BREAKING NEWS

సినిమా పేరే ఇంటి పేరైంది : 'సిరివెన్నెల'

"నిగ్గదీసి అడుగు..
ఈ సిగ్గులేని జనాన్ని,
అగ్గితోటి కడుగు..
ఈ సమాజ జీవచ్ఛవాన్ని,
మారదు లోకం!
మారదు కాలం!
దేవుడు దిగిరాని..
ఎవ్వరూ ఏమైపోనీ,
మారదు లోకం!"
అంటూ...

సమాజపు పోకడల్ని ప్రశ్నిస్తూనే, అంతర్మథుల్ని చేసింది ఆయన రచన. 

'జగమంతా కుటుంబం నాది,
ఏకాకి జీవితం నాది,
సంసార సాగరం నాది, 
సన్యాసం, శూన్యం నాది.
కవినై, కవితనై
భార్యనై, భర్తనై…' అన్ని తానై… సాగే ఈ పాటలో జీవిత సారాన్ని రంగరించారాయన.

తొలుత కవితలు, వ్యాసాలు, పాటలతో మొదలై..ఎన్నో సినీగీతాలకు ఆలవాలమైంది ఆయన సాహిత్యం!

'గాఢమైన తాత్విక చింతన,
మనిషికి, ప్రకృతికి మధ్యనున్న అనుబంధం, 
సమాజంలోని సమస్యల' గురుంచే నిత్యం తపించేవారు. 

'గాయాలను మాన్పే
వైద్యుడవుతాడనుకుంటే..,
తన పాటలతో ఎంతోమందికి 
మానసిక వైద్యుడయ్యారు' శాస్త్రిగారు.
"విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం”...
అంటూ సాగిన ఆయన పాటల ప్రస్థానం ఎన్నో వేల పాటలకు అంకురార్పణ చేసింది.

మొదటి సినిమా పేరైన 'సిరివెన్నెల'నే ఆయన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి పుట్టినరోజు ఈ నెల(మే 20న)కావడంతో 'సిరివెన్నెల సీతారామశాస్త్రి'గారి సినీ, జీవిత విశేషాల గురించి ప్రత్యేకంగా...

బాల్యం:-
1955 మే 20న శ్రీ డా.సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు అనకాపల్లిలో సీతారామశాస్త్రిగారు జన్మించారు.తమ్ముడు శ్రీరామ్, చెల్లెలు కామేశ్వరీ. వీరిది ఉమ్మడి కుటుంబం. తండ్రి చెంబోలు వెంకటయోగిగారు. డాక్టర్ సివి యోగిగా అందరికి సుపరిచితులు. అనకాపల్లిలో హోమియో వైద్యుడిగా పనిచేసేవారు. శాస్త్రిగారు హై స్కూల్, ఇంటర్ చదువును కాకినాడలో పూర్తి చేశారు. భగవద్గీత, శబ్దమంజరిలాంటివి చిన్నప్పుడే చదివేశారు. సత్యారావుగారు వీరి కుటుంబానికి శ్రేయోభిలాషులు. శాస్త్రిగారిని తమ్ముడిలా చూసుకునేవారట. 

తండ్రి ప్రభావం :-

శాస్త్రిగారి తండ్రి హిందీ మాస్టారు. కానీ హిందీలోని పాఠాన్ని ముందుగా తెలుగులో చెప్పాకే, ఒక్కో హిందీ వాక్యాన్ని మరలా తెలుగులోకి అర్ధం చెప్పేవారట. హిందీ భాషను తెలుగులో, తెలుగును ఇంగ్లీష్ లోకి, ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అప్పటికప్పుడే రియల్ టైం ట్రాన్స్ లేషన్ చేసేవారు. 

15 భాషల్లో అపార పాండిత్యం ఉంది. వేదాల్లో తర్క,వ్యాకరణాల్లో ఆయన అధ్యయనం చేశారు. 

ఉదయం నుంచి అర్ధరాత్రివరకు ట్యూషన్లు, కాలేజీలో పాఠాలు అయిపోయాక సాయంత్రం హోమియో ప్రాక్టీస్ తో నిత్యం 19 గంటలు నిర్విరామంగా పని చేసేవారు. ఒకరకంగా మిలిటరీ డిసిప్లైన్ పాటించేవారు. కుటుంబం కోసం అనుక్షణం తపించేవారు.

నాన్న కోరిక:-

సీతారామశాస్త్రిగారిని తన తండ్రి ఒక డాక్టర్ గా చూడాలనుకున్నారట. ఇంటర్ తర్వాత శాస్త్రిగారికి కాకినాడలో ఓపెన్ కేటగిరీలో మెడికల్ సీటు వచ్చింది. పుస్తకాలు, ఫీజులు కలిపి నెలకు రూ. 300లు ఖర్చయ్యేది. దీనికోసం ఆయన తండ్రి ప్రతిరోజు చెప్పే ట్యూషన్లకన్నా అర్ధరాత్రులు ఇంకో గంటసేపూ ఎక్కువగా ట్యూషన్లు చెప్పేవారట. కానీ శాస్త్రిగారు అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివారు. ఎంబీబీఎస్ అనగానే ఇంగ్లీష్ చదువు, ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి రావడంతో తెగ ఇబ్బంది పడ్డారట!

ఇదే సమయంలో శాస్త్రిగారికి పదవ తరగతి మార్కులతో పోస్టల్ అండ్ టెలికాం సంస్థలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 300ల జీతం అనగానే సంబరపడ్డారు. కానీ నాన్న కోరిక తీర్చలేనని, ఈ ఎంబీబీఎస్ చదువును ఇంతటితో ఆపేసి, తర్వాతి రోజుల్లో డిగ్రీ, అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తానని ఆటు శ్రేయోభిలాషి అయిన సత్యరావుకు, ఇటు తండ్రికి మాటివ్వడంతో అంతటితో డాక్టర్ చదువుకు ముగింపు పడింది. 

