BREAKING NEWS

పౌరాణిక పాత్రల్లో మేటి నటి.. కన్నాంబ..!

వేదిక మీద గుక్క తిప్పుకోకుండా పద్యాలు పాడుతుంటే... 
ఆమె పాత్రలకు, ఆమె పాటలకు ముగ్దులయ్యారు ప్రేక్షకులు... అప్పటికీ ఇంకా టూకీలు నడుస్తున్నాయి. 

నాటకాల్లో ఆమె వేయని స్త్రీ పాత్ర లేదు. ఆమె అభినయం, స్వరంతో తెలుగులోనే కాక తమిళులను సైతం అభిమానులుగా చేసుకుంది. 
ఆమెను కలవడానికి వచ్చిన వారికి లేదనకుండా భోజనాలు పెట్టింది. కొత్తగా సినిమావకాశాల కోసం వచ్చిన వారికి వసతి కల్పించింది. ఈ నెల 7(రేపు)న ఆమె వర్ధంతి సందర్బంగా ఆమె బాల్యం, నాటక, సినీ జీవితంలోని విశేషాల గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం.  
 
బాల్యం... 

1911 అక్టోబర్ 5న పసుపులేటి వెంకటనరసయ్య, లోకాంబ దంపతులకు కడపలో జన్మించారు కన్నాంబ. కన్నాంబ నాన్నగారు అప్పట్లో ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పనిచేసేవారు. ఈమె కడపలో జన్మించినప్పటికి, వారి అమ్మమ్మగారి ఊరైన ఏలూరులోనే పెరిగారు. ఈమె తాత గారు తెనాలిలో డాక్టర్ గా పనిచేసేవారు.

ఈయనకి సాహిత్యం అంటే మక్కువ. చిన్నపుడు కన్నాంబగారు ఏ పాట విన్న, లిరిక్స్ తో సహా పాడేవారట. ఇది గమనించిన వారి తాతగారు కర్ణాటక సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. 1924 అంటే, ఆమెకు13 ఏళ్ల నుంచే నాటకాలు వెయ్యడం ప్రారంభించారు. 1927లో ఒకరోజు హరిశ్చంద్ర నాటకం చూడడానికి వెళ్లారు. ఆ నాటకంలో చంద్రమతి పాత్రను ఒక మగతను ధరించాడు. అతను చెప్పే పద్యాలు, పాడే పాటలు అక్కడి ప్రేక్షకులతో కూర్చోని చూస్తున్న కన్నాంబకు ఎందుకో నచ్చలేదు.

అప్పుడు వెంటనే మీకన్నా నేను బాగా నటించగలను, పాడగలను అని గట్టిగా అరిచి చెప్పిందట. అప్పుడతను నీకంత సీన్ ఉందా?, పద్యాలు చెప్పడం అంటే మాములు విషయం అనుకుంటున్నవా? అయితే నువ్వు చెప్పు చూదాం, స్టేజి మీదకి రా అని సవాలు విసిరాడట. కన్నాంబ వెంటనే వేదిక మీదకు వెళ్లి పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులందరూ చంద్రమతి పాత్రలోకి లీనమై, కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
నాటకాల్లోకి... 

అప్పటికి  కన్నాంబ వయస్సు16 ఏళ్లు. ఆ నాటకాల గ్రూప్ లో కన్నాంబను చేర్చుకొని ఎన్నో మంచి మంచి వేషాలు ఇచ్చారు. ఈమె తనకు నచ్చిన విధంగా ఉంటేనే రిహార్సెల్స్ కి వెళ్లేవారట. సతిసావిత్రి, సత్య భామ, అనసూయ, అన్నపూర్ణ వంటి స్త్రీ పాత్రలతో పాటు సత్య వంతుడు, భక్తకవిదురుడు వంటి పురుష పాత్రల్లో నటించి,  అందరీ మన్నలను పొందింది. దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి రంగూన్ రౌడీ అనే నాటకం దాదాపు దేశమంతటా తిరిగి ప్రదర్శించారు. దీంతో ఈమె గొంతుకు చాలామంది అభిమానులయ్యారు. 

