చెప్తున్న విషయం కాదు. ఒక సర్వేలో తేలిన నిజం.. అధిక శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకి ఉద్యోగాలు రాకపోవడానికి కూడా కారణం ఈ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడమే..... 

                       కమ్యూనికేషన్ లో అసలు ఉండాల్సిన స్కిల్ ఏమిటి.. అందరూ మాట్లాడుతున్నారు. ఎదుటి వ్యక్తికి అర్థం అవుతోంది కదా... ఇంకేంటి ఇబ్బంది అనుకుంటున్నారా... అక్కడే ఉండి అసలు విషయం... అవతలి వ్యక్తి ఏం అడిగారు? మనం ఏం చెప్తున్నాం అనే విషయం కూడా కమ్యూనికేషన్ లో ఒక భాగమే. అదే ముఖ్యం కూడా. కానీ ప్రస్తుతం ట్రెండ్ లో కేవలం వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అదే చెప్తున్నారు తప్ప అసలు ఎదుటి వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే విషయం కూడా  పట్టించుకోవడం లేదు.

ఒకే ప్రశ్న ను కాస్త అటు ఇటుగా మార్చి అడిగినా సరైన సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతారు. కేవలం వాళ్ళు ప్రిపేర్ అయిన విషయమును అదే ఫార్మాట్ లో అడిగితే తప్ప వాళ్లు చెప్పాలి అనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేని పరిస్థితి.. ఫలానా దేశం మహారాజు ఎవరు అంటే వెంటనే సమాధానం చెప్పే వాడు ఫలానా దేశం యువరాజు కు తండ్రి ఎవరు అంటే దిక్కులు చూడాల్సిందే. రెండింటికీ సమాధానం ఒక్కటే... కానీ ఎందుకు చెప్పలేకపోయాడు. ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది. అయితే ఇంతకీ అసలు ఈ పరిస్థితి కారణం ఏమిటి.

                       ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చదువు.... చదువు.. తప్ప వేరే ధ్యాసే ఉండడం లేదు ఇప్పటి విద్యార్థులకు. చదివేది ఎల్.కే.జి. కానీ అదేదో ఐ.ఏ.ఎస్ కి ప్రిపేర్ అవుతున్నట్లు బుక్స్ ముందేసుకుని చదివిస్తూ ఉంటారు. కేవలము పుస్తకంలో ఏం ఉందో అలా భట్టి పట్టేయడం, పరీక్షల్లో రాసేసి మార్కులు తెచ్చుకోవడం. ఇదే రొటీన్ పద్ధతి గా మారిపోయింది. ఇంజనీరింగ్ చేసినా, ఎంబీఏ చేసినా ఈ విధానంలో మాత్రం మార్పు ఉండదు.

ఇక ఇలాంటి విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వస్తాయి. బయట పది మందితో మాట్లాడితేనే కదా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి లాంటి విషయాలు తెలిసేది. కానీ ఇప్పటి తల్లిదండ్రులు అందుకు పూర్తి విరుద్ధం. నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా చదువుకోమని మాత్రమే చెప్తుంటే ఇక జనరల్ నాలెడ్జ్ ఎలా తెలుస్తుంది. అసలు స్కూల్ అనే గ్రీక్ పదానికి "ఖాళీ సమయం" అని అర్థం.. అంటే అన్ని పనులూ పూర్తి చేసుకుని సరదాగా వెళ్ళేది అని అర్థం.

అయితే గతంలో మాత్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు. స్కూల్ అంటే అలాగే ఉండేది. చదువుకునే అంత సేపు చదువుకోవడం తర్వాత ఆటలు, పాటలు అంటూ ఎంజాయ్ చేసేవారు. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేవారు. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఈజీగా అలవాటు అయిపోయేవి. కానీ ఇప్పుడో వేలకు వేలు ఫీజులు కట్టి ఏసి రూములో కూర్చుని నేర్చుకుంటున్నారు. 

                      ఏదైనా సహజంగా అలవాటు అయ్యేదానికి , నేర్చుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పేరెంట్స్ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇంజనీరింగ్ లు చదివేస్తే మాత్రమే ఉద్యోగాలు వచ్చేవు... కమ్యూనికేషన్ స్కిల్స్ పై కూడా దృష్టి పెట్టండి. మీ పిల్లలతో మీరే కాసేపు మాట్లాడండి. వాళ్ళు చెప్పే విషయాలను అర్థం చేసుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత సేపు వారితో మాట్లాడుతూనే ఉండండి. పుస్తకాలతో కుస్తీ పట్టద్దు... అర్థం చేసుకుంటూ చదవండి. బుక్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ముఖ్యం... 

Photo Gallery