BREAKING NEWS

కుస్తీ...వీరుడు పట్టు తప్పాడు

అతడో భారత రెజ్లర్.. బరిలోకి దిగితే చాలు అవార్డులు, మెడల్సే.. అతని ఆటే ఆదర్శం. కోట్లాది అభిమానమే ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టింది. ఇదంతా నాడు,
 
నేడు, అతడో  హత్య కేసులో  నిందితుడు… ఆటలో కుస్తీని, నిజంగా ఆడాడు. జీవితంలో ఓడాడు.  అతడే సుశీల్ కుమార్. 
 
ఒలింపిక్స్ లో రెండు ఇండివిజువల్ మెడల్స్ సాధించి రెజ్లర్ గా రికార్డ్ కొట్టాడు.ఎంతోమంది యువ రెజ్లర్లకు ఆదర్శమయ్యాడు. 
అటువంటిది ప్రపంచ రెజ్లింగ్ దినోత్సవం(మే 23న) రోజునే హత్య కేసులో అరెస్ట్ కావడమన్నది అందర్నీ హతాశయుల్ని చేసింది.

దిల్లీలోని బప్రోలా గ్రామంలో సాధారణ కుటుంబం నుంచి స్థానిక ఆటగాడిగా వచ్చి, దేశం గర్వించదగ్గ రెజ్లర్ గా ఘనత సాధించాడు. 1982 ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ సత్పాల్ సింగ్ స్ఫూర్తితో ఈ ఆటలోకి వచ్చాడు. 

వరుసగా 2008, 2012 ఒలింపిక్స్ లో కాంస్య, రజత పతకాలు, మూడు కామన్ వెల్త్ గేమ్స్, ఓ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్, నాలుగు ఏషియన్ ఛాంపియన్ షిప్ మెడల్స్ సాధించి భారత రెజ్లింగ్ కు స్టార్డమ్ తీసుకొచ్చాడు. అలాంటి క్రీడాకారుడు… కొన్నిరోజులుగా పరారీలో ఉండటం,  ఆచూకీ తెలిపినవారికి రూ. లక్ష పరిహారం ప్రకటించడంలాంటి వార్తలు వస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. 
 
అసలేం జరిగిందంటే...
 
23 ఏళ్ల సాగర్ కుస్తీలో జూనియర్ లెవెల్ ఛాంపియన్. చిన్నప్పటినుంచి సుశీల్ కుమార్ కు వీరాభిమాని. తనలానే ఒలంపిక్ మెడల్ సాధించాలనేది సాగర్ కల! ఈ నెల 4న తన ఫ్రెండ్స్ తో కలిసి మోడల్ టౌన్ లోని ఫ్లాట్ కి మకాం మార్చాడు. ఆ ఫ్లాట్ లోని ముగ్గురు రూమ్ మేట్స్ తో కలిసి ఉండేవాడు. 
 
ఇదిలా ఉంటే,  సాగర్ రానా సుశీల్ కుమార్ భార్య పేరు మీదున్న ఫ్లాట్ లో 2 నెలలు అద్దెకున్నాడు. ఆ అద్దె చెల్లించకుండానే వాళ్ళ స్నేహితుల ఫ్లాట్ కి మారిపోయాడు. పలుసార్లు సుశీల్ కుమార్ మేనేజర్ అద్దె అడిగినా డబ్బులు లేవని చెప్పేవాడు, చివరగా సుశీల్ కుమారే అడగడంతో నేను ఇప్పుడు చెల్లించలేనని గట్టిగా చెప్పేశాడు. దీంతో ఆగ్రహించిన సుశీల్ సాగర్ పై కక్ష పెంచుకున్నాడు. 

ఒకరోజు సుశీల్, సాగర్ ఉంటున్న ఫ్లాట్ దగ్గరకు తన అనుచరులతో వచ్చాడు. ఆపై సాగర్, అతని స్నేహితుల్ని కిడ్నాప్ చేసి, ఛత్రసాల్ స్టేడియానికి తీసుకొచ్చాడు. సుశీల్ వర్గం, సాగర్ వర్గం పై ఇష్టమొచ్చినట్లు దాడికి దిగింది.ఆ సమయంలో సాగర్ స్నేహితుల్లో ఒక్కరూ తప్పించుకొని ఇక్కడ మా ప్రాణాలకు ప్రమాదముందని, కాపాడాల్సిందిగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. 

