BREAKING NEWS

అమ్మా... 'మాతృవందనం' నీకు!

 ఎదుటివారి నుంచి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండే గుణమే ప్రేమ. అలాగే ఎదుటివారి అభ్యున్నతి కోసం సర్వస్వం వదులుకోవడమే త్యాగం. 
అలాంటి ప్రేమ, త్యాగం రెండు కలగలసిన మూర్తి ఒక్కరే! ఆమె మాతృమూర్తి.
 
వాయు పురాణం ప్రకారం 'మాతృవందనం'లో అమ్మ గురుంచి 16 శ్లోకాలున్నాయి. వీటినే మాతృషోడశిగా చెబుతుంటారు. అమ్మ పడ్డ కష్టానికి, చేసిన త్యాగానికి, అమ్మగా మారి బిడ్డను గొప్పగా తీర్చిన తీరుకి నివేదనగా కడుపులోని శిశువు చాటుతున్న ఈ శ్లోకాల గురుంచి అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్బంగా ఈరోజున తెలుసుకుందాం:
 
1. ఒకటవ శ్లోకం:
"గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమి వర్త్మని
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: గర్భిణిది ఒక రకమైన కష్టం కాదు.
నెలలు గడిచినకొద్దీ ఆమె రూపు మారిపోతుంది. శరీరం భారమవుతుంది. స్నానం నుంచి తినడం, నడవడం,
బట్టలు మార్చుకోవడంలాంటివన్ని ఇబ్బందితో కూడుకున్నవే. ఎగుడుదిగుడు నేల మీద అడుగు తీసి అడుగు వెయ్యడం అంతకన్నా కష్టం. మెట్లు ఎక్కలేదు. దిగలేదు. అలాంటి దశని తెలిపేదే ఈ శ్లోకం.
 
2. రెండవ శ్లోకం:
"యావత్ పుత్రోన భవతి, తావత్ మాతృశ్చ చింతనం
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: 'అమ్మా... పుట్టింట్లో నిన్ను అల్లారుముద్దుగా పెంచారు. అత్తింట్లో కూడా అందరి మన్ననలూ పొందావు. అయినా కేవలం సంతానం కలగలేదన్న కారణంగా నువ్వు బాధపడ్డావు. పిల్లలు పుడితేనే జన్మ సార్ధకం అని అనుకున్నావు. నేను ఎటువంటివాడినో, నా గుణం ఎటువంటిదో నీకు తెలియదు. అయినా నాకోసం పరితపించావు'. నేను బయటకు రాక నిన్ను ఏడిపించానే అని బిడ్డ తల్లిని ఉదేశించి తెలిపేదే ఈ శ్లోకం.
  
3. మూడవ శ్లోకం: 
"మాసి మాసి కృతం కష్టం వేదనా ప్రసవేఘచ
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: అమ్మా...! నెలలు దాటుతున్నపుడు నరకం అనుభవిస్తూ మృత్యువు నీడలోకి చేరావు. నీ ప్రాణాన్ని నిలబెట్టవలసిన నేను లోపల ఏ స్థితిలో ఉన్నానో, నా రూపురేఖలు ఎలా ఉన్నాయో నీకు తెలియకపోయినా నాకోసం ఇంత కష్టాన్ని అనుభవించావు. తలకిందులుగా తపస్సు చేసినా నేను నీ రుణాన్ని తీర్చుకోగలనా? అంటూ తల్లిని ఉదేశించి బిడ్డ తెలిపేదే ఈ శ్లోకం.
 
4. నాల్గవ శ్లోకం: 
"సంపూర్ణ దశమే మాసి అత్యంతం మాతృపీడనం
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: పది నెలలు నిండిన తర్వాత
తల్లి పడే వేదన వర్ణనాతీతం! అయినా ఆమెకు వంశాకురం ఎదుగుతున్నాడన్న సంతోషం లోలోపల కలుగుతూంటుంది. బాధ, సంతోషం రెండూ మోములో కదలాడుతుండగా ఆమె వీపు ఏ గోడకో, ఏ చెక్కకో వాల్చి, గుండెలను వెనక్కి,  కడుపును ముందుకు నెట్టి, కటికనేలపై కూర్చోవడం మాతృత్వపు శోభకు నిదర్శనం! అట్టి నీకు నా మాతృపిండాన్నే సమర్పిస్తున్నాను.
 
