BREAKING NEWS

ఎఫ్ బి కి 'మార్క్' :జుకర్ బర్గ్..!

పనెండేళ్ల వయసులో ఎవరైనా కంప్యూటర్లో గేమ్స్ ఆడుతుంటారు. కానీ ఇతను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లను నేర్చుకొని, కొత్త కొత్త వెబ్ సైట్లను తయారు చేశాడు. అతనే మార్క్ జుకర్ బర్గ్... ఫేస్ బుక్ కి మార్క్. వ్యవస్థాపకుడు. ఇప్పటికీ ఎఫ్ బికి 139 కోట్ల మంది యూజర్లున్నారు. జనాభా పరంగా చూస్తే చైనా కన్నా పెద్దది. చిన్న వెబ్సైట్ గా మొదలై పెద్ద సోషల్ నెట్ వర్క్ సైట్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ ఒకరిగా చేరిపోయారు. నేడు అతని పుట్టినరోజు సందర్భంగా మార్క్ జీవిత విశేషాలు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
1984 మే 14న న్యూయార్క్ లోని వైట్ ప్లెయిన్స్ లో జన్మించాడు. తల్లి పేరు కరణ్, తండ్రి పేరు ఎడ్వర్డ్ జుకర్ బర్గ్. డెంటిస్ట్ గా చేసేవారు. మార్క్ కు చిన్నప్పటినుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. అది చూసి ఆయన తండ్రి అటారి బేసిక్ ప్రోగ్రామింగ్ ను నేర్పించారు. తరువాత కంప్యూటర్ ప్రోగ్రాంలో ప్రైవేటుగా పాఠాలు కూడా చెప్పించారు. జుకర్ బర్గ్ కు సమయం దొరికినప్పుడల్లా వీటి మీదే సాధన చేసేవాడు. జుకర్ బర్గ్ తండ్రి పని చేసే క్లినిక్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి క్లినిక్ కు సమాచారం చేరవేయడానికి 12 ఏళ్ల వయసులోనే జుక్ నెట్ అనే సాఫ్ట్ వేర్ ను తయారు చేశాడు. ఇదెలా అంటే ఇప్పుడు మనం వాడుతున్న మెస్సెంజర్ లా అప్పుడు పనిచేసేదట. స్కూలింగ్ లోనే 'సినాప్స్ మీడియా ప్లేయర్'ను తయారు చేశాడు.

ఏఒఎల్(AOL), మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు సినాప్స్ మీడియాను కొనడమే కాక గ్రాడ్యుయేషన్ పూర్తికాకున్న మార్క్ కు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ మార్క్ ఆ ఉద్యోగంలో చేరలేదు. పై చదువుల నిమిత్తం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఫేస్ మాష్ అనే వెబ్సైట్ ను సృష్టించాడు. దీంట్లో ఆ యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయిల ఫోటోలను పొందుపర్చి, అందమైనవారికి పోలింగ్ నిర్వహించాడు. అప్పట్లో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ అందానికి సంబంధించిన విషయం కావడంతో కొంతమంది అమ్మాయిలు మార్క్ జుకర్ బర్గ్ మీద కంప్లైంట్ చేశారు. అమ్మాయిల అనుమతి లేకుండా ఫోటోల్ని వాడినందుకు అతనికి వార్నింగ్ ఇచ్చి, ఆ వెబ్సైట్ ను ఆపేశారు. 
 
ఫేస్ బుక్ పుట్టిందిలా :-

 
ఫేస్ మాష్ అనే వెబ్సైట్ నిరాశపర్చిన దీంతోనే కొత్త ఐడియా పుట్టింది. కాలేజీలో ఉన్న తమ గురుంచి, తమ ఇష్టాయిష్టాలు, ఫొటోలు, అభిరుచుల్లాంటి పలు ఆసక్తికర విషయాలను, వివరాలను పొందుపర్చుకోవడం, తమ స్నేహితులతో తిరిగి పంచుకుంటే ఎలా ఉంటుందనేది ఆలోచన!  ఇందుకోసం హాస్టల్లో తెల్లవార్లు కూర్చొని వెబ్సైట్ ను క్రియేట్ చేయడంలో మునిగిపోయాడు. అలా తయారైందే 'ది ఫేస్ బుక్'. మొదట్లో తను చదువుతున్న హార్వర్డ్ యూనివర్సిటీ కోసమే అనుకున్నా, దానికి వచ్చిన స్పందన చూసి అమెరికాలోని ఇతర యూనివర్సిటీలకు కూడా ఈ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు.