1927-30ల్లో ఇంకా సినిమాల ప్రాబల్యం మొదలు కాలేదు. 1931లో టాకీలు మొదలయ్యాయి. ఈమె పాడిన పద్యాలు రికార్డ్ చేసి విడుదల చేస్తే, ఆ పద్యాలలో ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఓలలాడారు. దాదాపు 8 సంవత్సరాలు నాటకాలు వేశారు. 
 
సినిమాల్లోకి...  

1934లో పి. పుల్లయ్యగారు ఆయన మిత్రులు కొందరు కలిసి హరిశ్చంద్ర నాటకాన్ని సినిమాగా తీయాలని అనుకున్నారు. చంద్రమతి పాత్రను కన్నాంబగారు తప్ప మరెవరు సరితూగరని, ఆమె దగ్గరి వెళ్లి అడిగితే, కన్నాంబ మా ట్రూపులో 22 మంది ఉన్నారు, వాళ్ళని కూడా చేర్చుకుంటే నేను వస్తానని చెప్పిందట. అందుకు వారికి వేరే మార్గం లేక సరేనని ఒప్పుకున్నారు. 1934, 35ల కాలంలో షూటింగ్ మద్రాసులో జరిగేదికాదు. కొల్లాపూర్, ముంబయిలొనే జరిగేవి. హరిశ్చంద్ర సినిమాని కొల్లాపూర్ లోనే తీశారు. ఈ సినిమాను 3 నెలలో నిర్మించారు. హర్చింద్రడిగా అడ్డంకి శ్రీరామమూర్తిగారు నటిస్తే, ఈ సినిమాకి ప్రధానంగా పి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించారు. 

1935లో వచ్చిన హర్చింద్ర సినిమా బాగా ఆడింది. అప్పట్లో టాకీస్ రాలేదు. చుట్టూ  డేరాలు కట్టి మధ్యలో తెర ఏర్పాటు చేసి సినిమాను చూపించేవాళ్లు. ఆ తరువాత హెచ్. వి.బాబు దర్శకత్వంలో ద్రౌపతి వస్త్రాపహరణం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా 1937లో విడుదలై, బ్రహ్మాండంగా ఆడింది. ఈ సినిమాలో ఈమె వేసిన పాత్ర ద్రౌపతికి చాలా మంచి పేరు వచ్చింది. తరువాత కూడా అయన దర్శకత్వంలోనే కనకతార అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో వరుసగా మూడు సినిమాలు హిట్ అవ్వడంతో కన్నాంబగారి పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమా 'చండిక'. ఇందులో కత్తి యుద్ధం, గుర్రపుస్వారీ కూడా చేశారామె. సినిమాలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం చేసిన తొలి తెలుగు కథానాయిక కన్నాంబ గారే అవ్వడం విశేషం. 

ఆ తరువాత 1938లోనే గృహాలక్ష్మి చేశారు. ఇందులో ఆమె పాత్రే కీలకం. ఈ సినిమాతో కన్నాంబగారి జీవితంలో మరో మెట్టు ఎదిగారు. ఈ సినిమాలో నటించిన చిత్తూరు నాగయ్య గారికి తొలి సినిమా ఇది. 

1941లో కన్నాంబగారు, ఆమె భర్త  కడారు నాగభూషణంగారు స్వయంగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఫీలింస్ ను స్థాపించారు. కన్నాంబగారు శ్రీ రాజరాజేశ్వరికి పరమ భక్తురాలు కావడం  చేత ఆ నిర్మాణ సంస్థకు ఆమె పేరు పెట్టారు. ఈ సంస్థలో మొదటిగా జ్యోతి స్నేహ దర్శకత్వంలో తల్లి ప్రేమ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా బాగా ఆడింది. దాంతో చాలా లాభాలు వచ్చాయి. ఆ కడరు నాగభూషణం గారి దర్శకత్వం లో చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ హీరో హీరోయిన్లుగా సుమతి అనే సినిమా నిర్మించారు. 