సుశీల్ ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే, ఆ ఘర్షణలో బాగా గాయపడ్డ సాగర్ ను ఐసీయూలో చేర్చారు. స్నేహితులు సైతం దెబ్బలతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాతి రోజే సాగర్ మరణించాడు. సాగర్ చనిపోయిన వెంటనే సుశీల్ కనిపించకుండా పోయాడు. అతనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొన్నాడు. అయితే ఆరోజు జరిగిందంతా సీసీ టీవీ ఫుటేజీలో ఉండటంతో ఆతనిపై అనుమానం మరింత బలపడింది. సుశీల్ కనపడకుండా తప్పించుకుంటూ అనేక ఊర్లు తిరుగుతున్నాడని, దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు పాస్ పోర్ట్ ను జప్తు చేశారు. అలాగే
ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు.
 
మే 18న సుశీల్ కుమార్ తరపున లాయర్… సుశీల్ కు ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదంటూ, ఇదేవరో కేసులో ఇరిక్కించాలని కావాలనే చేస్తున్నట్లు, కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. పోలీసులు సుశీల్ ఈ పని చేయడానికి గల కారణాలు అద్దె డబ్బులేనని, ఆ విషయమై దాడికి దిగినట్లు దొరికిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోర్టుకి చెప్పడమైంది. దీంతో కోర్టు వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
 
(మే 23న)ఆదివారం జలంధర్ లో సుశీల్ తోపాటు అతని అనుచరుడు అజయ్ అలియాస్ సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ దిల్లీలో పోలీసులు వాళ్ళను పట్టుకొని, అరెస్ట్ చేశారు.విచారణ సమయంలో తను ఆ ఘటనా స్థలంలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు.సుశీల్ తో పాటు మరో అరుగురిపైన వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. సుశీల్, అజయ్ లకు కోర్టు ఆరు రోజుల రిమాండ్ విధించింది.
 
గతంలోనూ విబేధాలు:-
 
◆తన కోచ్ సత్పాల్ సింగ్ కూతురినే సుశీల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి స్టేడియాన్ని చూసుకునేవారు. వారి ఆధిపత్యం అక్కడి చాలామందికి నచ్చేదికాదు. 
 
◆అతని స్నేహితుడైన మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్. సుశీల్ తో విభేదాల కారణంగా ఛత్రశాలను విడిచి వెళ్లిపోయాడు. 
 
◆2015లో బజరంగ్ సైతం ఈ స్టేడియాన్ని విడిచిపోవడానికి సుశీలే కారణమన్న ఆరోపణలున్నాయి.
 
◆2016లో ఒలింపిక్స్ కు ఏడాది ముందు ముంబయి రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు, సుశీల్ కు మధ్య పెద్ద వివాదం జరిగింది.
 
ప్రపంచ విజేతగా గెలిచి భారత్ పేరునే మారుమోగేలా చేసింది అతడి ఆట. కేవలం అద్దె డబ్బులివ్వలేదనే కోపంలో కిడ్నాపింగ్, మర్డర్ కేసులో ప్రధాన ఆరోపణలు అందుకొన్నాడు. దాడి జరిగిన సమయంలో తీసిన వీడియోలో సుశీల్ సాగర్ పై దాడి చేసినట్లు స్పష్టమవ్వడంతో ఈ విషయం సంచలనంగా మారింది. సుశీల్ మాత్రం తనను సాగర్ బహిరంగంగా దూషించడం వల్లే, రెజ్లింగ్ వర్గాల్లో భయం పుట్టించడానికే ఇలా కొట్టి, వీడియో తీయమన్నానని సుశీల్ అన్నాడు. 

కానీ ఇంతటీ దిగ్గజ రెజ్లర్ ఇటువంటి ఆరోపణలు అందుకోవడం, భారత రెజ్లింగ్ ప్రతిష్ఠనే దెబ్బ తీసిందని భారత రెజ్లింగ్ సమాఖ్య వెల్లడించింది. దీంతో తనపై వేటు పడటం ఖాయమనే అనిపిస్తుంది.