ఎలాగైనా మరింత అభివృద్ధి చేయాలనుకున్నాడు. అందుకు సమయం సరిపోక ఆ యూనివర్సిటీలో చదువును మధ్యలోనే ఆపేసి, పూర్తిగా ఫేస్ బుక్ మీదే దృష్టి సారించాడు. "ది ఫేస్ బుక్"లో 'ది'ని తీసేసి, ఎఫ్ బిగా మార్చాడు. 
2004 ఫిబ్రవరి 4న ఎఫ్ బి అవతరించింది. విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ ఈ వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చాడు. 2004 చివరినాటికి 10లక్షలమంది యూజర్లు ఎఫ్ బిలో చేరారు. 
 
అయితే కామెరూన్, టేలర్, దివ్య నరేంద్రన్ అనే ముగ్గురు ఎఫ్ బి తమ ఐడియా అని, జుకర్ బర్గ్ దానిని కాపీ కొట్టాడని కోర్టులో కేసు వేశారు. కొన్నాళ్ళు కేసు నడిచాక జుకర్ బర్గ్ వారికి 45 మిలియన్ డాలర్ల డబ్బును, ఎఫ్ బిలోని షేర్లను చెల్లించడం జరిగింది. అంతటితో కేసు వివాదం ముగిసింది. 
 
ఫేస్ బుక్ లో పరిచయస్తులతో, స్నేహితులతో ఆన్లైన్ లో చాటింగ్ చేసుకోవడమనేది అందరికీ నచ్చింది. తరువాతి సంవత్సరం అంటే, 2005లో 50లక్షల యూజర్లకు చేరుకుంది. దీని వృద్ధి చూసిన యాహూ, టీవీ(Mtv)లాంటి కంపెనీలు ఎఫ్ బిను కొనడానికి ముందుకొచ్చాయి. యాహూ అయితే ఏకంగా 900ల మిలియన్ డాలర్లను ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ మార్క్ అమ్మలేదు. 

ఎంతో ముందుచూపున్న జుకర్ బర్గ్ 2012లో ఇన్ స్టాగ్రామ్ ను 1 బిలియన్ డాలర్లకు కొని, ఫేస్ బుక్ లో కలిపేసుకున్నాడు. 

2014లో 19 బిలియన్ డాలర్లకు, అంటే సుమారుగా లక్షఇరవైకోట్ల రూపాయలు పెట్టి వాట్సాప్ ను కొనేశాడు. ఇవేకాక కనెక్ట్ యూ, ఫ్రెండ్ ఫీడ్, చాయ్ లాబ్స్ లాంటి 60కి పైగా కంపెనీలను సొంతం చేసుకున్నాడు. ఎఫ్ బి స్థాపించిన పదేళ్లలోనే మల్టీ బిలియనీర్ అయ్యాడు.
 
2012లో చైనాకు చెందిన 'ప్రిసిల్లా జాన్' అనే స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు.
ఫేస్ బుక్ చూడటానికి నీలం(బ్లూ)రంగులో కనపడుతుంది. ఎందుకంటే మార్క్ కు కలర్ బ్లైండ్ నెస్ ఉంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులను చూడలేడు. అందుకే ఎఫ్ బిను బ్లూ రంగులోనే క్రియేట్ చేశాడు. అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి ఒక డాలర్ మాత్రమే జీతం తీసుకునేవాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. 
 
ఇతర విశేషాలు :-

◆మార్క్ జుకర్ బర్గ్ జీవితం ఆధారంగా "ది సోషల్ నెట్ వర్క్" అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాకు 3 ఆస్కార్ అవార్డులు వచ్చాయంటే విశేషం! 
◆2010, 2013 సంవత్సరాలలో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా టైం మ్యాగజైన్ ప్రకటించింది. 

◆ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం మార్క్ జుకర్ బర్గ్ 71 మిలియన్ డాలర్లు, అంటే, 4లక్షల 57వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తిగా ప్రపంచ ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో చేరిపోయాడు. 

◆2013లో ఎబోలా వ్యాధిగ్రస్తులకు సహయార్ధం 100కోట్లకు పైగా విరాలమిచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. 

◆ప్రపంచవ్యాప్తంగా 15కోట్ల మందికి ఉచితంగా ఇంటర్ నెట్ అందించాలనే ఉదేశంతో ఇంటర్ నెట్ డాట్ ఆర్గ్(Internet.org) అనే సంస్థను స్థాపించాడు. 

◆బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లు కలిసి స్థాపించిన 'గివింగ్ ప్లెడ్జ్ ఫౌండేషన్'కి తన ఆస్తిలో సగభాగాన్ని విరాళంగా రాసిచ్చేశాడు. 

◆2015 డిసెంబర్ లో కూతురు పుట్టిన సందర్భంగా ఎఫ్ బిలో ఉన్న తన వాటాలో 99శాతాన్ని జాన్ జుకర్ బర్గ్ కు రాసివ్వడం మరో విశేషమనే చెప్పుకోవాలి. 
అతి చిన్న వయసులోనే ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచిన మార్క్ కృషి ఎంతోమంది యువతకు ఆదర్శం!