1942లో వచ్చిన ఈ సినిమా కూడా బాగానే ఆడి, లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కన్నాంబ గారికి  రెండు సంవత్సరాలు ఆరోగ్యం క్షిణించడంతో ఆమె నటనకు దూరమైయారు. ఆ తరువాత  ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక బయట మూడు సినిమాలలో నటించారు. మయాలోకం, మాయమచ్చింద్ర, పాదుక పట్టాభిషేకం ఈ మూడు సినిమాలు 1945లొనే విడుదలై మంచి పేరు తెచ్చాయి.

ఆ తరువాత 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం కన్నాంబ గారి జీవిథాన్ని తారాస్థాయికి చేర్చింది. ఇలాంటి నటి తరువాత తరాలలో కానీ ముందు తరాలలో కానీ పుట్టదని ఎంతోమంది ఆమెను అభినందించారు. మరో వైపు సొంతంగా సినిమాలు  నిర్మించేవారు. అయితే 1951లో సదామిని తీశారు అయితే అది పరాజయం పాలైంది. అప్పటినుంచి కలిసిరాలేదు, నష్టాలు రావటం మొదలైంది. ఆ తరువాత పేద రైతు నిర్మించారు. అది కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఒక పక్క కన్నాంబగారు బయటి సంస్థలో నటించి సంపాదిస్తుంటే, మరో పక్క కన్నాంబ గారి భర్త సినిమాల ద్వారా  ఆదాయాన్ని నిలుపలేకపోయారు. 

దాంతో కన్నాంబగారే నిర్మాణ పనుల్లో జోక్యం కల్పించుకొని, సతి సక్కుబాయ్ నాటకాన్ని సినిమాగా తీసి నష్టాన్ని పూడ్చాలి అనుకున్నారు. అయితే దాని హక్కులు కె.వి రెడ్డి గారు ముందే కొన్నుకొన్నారు. ఆ విషయమే కె. వి రెడ్డి గారు కన్నాంబ గారికి చెప్పారు. దాంతో ఆయనని బతిమలాడి ఆ హక్కులు కన్నాంబగారే తీసుకున్నారు. సతీసక్కుబాయ్ సినిమా 1953లో విడుదలై మంచి హిట్ అందుకుంది. దాంతో కొంతవరకు నష్టాల భారం తీరింది. 
 
ఆమె సేవాగుణం... 

అయితే కన్నాంబ గారు లాభాలు వచ్చినా, రాకున్నా పనిచేసేవారికి మాత్రం 1వ తేది రాకముందే, నెలాఖరునే జీతాలు ఇచ్చేవారట. వారి ఆఫీస్ కూడా చాలా విశాలంగా ఉండేది. ఆఫీస్ లో పనిచేసేవారీతో బయటవాళ్ళు ఎవరు వచ్చినా కూడా లేదనకుండా భోజనం పెట్టేవారట. అప్పట్లో  కన్నాంబగారి ఆఫీస్ లో భోజనం చేయని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె కొత్తగా సినీ అవకాశాల కోసం ప్రయత్నించేవారికి సొంత కార్యాలయంలో పడుకునే వసతి, భోజన వసతి కల్పించేవారట.

ఈమెకు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. ఈమెకు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ మంది అభిమానులున్నారు. తమిళులు ముద్దుగా కన్నగి అని పిలిచేవారట. అటువంటి కన్నాంబ గారు నాగయ్య దర్శకత్వంలో భక్త రామదాసు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె పాత్ర చిత్రీకరణ చివరి రోజున 1964 మే 7న తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం తరువాత శ్రీ రాజా రాజేశ్వరి సంస్థను చూసుకునేవారు లేక, మూతపడింది.
 
◆ సుమారు150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలితో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకున్న ఈ నటీమణి తెలుగువారి కీర్తిని పెంచింది.