BREAKING NEWS

చెట్లు- ప్రగతి పథానికి మెట్లు

సృష్టి పరిణామ క్రమంలో వాయుగోళంగా ఉన్న భూమి, చల్లబడి, జలగ్రహంగా మారిన తర్వాత క్రమక్రమంగా జీవార్భావం జరిగిందని శాస్త్రవేత్తలు నిద్ధారించారు... అయితే ఈ భూమి మీద సర్వ ప్రాణులకు ఆధారమైన ఆక్సిజన్ ను అందించేవి చెట్లు... చెట్లు జనజీవనంలో విడదీయలేని భాగాలు... భూమి జీవన విధానానికి, సమతుల్యాన్ని కాపాడటానికి చెట్లు ముఖ్య భూమికలు... సనాతన భారతీయ సంప్రదాయంలో  చెట్లను కూడా ఆధ్యాత్మికతను జోడించే చూసేవారు.. చూస్తున్నారు కూడా.... 

భారతీయ ఆధ్యాత్మికతకు మూల స్తంభాలుగా చెప్పుకోదగిన రామాయణ భారతాది ఇతిహాసాలలోను, పురాణ, ప్రబంధాలలోనూ చెట్ల ప్రస్తావన అడుగడుగునా వస్తుంటుంది... ఉదాహరణకు, రామాయణంలో సీతాదేవి రావణుడి లంకలో అశోక వనంలో శింసుపా వృక్షం క్రిందనే  ఉందని వాల్మీకం.. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతూ, తమ ఆయుధాలను శమీ వృక్షం మీద ఉంచుతారు... దశరా నాడు జమ్మి చెట్టును పూజించటం అనాదిగా వస్తున్న ఆచారమే... ఇక రాజ ప్రబంధమూ, ప్రబంధ రాజమూ అయిన ఆముక్తమాల్యదలో సాహితీ సమరాంగనా సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు మర్రి చెట్టును వర్ణించాడు.

అపౌరషేయాలైన వేదాలలో వృక్షాల ప్రస్తావన ఉంది... ఇక ఉపవేదంగా భాసిల్లుతున్న  *ఆయుర్వేదం* భారతదేశ వైద్యవిధానం... ఇది పూర్తిగా మొక్కలలో ఉన్న  వైద్య సంబంధ విషయాలను నిబిడీకరించుకుంది... 

భాగవతంలో ప్రచేతనుల భార్య *మారిష* చెట్ల సంతానమే... చెట్లకు సంబంధించిన సామెతెలు తెలుగునాట తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.. ఉదాహరణకు, *వేసినప్పుడు వేప మొక్క, తీసినప్పుడు అమ్మవారు*. ప్రతి మొక్కలోనూ, ప్రతి చెట్టులోనూ దైవత్వాన్ని ఆపాదించటం వలన తరతరాలుగా చెట్ల తో విడదీయలేని అనుబంధం మానవులకు ఏర్పడింది... బోధి చెట్టుకింద జ్ఞానోదయమైన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు... ఇంటి ఆవరణలో తులసి మొక్క పెంచటం లక్ష్మీ ప్రదంగా భావిస్తారు... ఇవన్నీ ఒక పక్క.... అయితే, మరోపక్క, శాకాహారులకు ఆహారంగా, వేర్ల నుండీ పువ్వులు ఫలాల వరకూ అన్నింటికీ విశేషమైన ఉపయోగపడుతున్నాయి మొక్కలు... అంతేకాకుండా, చెట్లనుండి  లభించే కాగితం గుజ్జు పుస్తకాల తయారీలోనూ,  కలప గృహోపకరణాలుగానే కాకుండా అనేక విధాలుగా మానవులకు ఉపయోగపడుతున్నాయి....

అంతేకాకుండా, చెట్లు, గ్రీన్ హౌస్ వాయువుల స్థాయిని తగ్గించి, భూతాపాన్ని నిరోధకాలుగా పనిచేస్తాయి.... వర్షాలు చెట్ల వలనే పడుతుంటాయి, వర్షాల వలనే మొక్కలు పెరిగి భూమి పచ్చగా ఉంటుంది... ఇదొక నిరంతరమైన చక్రం.... 

అయితే గత కొంతకాలంగా , జనాభా పెరుగుదల, పారిశ్రామికీ కరణ, పట్టణీకరణ వంటి పరిణామాలతో భూమి మీద చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, భూతాపం పెరిగి పోవడం, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగీ భూమి వేడెక్కిపోతోంది.... గ్లోబలైజేషన్ కాస్తా గ్లోబల్ వార్మింగ్గ్ వైపు పయనమౌతోంది... జనాభా పెరుగుదల, నాగరికత పేరుతో ఎప్పటినుండో ఉన్న చెట్లను నరికివేయడం వీటికి మూలకారణం.....

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగ్రహం మరో వాయుగ్రహంగా మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు... కాబట్టి, ఇప్పటికైనా మానవాళి మేల్కొని, మేల్కంటే, మొక్కల పెంపకాన్నీ ప్రోత్సహించాలి... ఒక చెట్టు నరికితే పది మొక్కలు నాటాలనే నినాదాన్ని కార్యరూపంలోకి తేస్తేనే భూమి మీద ఆరోగ్యకరమైన వాతావరణం వెల్లివిరిసి సుభిక్షమై సస్యశ్యామలమౌతుంది..... వృక్షోరక్షతి రక్షితః అనే నానుడికి అసలైన అర్థం అందరికీ తెలుస్తుంది.... పుట్టిన రోజుల నాడో, పెళ్లి రోజుల నాడో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకుని మనల్ని మనం కాలుష్యం నుండి రక్షించుకోవడంతో బాటు మన భూ గ్రహాన్ని రక్షించుకుందాం.

Photo Gallery