5. ఐదవ శ్లోకం: 
"పాదభ్యాం తొడ యేక్ పుత్ర: జనన్యా: పరివేదనం:
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: లోకంలో ఎవరి చేతనైనా దెబ్బలు తింటే అవమానంగా భావించి, జీవితాంతం బాధపడతాం. కానీ తల్లి ఈ తోపులకు పులకిస్తుంది. బిడ్డ తనకు సత్కారం చేసినట్లు భావిస్తుంది. ఇరుకు ప్రదేశం కాబట్టి అటుఇటు కదిలేందుకు అవకాశం లేక కడుపులో ఉండగా తన్నాడని సరిపెట్టుకుంటుంది. బయటకు వచ్చాక మాత్రం తన్నలేదా? అంటే, పాలు తాగుతూనే గుండెల్ని తంతాడు. ఆమె పరమపవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని పట్టుకుని ఆటలాడతాడు. కానీ ఆ తల్లి కోపం తెచ్చుకోకుండా ఆ చిన్ని పాదాల్ని, చేతుల్ని ముద్దాదుతుందని తెలిపేదే ఈ శ్లోకం.
 
6. ఆరవ శ్లోకం: 
"శైథిల్యం ప్రసవే ప్రాప్తి, మాతా విందతి దుష్కరం
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: ప్రసవంలో రక్తం చాలా పోతుంది. శరీరం బలహీనమవుతుంది. గర్భాశయం సాధారణ స్థితికి చేరేవరకు కోలుకోదు. తనకు ఇష్టమైనవి, తన ఆరోగ్యానికి కావలసినవన్ని తినలేదు. తనేదైనా తింటే తన పాలు తాగే బిడ్డకు పడదేమోనని భయం. అందుకు ప్రతిగా నేను ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నానని బిడ్డ తల్లిని ఉదేశించి తెలిపిన శ్లోకం.
 
7. ఏడవ శ్లోకం:
"అగ్నినా శోషయేద్దేహం, త్రిరాత్రో పోషణం చయక్
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: బిడ్డ పుట్టడం కోసం, పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఆరోగ్యం కోసం ఎన్నో ఉపవాసాలు చేసిన తల్లి మరణాంతరం మూడు రోజులపాటు ఆహారం లేకుండా అగ్నిలో శోషణకు గురవుతుంది. అపుడు ఆమె పడే బాధను ఆ బిడ్డను ఎలా కదిలిస్తుందో చెప్తుంది ఈ శ్లోకం.
  
8. ఎనిమిదవ శ్లోకం:
"పా పౌ యా కటు ద్రవ్యాణి క్వాధాని వివిధావిచ
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: వేవిళ్ళ సమయంలో ఆమెకు అన్నం వాసన సైతం పడదు. అంటే మృత్యు ముఖంలోకి వెళ్లినట్లే కదా! ఏదో ఒకటి తినకపోతే లోపల బిడ్డ పరిస్థితి ఏంటని? ఇది అది అనకుండా అన్ని రకాలైన చేదు, కషాయాలు తినడం, తాగడం చేస్తుంది. అవి తింటే కడుపులో, గుండెల్లో మండుతుంది. అయినా కూడా పరిచయం లేని ఒక జీవి కోసం తల్లి ఇన్ని కష్టాలు పడుతుందని తెలిపేదే ఈ శ్లోకం.
 
9. తొమ్మిదవ శ్లోకం: 
"అహర్నిశం తు యన్మాతు: స్థనపీడా మదా మహం
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: పిల్లవాడి ఆకలి తీర్చడం కోసం స్వాభిమానాన్ని సైతం పక్కకు పెట్టి బహిరంగంగా స్తన్యం ఇవ్వడానికి వెనుకాడదు తల్లి. ఆమె ఒంటరిగా ఉందా, పదిమందిలో ఉందా, ఇది పగలా, రాత్రా, తనేమైనా తిందా, ఒంట్లో ఓపిక ఉందా, లేదా అనే ఆలోచన లేకుండా నిరంతరం పాలకోసం ఏడ్చి, అల్లరి పెట్టినా... నన్ను భరించిన నీకు ప్రతిగా నా మాతృపిండాన్ని సమర్పిస్తున్నానని తల్లిని ఉదేశించి బిడ్డ తెలిపేదే ఈ శ్లోకం.
  
