BREAKING NEWS

సాహసం చేయరా డింభకా

టూరిజం.... చాలా మందికి ఎంతో ఇష్టమైన విషయం... నిత్యం వేల కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటారు... రాష్ట్రంలో ఎన్నో టూరిజం స్పాట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. అందుకే ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు విశాఖకు వస్తూ ఉంటారు.

ఎన్ని సార్లు చూసినా, ఎంత సేపు చూసినా తనివితీరని అందం విశాఖ సొంతం... అందుకేనేమో ఒక్కసారి సాగర తీరా అందాలు చూసి ముగ్ధులైన వాళ్ళకి సిటీ వదిలి బయటకు వెళ్ళాలి అనిపించదు... ఇక విశాఖ వస్తే చూడాల్సిన ప్రాంతాలు ఏమేం ఉన్నాయి?? ఎలా ఉంటాయి??

వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రామకృష్ణా బీచ్.. అదేనండి మన ఆర్కే బీచ్. సాయంత్రం సమయంలో అలా బీచ్ కి వెళ్లి కాసేపు ఎంజాయ్ చేసి రావచ్చు... సముద్రపు అలలతో సరదాగా ఆడుకోవచ్చు. పౌర్ణమి రోజు గనక ఆర్కే వెళ్తే ఆ అనుభూతే వేరు. నిండు వెన్నెల ఒక పక్క.. గిలిగింతలు పెట్టే సముద్రపు గాలి... రారమ్మంటు పిలిచే ఇసుక తిన్నెలు... ఎంతసేపైనా కదిలి వెళ్లనివ్వవు... ఆర్కే బీచ్ తో పాటు రుషికొండ, యారాడ, భీమిలి బీచ్ ఇలా చాలా రకాల బీచ్ లు విశాఖ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి... ఒక రోజు కేవలం బీచ్ లు మాత్రమే చూసేలా ప్లాన్ చేసుకుంటే ఓ మంచి జ్ఞాపకాలు మీ సొంతం చేసుకోవచ్చు.

బీచ్ లు అన్నీ చూసేసాం ఈసారి కాస్త కొత్తగా, అడ్వెంచర్స్ గా కావాలి అనుకుంటున్నారా. అయితే మీ లాంటి వారి కోసం కూడా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.. వాటిలో ఆంధ్ర ఊటీ అరకు ఒకటి... అరకులో సాహసం చేయాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి... బొర్రా గుహల నుంచి కాస్త దూరంలో ఉన్న కటిక వాటర్ ఫాల్స్ ఎక్కడమే ఓ సాహస యాత్ర...చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో లోతైన లోయ... సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న కటిక వాటర్ ఫాల్స్ ఎక్కడ అంత సులభమైన విషయం కాదు. చాలా కష్ట తరం.. సరైన గైడెన్స్ లేకుండా ఎక్కడానికి ప్రయత్నించడం రిస్క్ తో కూడుకున్న పని. దాదాపుగా 6 కిలోమీటర్లకు పైగా నడవాల్సి ఉంటుంది... ఈ మార్గం మాత్రం చాలా భయంగా ఉంటుంది...

కేవలం మట్టి రోడ్డు మాత్రమే కావడం, ఎలాంటి మెట్లు లాంటివి లేకపోవడంతో జాలు జారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొండ ఎక్కడం పూర్తి చేస్తే కనుల విందు చేసే అద్భుతం మీ ముందుంటుంది... వేల అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకే వాటర్ ఫాల్స్ ను అంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇంకేం కావాలి... ఆ దృశ్యం మాటల్లో వర్ణించలేనిది. నచ్చినంత సేపు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి సాయంత్రం అయ్యేలోపు మెల్లగా కిందకు చేరుకోవాలి... ఎలాంటి లైట్లు లేవు కాబట్టి చీకటి పడితే దిగడం కష్టం అవుతుంది. అటవీ ప్రాంతం కాబట్టి జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది...

 ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.... కేవలం సాహసం చేయడం ఇష్టం అనుకున్న వారు మాత్రమే , అది కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా తర్వాత మాత్రమే కటిక వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళండి. దయచేసి ముందు జాగ్రత్తలు తీసుకోండి... 

Photo Gallery