BREAKING NEWS

అపరభగీరథుడు: 'కాటన్' దొర..!

150 ఏళ్ల క్రితం భారతదేశంలో మెట్ట పంటలే గతి. వర్షాల్లేక పంటలు పండేవి కావు. ఆకలిచావులు లక్షల్లో ఉండేవి.  ఆయన కృషే లేకుంటే గోదారి ఏడారే! వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపాడు ఆ భారతాంగ్లేయుడు. ఉభయగోదావరి జలాలను సస్యశ్యామలం చేశాడు ఆ మహనీయుడు. గుర్రంపై ప్రాంతసర్వే చేసిన ఘనుడు. ప్రజల గొంతుకలను తడిపిన సేవకుడు. 'సర్' బిరుదాంకితుడిగా, కాటన్ దొరగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయిడుగా వెలుగొందారు. ఆయనే ఆర్థర్ కాటన్.. "సర్ ఆర్థర్ కాటన్".

మే 15న ఆయన జయంతి సందర్భంగా కాటన్ జీవిత విశేషాలను ప్రత్యేకంగా  తెలుసుకుందాం:
 
1803 మే 15న బ్రిటన్ లో హెన్రి కాల్వేలి కాటన్ దంపతులకు ఆర్థర్ కాటన్  జన్మించాడు.

15 సంవత్సరాలప్పుడు ఇండియా వచ్చి బ్రిటిష్ సైన్యంలో ఇంజనీరింగ్ గా పనిచేయడానికి ఇంగ్లాండ్ లో శిక్షణ పొందారు. 18నెలల శిక్షణ పూర్తయ్యాక ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఆయన ప్రతిభను, ప్రవర్తనను మెచ్చి, రాయల్ ఇంజినీరింగ్ సంస్థలో చేర్చుకున్నారు. 

1822లో సూపర్ ఇండెంట్ ఇంజనీర్ అయిన పులర్టన్ కి, కాటన్ ను అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ గా నియమించారు. చెరువుల నీటి నిల్వ, పంపిణీ తదితరాల మీద పరిశీలనలు జరిపారు. 

1836లో కాలెరూన్ ఆనకట్ట నిర్మించాడు. మద్రాస్ పోర్ట్ నిర్మాణ బాధ్యతను చేపట్టాడు. తరువాత మద్రాస్ లో సెంట్ థామస్ మౌంట్ వద్ద మిలటరీ భవనాల నిర్మాణ పనుల్లో చేరారు. ఇక్కడే లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్ హోదాకి చేరారు. కావేరి ఇరిగేషన్ ప్రత్యేక బాధ్యతల్ని సైతం ప్రభుత్వం అప్పగించింది. 1841లో ఎలిజబెత్ ను వివాహం చేసుకున్నారు.

1846లో ధవళేశ్వరం మీద ఆనకట్ట ప్రారంభమై 1852కల్లా పూర్తయింది. 
 
తెలుగు జిల్లాలో కాటన్ ఆనకట్టలిలా:-
 
◆1836లో అడ్డు ఆపు లేకుండా ప్రవహించే కాలెరూన్ నదీ జలాలపై అధ్యయనం చేసి, దాని చుట్టుపక్కల గ్రామాల్లో సైతం సాగు జరిగేలా కృషి చేశారు. 

ఏపీలోని విశాఖపట్నాన్ని సముద్ర అలల కోత నుంచి రక్షించడానికి, వాల్తేరులో సెంట్ జాన్స్ చర్చ్ నిర్మాణ పనులకోసం కాటన్ ను ఇక్కడికి రప్పించారు. 

అలా సముద్రతీరం నుంచి వస్తున్న కాటన్ కు మానవ, జంతు మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనపడ్డాయి. ఆ దృశ్యం చూసి ఆయన మనసు చలించిపోయింది. ఈ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు. 

సముద్ర మట్టం నుంచి 50 అడుగుల పొడవునా, వరుసగా నిర్దిష్టమైన దూరంలో విడివిడి రాతి కట్టడాల్ని నిర్మించగలిగితే అలలు అదుపులోకి వస్తాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు, నివేదికలు సమర్పించాడు.

అయితే ఒట్టి రాతి కట్టడాల వల్ల సమస్య పరిష్కారమవ్వదని ఆనాటి ఇంజనీర్లు కాటన్ ఆలోచనను ఎగతాళి చేశారు. కానీ నిరాశ చెందకుండా అనుకున్న సమయానికి తీరం పొడవునా రాతి కట్టడాల్ని నిర్మించాడు. ఆ రాళ్ళ మధ్య ఇసుక, మట్టి చేరడంతో మరింత బలం చేకూరి ఆ రాతి నిర్మాణాలు బలపడ్డాయి.
 
◆1839లో పెను ఉప్పెన తాటికి గోదావరి జిల్లాలు అల్లాడిపోయాయి. ప్రజలు అతివృష్టి, అనావృష్టిలతో విలవిలాడిపోయారు. ఆకలికి తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోయేవారు. గుంటూరులో తీవ్రమైన కరవు వల్ల ప్రతి 5మందిలో ముగ్గురు చనిపోయేవారట.