10. పదవ శ్లోకం: 
"రాత్రే మూత్ర పురిషాభ్యం భిద్యతే మాత్రు కర్పటే
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: పాలకు వేళ లేనట్లే, మాలమూత్ర విసర్జనకు కూడా బిడ్డకు వేళపాల ఉండదు. ఏ చోటనేది అవసరం లేదు. నిద్రపోతున్నపుడు ఆమె పక్క పాడు చేస్తాడు. దుప్పటి, పరుపు తడిపి ఆమెకు నిద్రలేకుండా చేస్తాడు. వెంటనే లేచి ఆమె అవన్నీ శుభ్రం చేసి, పక్కలు మార్చి నిద్రకు ఉపక్రమిస్తుంది. ఆమె ఆరోగ్యంగా ఉన్నపుడు ఇలా ఉంటే పర్లేదు, ఇక అనారోగ్యం పాలైతే పడే అవస్థ చెప్పలేనిదంటూ తల్లిని ఉద్దేశించి బిడ్డ చెప్పేదే ఈ శ్లోకం.
 
11. పదకొండవ శ్లోకం: 
"మాఘే మాసి నిదాఘేచ, శిశిరాతప దు:ఖితా
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: నువ్వు నా పాలిట సృష్టికర్తవు. స్తన్యమిచ్చి, గోరుముద్దలు తినిపించిన స్థితికారివి. జో కొట్టి వేళకు నిద్రపుచ్చే లయకారివి. నువ్వు నాకోసం శిశిర తాపాన్ని భరించావు. చలికి వణికావు. కఠోరబాధను అనుభవించావు. నీ వల్ల నా ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందేమోనని జంకావు. నేనేం చేస్తే నీ రుణం తీరుతుందమ్మా అని బిడ్డ తల్లిని ఉదేశించి ఆవేదన చెందెదే ఈ శ్లోకం.
  
12. పన్నెండవ శ్లోకం: 
"క్షుత్రిగాభ్యం వ్యాకుతే పుత్రే యాన్నం నీరం ప్రయచ్ఛతి
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: నాకు ఎప్పుడు ఆకలి వేస్తుందో, ఎప్పుడు దాహం వేస్తుందో తెలుసుకొని సమయానికి సమకూరుస్తావు. అందుకు ప్రతిగా నా మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నానని తెలిపేదే ఈ శ్లోకం. 
 
13. పదమూడవ శ్లోకం: 
"అల్పాహారాచ మాతా యావత్ పుత్రోష్టి బాలక:
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: బిడ్డను పోషించే క్రమంలో అమ్మ... తన ఆకలి సంగతి చూసుకోదు. ఏ బిడ్డ కూడా అంతా నాకే పెట్టేస్తున్నావే, అమ్మా.. నీకేమైనా మిగుల్చుకున్నవా అని అడగడు. అలా అడగాలని తల్లి ఆశించదు కూడా! అందరు పిల్లలు తినగా మిగిలినదానినే అల్పాహారంగా స్వీకరించిన నీకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను.
 
14. పదనాల్గోవ శ్లోకం: 
"పుత్రే వ్యాధి సమాయుక్తే శోకార్తా జనన్యే వచ,
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: తల్లి... బిడ్డ అనారోగ్యం పాలైనప్పుడు శుశ్రూష చేస్తుంది. బాధపడుతుంది. బాగవ్వాలని మొక్కులు మొక్కుతుంది. ఉపవాసాలు చేస్తుంది. బిడ్డ ఎంత పెద్దవాడైనా తన చేత్తో తిండి పెట్టాలని ఆరాటపడుతుంది. తినకపోతే ఆరోగ్యం బాలేదని బెంగపడుతుందని తల్లిని ఉదేశించి బిడ్డ తెలిపేదే ఈ శ్లోకం.
  
15. పదిహేనవ శ్లోకం: 
"గాత్రభంగో భవేన్మాతు: మృత్యురేవ న సంశయ:
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: బిడ్డ పుట్టిన ఘడియల్లో అమ్మ శరీరం కళ తగ్గి, మృత్యుముఖంలోకి వెళ్లి వస్తుంది. అయినా కూడా బిడ్డను కంటుంది. అటువంటి తల్లిని ఉదేశించి బిడ్డ తెలిపేదే ఈ శ్లోకం.
 
16. పదహారవ శ్లోకం:
"యమద్వారే మహా ఘోరే ఖ్యాతా వైతరిణీ నదీ,
తస్య నిష్క్రమణార్థయ, మాతృపిండం దదామ్యహం"
 
అర్ధం: మరణానంతరం వైతరిణీ నదీని దాటడానికి తల్లికి తోడ్పడేవాడు కొడుకొక్కడే! యమద్వారం ముందు మహా ఘోరమైన వైతరిణీ నది ఉంటుంది. అది నువ్వు దాటడానికి వీలుగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నానని తల్లి గురుంచి శిశువు చెప్పే మాటలివి. ఎంతో హృద్యంగా మలచిన ఈ శ్లోకాలు ఎప్పటికైనా, ఎన్నటికైనా చదవదగినవే!