రాజమండ్రిలో ఉద్యోగం. అడపదడపా కవితలు, పాటలు రాస్తూ ఉండేవారు. వచ్చిన జీతంతో ఉండటానికి, ఖర్చులకు సరిపోయేవి. అలా రచనలపై దృష్టి సారించారు. కళాసాహితీ, నెల నెలా వెన్నెల అనే పేరుతో నిర్వహించే సాహితీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అలా స్థానికంగా కవులు, రచయితలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారితో నిత్యం చర్చలు జరిపేవారట. ఆయన ప్రతి కార్యక్రమంలో కవితను స్వయంగా పాడేవారట. పాడాలని విపరీతమైన కోరిక. 

అన్నగా పిలుచుకునే సత్యరావ్ గారు శాస్త్రిగారిని డిగ్రీ చేయమని గుర్తు చేయడమే కాక ఫీజులు కట్టేవారట. అలా ప్రైవేటుగా డిగ్రీ రాసేసరికి ఏడేళ్లు పట్టింది.

నాన్న మరణం:-

శాస్త్రిగారు 21 సంవత్సరాలునప్పుడు ఆయన తండ్రి 40 ఏళ్ల వయస్సులో చనిపోయారు. దీంతో ఆయన మీదే ఆధారపడ్డ కుటుంబసభ్యులు బాగా కుంగిపోయారు. దీంతో చేసేదిలేక కుటుంబ భారాన్ని శాస్త్రిగారే తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

నెలకు రూ.1500లు అవసరమున్నా, వచ్చే జీతం, ట్యూషన్లు కలిపి రూ. 700లతోనే కొన్నాళ్లపాటు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. శాస్త్రిగారి తమ్ముడైన శ్రీరామ్ గారు హోమియో ప్రాక్టీస్ చేస్తూ అన్నకి తోడయ్యారు.

ట్యూషన్స్ బాధ్యతను శాస్త్రిగారే తీసుకున్నప్పటికీ, సబ్జెక్టు చెప్పకపోయినా, వ్యక్తిత్వ వికాసం, జీవిత పాఠాల్ని, అనుభవాల్ని పంచుకునేవారు. 1978లో పద్మావతిగారితో వివాహమైంది. ముగ్గురు పిల్లలు.


సినీగేయ ప్రస్థానం:-
ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ 'సిరివెన్నెల' సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు.

తక్కువ పదాలు..నిండైన భావం…" కనిపిస్తుంది ఆయన పాటల్లో…

మచ్చుకు కొన్ని పాటలు:-

"రుద్రవీణ"లోని 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' పాటతో జాతీయ అవార్డు అందుకున్నారు. "స్వర్ణకమలం"లోని 'ఆకాశంలో ఆశల హరివిల్లూ' 'అందెల రవమిది'...

"గాయం"లో 'అలుపన్నది ఉందా..', 'నిగ్గ దీసి అడుగు..', రాష్ట్ర నంది అవార్డు సాధించి పెట్టాయి. కళ్ళు - తెల్లారింది లేగండోయ్..
కోకొరొక్కో… మంచాలిక దిగండోయ్. చక్రం - జగమంత కుటుంబం నాది... గమ్యం - ఎంతవరకూ ఎందుకొరకూ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - మరీ అంతగా..నువ్వొస్తానంటే నేనొద్దంటానా  మహాత్మ - ఇందిరమ్మ.. ఇలాంటి మరెన్నో పాటలకు ఉత్తమ గేయ రచయితగా, ప్రతిష్టాత్మక పురస్కారాలతోపాటు, నంది అవార్డులు వరించాయి.

◆2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది.

పాటల వెనుక:-

◆'స్వర్ణ కమలం'లోని 'శివపూజకు చిగురుంచిన సిరిసిరి మువ్వ' పాటకు 15 రోజుల సమయం పట్టిందట.

◆'ఖడ్గం' సినిమాలోని ఒక పాట రాయడానికి ఏకంగా ఖురాన్ చదివేశారట.ఒక్కోసారి పాట కోసం రాత్రి 8 గంటలకు కూర్చుంటే ఉదయం 8వరకు రాస్తుండేవారట.

◆కృష్ణ వంశీ తెరకెక్కించిన 'సింధూరం' సినిమాలో ఆయన రాసిన 'అర్థ శతాబ్దపు పాట' సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

◆దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'గాయం' సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని…' అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను రాసి నటించగా, పాటకు నంది పురస్కారం లభించటం విశేషం.30 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో 'ఏ రోజు పాటను వృత్తిలా భావించలేదు.  ప్రతి పాటను నా బిడ్డగా భావిస్తానని' ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

◆ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'గారిని, తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'గారిని భావిస్తాను.

◆మొదట్లో 'భరణి' అనే కలం పేరుతో కవితలు, వ్యాసాలు, పాటలు రాసేవారట. 
గుండెమంటల్ని రగిల్చే పాటల్నే కాదు గుండెల్లో గూడుకట్టుకున్న అందమైన  ప్రేమ గీతాలను కూడా రాశారు. 

ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని "సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా.." అంటూ నేటి తరానికి తగ్గట్టు పాటని మలిచారు.
కోట్లాది సినీప్రేక్షకుల మనసుల్ని రంజింపజేసిన ఆయన గీతాలు  అజరామరం!