BREAKING NEWS

నేటి వృద్ధులు - నిన్నటి పిల్లలు

నేటి వృద్ధులు  -  నిన్నటి పిల్లలు  నేటి పిల్లలు     -   రేపటి వృద్ధులు

 సుమారు 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి తల్లి తండ్రుల్లో  ఒకటే అంతర్మధనం ...
వయసు ఉడిగేక పిల్లలు తమను జాగ్రత్తగా  చూస్తారో ?? లేదో ??  
చూడక పోతే  తమ పరిస్థితి ఎలా ??
ఈ ఆందోళనకు మాత్రం  జాతి , మత  , కుల , ధనిక , పేద  లాంటి తారతమ్యాలు  ఉండవు. ఏ విధమైన రిజర్వేషన్లు లేవు.  ఈ ఒక్క విషయంలో  అందరూ సమానమే ...!!

 పిల్లలు పుట్టాలని ఎంతో ఆశతో చూసి , పుట్టిన తర్వాత అల్లారుముద్దుగా పెంచి , తమ సరదాలు కూడా మానుకుని వారిని పెంచుతారు.  వీరు ఒకరకం.
  అత్యంత ధనికవర్గం వారు తమపిల్లలను అన్నింటిలో వారి స్టేటస్ ప్రతిబింబించేలా గారాబంగా పెంచుతారు.

  వారు అడిగిన మరుక్షణమే అది ఎంత విలువైనదేనా సరే  వారికి అందిస్తారు. పుట్టినరోజు వేడుకలు , వీకెండ్ పార్టీలు కూడా గ్రాండ్ గా జరిగేలా ప్రోత్సహిస్తారు. వీరు రెండో రకం.

  ఇక పేదవర్గం వారు ..
  వీరి జీవితాలలో అంతా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. పెళ్లి , పిల్లలు లాంటివన్నీ  చాలా సాదాసీదాగా ఉంటాయి. వారి వారి దైనందిక జీవితంలో వారు బిజీగా ఉంటారు. అంతా ఆ దేవుని దయ అనుకుంటారు. పిల్లల గురించి గొప్పగా ఆలోచించే సమయం గానీ , అవకాశం గానీ వీరికి ఉండదు. లక్జరీ  అర్థమే తెలియదు వీరికి . వీరు మూడో రకం..

  మొత్తానికి  ....
    పిల్లలను  ఎలా పెంచినా తమ వృద్ధాప్యంలో తమని తమ పిల్లలు బాగా చూసుకుంటారా ??? అన్నదే అన్ని వర్గాల ఆందోళన !!!
    బాగా ధనవంతుల పిల్లలకు వారి చిన్నతనంలో డబ్బుకు మాత్రమే కొదవ ఉండదు. కానీ తల్లితండ్రుల ఆలనా - పాలనా గానీ , తాతా నాన్నమ్మ , అమ్మమ్మల ఆత్మీయతలు వంటివన్నింటికీ  కొదవే.

    ఇక .. అసలు విషయానికి వస్తే  ,,,
    తల్లితండ్రులను వారు బ్రతికినంతకాలం అభిమానంగా , ఆత్మీయంగా , ప్రేమగా చూసుకునే పిల్లలు లేరా ???   ... లేకనేం ... చాలామందే ఉన్నారు ..

     కానీ  .. అంతకంటే  ఎక్కువమంది చూడ్డం లేదనే చెప్పక తప్పదు . . 
     ఎందుకిలా ???
      పిల్లల బాల్యంలో  తల్లితండ్రులు  డబ్బు సంపాదనలో పడి వీరితో గడపడానికి తగు సమయం  కేటాయించేవారు కాదు. పైగా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూల్స్ లో దూరంగా పెట్టేవారు. ఫలితంగా ఒకరితో ఒకరికి అనుబంధాలు , ఆత్మీయతలు ఉండడానికి అవకాశం లేదు. పెరిగి పెద్దయ్యాక వారు కూడా డబ్బు సంపాదనలో పడి దూరదేశాలు పోతున్నారు.

      తల్లితండ్రులు అప్పటికే బోలెడంత సంపాదించేసి , బిక్కు బిక్కు మంటూ ఇండియాలో ఒంటరిగా బ్రతుకు వెళ్లదీస్తూ దైన్యంగా ఉంటారు. పిల్లలను రమ్మంటే రారు. డబ్బు కావాలంటే ఎంతైనా పంపిస్తారు.

      మధ్యతరగతి తల్లిదండ్రులు చేసే పొరబాటు ..
      పిల్లల బాల్యంలో వారు కోరినవి డబ్బు లేక  కొనలేరు. విలాసాలకు ఖర్చు చెయ్యలేరు. నా పిల్లలు నాలా ఉండకూడదు అన్న ఏకైక లక్ష్యంతో పిల్లలను అతి క్రమశిక్షణలో పెట్టేసి బాగా  చదువుకుని బాగా సంపాదించాలి అని  వారికి నూరి పోస్తూ ,  కనీస సరదాలు కూడా లేకుండా నిస్తేజంగా పెంచుతున్నారు. వారు పెరిగాక వారి లక్ష్యం కూడా అదే .. అనవసరపు ఖర్చులు తగ్గించాలి. బాగా పొదుపు చెయ్యాలి.

      అందులో భాగమే .. తల్లిదండ్రులు A/C బెడ్ రూమ్ నుండి హాల్లోకి మారడం.
      ఇంకొంతమంది తల్లిదండ్రులు  వారి పిల్లల బాల్యంలో తమ తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోవడం  చేస్తూఉంటారు. పిల్లల ముందే వృద్ధులను హీనంగా చూడ్డం లాంటివి చెయ్యడం వలన కూడా పిల్లలపై ఆ ప్రభావం ఉంటుంది.

      " నీవు నేర్పిన విద్యే నీరజాక్షి " 
      అన్నట్లుగా  ,,, పిల్లలు మన ప్రతిబింబాలు. మనం వేసే ప్రతీ అడుగు పిల్లలు అనుసరిస్తారు.

      అభిమన్యుడు గర్భంలో ఉండగానే శ్రీ కృష్ణులవారు చెప్పిన మాటలు విన్నట్లు ,,,
      పిల్లలకు పుట్టినదగ్గర నుండి మనమే వారికి చక్కని బుద్ధులు నేర్పుతూ , వారితో అనుక్షణం మమైకమవుతూ పెంచుకుంటే ... వారే మనల్ని మన వృద్ధాప్యంలో పెంచుతారు..

      కొసమెరుపు ...
      చిన్నపిల్లాడు కదా !!
      మనల్ని ఏమీ చెయ్యలేడు కదా !!
      అని ....
      మనం ప్రతీ చిన్న విషయానికి కసురుకోవడం , తిట్టడం , కొట్టడం , అందరిలోనూ అవమానపరచడం లాంటివి  చేస్తే  ,,,
      ఆ సమయానికి  ఆశక్తుడు కనుక ఏమీ చెయ్యలేడు కానీ ,, ఆ క్షణంనుండే వాడికి మొదలవుతుంది తల్లితండ్రుల మీద ఏహ్యభావం ...
      అదే "  ఇంతింతై వటుడింతై  "   అన్న చందంగా వృద్ధి చెందుతుంది సుమా !!!!
      బహు పరాక్  . . . . ! ! !

Photo Gallery