BREAKING NEWS

మద్యం మత్తు - యువత చిత్తు....

డిజే... అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా అనుకుంటున్నారా... కాదు కాదు.. మనం మాట్లాడుకునేది  పబ్బుల్లో వాయించే డీజే గురించి... అదేనండి డిస్కో జాకీ. సిటీ అంతా పడుకునే సమయంలో యువత జోరు మొదలు అవుతుంది. హోరెత్తించే మ్యూజిక్... ఉర్రూతలూగించే బీట్స్... మన ప్రమేయం లేకుండానే లయబద్ధంగా నాట్యం చేసే మన మనస్సు... మందు, విందుతో స్వర్గపు అంచుల్లో మునిగి తేలుతుంటారు యువత... అయితే ఇక్కడే వస్తోంది అసలు చిక్కు...

        మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రతీ థియేటర్లో సినిమా ముందు ప్రదర్శించే హెచ్చరిక. కానీ ఈ ఒక్క ముక్క చదివి ఎంత మందిలో మార్పు వస్తోంది. మద్యపానం మానేసిన వాళ్ళు ఎంత మంది?? నిజానికి అప్పటికి గుర్తు లేనివారికి కూడా ఈ యాడ్ చూసిన తర్వాత గుర్తొచ్చి మరీ తాగుతున్నారు అనడంలో సందేహం లేదు.

అయితే తాగిన వాళ్ళు సరిగ్గా ఉంటున్నారా అంటే లేదు. తగిన మైకంలో వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో తూలుతున్నారు. కట్ చేస్తే జరగకూడని అనర్థాలు ఎన్ని జరిగిపోతున్నాయి. కేవలం ఒక్క రాత్రి సరదా.. ఎన్నో నిండు జీవితాలు బలి అవుతున్నాయి. ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం... ఎంతో. భవిష్యత్తు ఉన్న యువతను భవిష్యత్ లేకుండా చేస్తున్నాయి...

                   అర్ధరాత్రి పార్టీలంటూ యూత్ గ్యాంగ్ అందరూ మందులో మునిగి తేలుతున్నారు. సిటీకి దూరంగా ఉండే రిసార్ట్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. కనీసం ఇంట్లో చెప్పుకోలేని, చెప్పని పరిస్థితి. సిటీకి దూరంగా వెళ్తున్నారు కాబట్టి కచ్ఛితంగా ఏదో ఒక వెహికిల్ లోనే వెళ్తారు. తాగడం, పార్టీలు తప్పు కాదు. కానీ ఆ తర్వాత యువత చేస్తున్న పని మాత్రం క్షమించ లేనిది...

అదే డ్రంక్ అండ్ డ్రైవ్.. పూటుగా మద్యం సేవించి హై స్పీడ్ లో , ముందూ వెనకా ఆలోచించకుండా కార్లు, బైక్ లు డ్రైవ్ చేస్తున్నారు ప్రస్తుత యువత... ఫలితం ఊహించలేని విధంగా ఉంటోంది. కన్న వారికి కడుపు కోత మిగులుస్తుంది... తాజాగా వైజాగ్ లో జరిగిన ఓ ఆక్సిడెంట్ దీనికి ఉదాహరణ...

ఇంట్లో ఫ్రెండ్ దగ్గరకి వెళ్తున్నాం అని చెప్పిన కుర్రాళ్లు మద్యం సేవించి ట్రిపుల్ రైడింగ్ అది కూడా ఓవర్ స్పీడ్. ఒక్కసారిగా అదుపు తప్పడంతో స్పాట్ లోనే మరణించారు. ఇంకో ఘటనలో రాత్రంతా మందు తాగి కారులో స్పీడ్ గా వస్తున్న కుర్రాళ్లు ఓ స్థంభాన్ని ఢీ కొట్టారు. ఇలా చెప్పుకుంటే పోతే. ఒకటీ రెండూ కాదు కొన్ని వందల మరణాలు, యాక్సిడెంట్లు... కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ వలనే జరుగుతున్నాయి.. 

                 ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతోంది. ప్రభుత్వం , పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. లిమిట్స్ క్రాస్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఫైన్ లు వసూలు చేస్తున్నారు. అయినా సరే జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి... కారణం యువతలో సరైన అవగాహన లేకపోవడం. ఎవరికో జరిగింది.

మనకి అలా జరగదులే... ఎంత తాగినా స్టడిగా ఉంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్. తాగి నడపడం, ఫాస్ట్, ర్యాష్ డ్రైవింగ్ స్టైల్ గా ఫీల్ అవ్వడం. ఇవన్నీ యువతలో లోపాలు..  అయితే ఇలాంటివి అలవాటు అవ్వకుండా పిల్లలను సక్రమంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉంది. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు దిశగా పిల్లలను నడిపిస్తే పెద్దయ్యాక కూడా అదే బాటలో ఉంటారు.

కాలేజీ చదివే పిల్లలు అడిగారు కదా అని కార్లు, హై స్పీడ్ మోటార్ బైక్స్ ఇచ్చేస్తే వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. లైసెన్స్ లు ఉండవు.. ట్రాఫిక్ పై అవగాహన ఉండదు. సరిగ్గా డ్రైవింగ్ కూడా రాదు. కానీ రయ్యిమంటూ రొడ్లెక్కేస్తున్నారు  ఎప్పటికప్పుడు పిల్లల ఎక్కడికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు లాంటి విషయాలు తల్లి దండ్రులు గమనిస్తూ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అంత సమయం, తీరిక ఎవరికున్నాయి. అంతా బిజీ బిజీ కదా.. కనీసం పిల్లలతో కాస్త సమయం కూడా గడపాలని ఉండదు . అంత సమయం ఉండదు ... ఈ విషయంలో ముమ్మాటికీ పిల్లల తప్పు ఎంత ఉందో తల్లిదండ్రుల తప్పు అంతకు మించి ఉంది. 

                సమయం చాలా విలువైనదే... నిజమే. కానీ మన పిల్లలు అంతకన్నా ముఖ్యమైన వాళ్ళు కదా... ఒక్కసారి ఆలోచించండి... చేజారిన కాలం వెనక్కి రాదు... మన మాట దాటి చెడు బాటలో నడిచే పిల్లలు అటువైపు అడిక్ట్ అవ్వక ముందే మంచి మార్గంలో నడిపించండి. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతని కాపాడుకుందాం.

Photo Gallery