వరదలకు ఏకంగా 2 లక్షలమంది మృత్యువాత పడ్డారు. ఈ సమస్య పరిష్కార బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ కు అప్పగించింది. 1844-45 మధ్య డెల్టాలో గుర్రంపై విస్తృతంగా ఒక్కడే సర్వే చేశాడు. 

గోదావరి ప్రాంతమంతా ప్రవాహ వేగం, లోతు, మిట్ట పల్లాలను పరిశీలించి సమస్యను తెలుసుకున్నాడు. అనకట్టలు, నీటి కాల్వలు ఏర్పరిస్తే నది నీటిమట్టాన్ని పెంచి మెరకగా ఉన్న సాగు పొలాలకు నీరు పారే అవకాశం కల్పించొచ్చని భావించాడు.

ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించాలనుకున్నాడు.

గోదావరి - కృష్ణా డెల్టాలకు కలిపి 20 లక్షల ఎకరాలకు వరి సాగు చేసుకోవచ్చని, 30లక్షలకు మించని వ్యవసాయ ఉత్పత్తిని 2కోట్లకు పెంచవచ్చని, 22లక్షల వరకు శిస్తు వసూలు చేస్తున్న ఈ ప్రాంతం నుంచి 50 నుంచి 60 లక్షల వరకు శిస్తు వసూలు చేయొచ్చని సవివరంగా తన నివేదికలో తెలిపాడు. ఈ నివేదికను పరిశీలించిన మద్రాస్ ప్రభుత్వం అధికారుల అభిప్రాయాలను సేకరించి 4 నెలల తరువాత ఒప్పుకుంది. 

1846లో ఆనకట్ట మొదలై 1852లో పూర్తయింది. 11,849 అడుగుల పొడవునా తాటి బోదలు, టేకు, సున్నపురాయిలతో ఈ ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఇందుకూ 15లక్షలు ఖర్చయింది.

మొదట 3 అడుగుల ఎత్తులో తలుపులు నిర్మించి, ఎప్పటికప్పుడు వాటి ఎత్తును పెంచుకుంటూపోయారు.  ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకున్నా, నిధులు అంతంతమాత్రంగా వచ్చినా, దృఢ నిశ్చయంతో కాటన్ ముందడుగు వేయడంతో, రోజుకు 2 నుంచి 3వేల మంది కూలీలతో నిర్విరామంగా పని చేయడంతో ఈ ఆనకట్ట నిర్మాణం విజయవంతంగా పూర్తైంది.

నాటి నుంచి గోదావరి జిల్లాల తీరే మారిపోయింది. మెట్ట పంటలు బంగారాన్ని పండించాయి. చెరకు, ధాన్యం, పొగాకు, నూనె గింజలు దిగుమతి చేయడానికి నౌకాయన సౌకర్యాన్ని ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశాడు.
 
◆అదే సంవత్సరం కాకినాడ ప్రాంతంలో అతిపెద్ద తుఫాను వచ్చింది. అక్కడి గ్రామాలన్ని జలమైపోయాయి.

అధిక వర్షాల వల్ల ఏటి వరదల వల్ల పల్లపు ప్రాంతాల్లో చేరిన నీటిని త్వరగా సముద్రంలోకి పోయేట్లు మురుగు కాలువలను ఏర్పాటు చేయాల్సిందిగా నివేదిక తయారు చేశాడు. 

అలా 500 మైళ్ల రహదారి కాలువలను ఏర్పాటు చేసి కాకినాడ నుంచి బంకింగ్ హమ్ మార్గాన్ని సుగమం చేశాడు.

కాలువల పొడవు 600కిలోమీటర్ల పైనే ఉంది. లక్షల ఎకరాల పంట సాగుకు ఈ కాలువల నీరే ఆధారం. పుష్కరాల సమయంలో చాలామంది కాటన్ కు పిండప్రదానం చేసేవారు.

రాకపోకలు, సరకు రవాణాకు పునాదులు వేశారు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేశారు.

ఇవేకాక బెంగాల్, ఒడిస్సా, బిహార్ ప్రాంతాల్లో నదుల కోసం పరిశోధనలు, పరిశీలనలు చేశారు. 

అనకట్టలు అవసరమున్నచోటల్లా ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. 1860లో ఉద్యోగ విరమణ పొందాడు. 
 
◆ప్రతి నీటి బొట్టు, తిండి గింజపైన కాటన్ పేరుంటుందని గర్వంగా చెప్పుకుంటారు తెలుగు ప్రజలు. 

అప్పటి ఏపీ ప్రభుత్వం ఆయన పేరు మీద 'కాటన్ మ్యూజియం' ఏర్పాటు చేసింది. ఇందులో ఆయన జీవిత విశేషాలతో, అనకట్టల నిర్మాణ చిత్రపటాలతో నిండి ఉంటుంది.

ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపరభగీథుడిగా నేటికి కీర్తిస్తుంటారంటే అతిశయోక్తి కాదు.