BREAKING NEWS

ఉచిత చదువులు - ఆ పై బోనస్ లు

       చిన్నప్పటి నుంచి చక్కని, నాణ్యమైన విద్య అందిస్తే పెద్దయ్యాక పిల్లలు సమాజానికి ఉపయోగపడేలా తయారు అవుతారు. వారి భవిష్యత్ కూడా బాగుంటుంది. ఇదే అందరి తల్లిదండ్రుల ఆలోచన... ఆరాటం కూడా.

కానీ ఆ నాణ్యమైన విద్య ఎక్కడ లభిస్తుంది? ప్రభుత్వ పాఠశాలల్లోనా? లేదా ప్రైవేట్ స్కూల్స్ లోనా?  
               6 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య చట్టం 2009 నుంచి అమల్లో ఉంది. అంటే ఆ వయసు పిల్లలు అందరికీ  ఉచితంగా చదువుకునే హక్కు ఉందన్నమాట. ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంది.

విద్యార్థి వయసులో ఉండే ప్రతి ఒక్కరినీ చదువుకునే ప్రోత్సహించారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా కొన్ని సంవత్సరాలు పెరిగింది. ఆ తర్వాత కాల క్రమంలో కొన్ని కారణాలు వలన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుకే రేషనలైజేషన్ పేరుతో కొన్ని పాఠశాలలను క్లోజ్ చేయడం , మరికొన్ని స్కూల్స్ ను మెర్జ్ చేయడం చేశారు.

దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఉచిత నిర్బంధ విద్య అర్థం లేకుండా పోయింది... భోజనం సరిగ్గా దొరకక బాల కార్మికులుగా మారుతున్నారు అనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించారు. కానీ అది కూడా కొన్నాళ్ళు మాత్రమే సత్ఫలితాలు ఇచ్చింది. ఇప్పటికీ పథకం అమల్లో ఉన్నా డ్రాపవుట్స్ మాత్రం తగ్గడం లేదు అని తెలుస్తోంది. 

                           ఇలా స్కూల్ మానేసి పనుల్లోకి వెళ్ళే విద్యార్థులను తిరిగి స్కూల్ లో జాయిన్ చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి తెర తీసింది. అదే అమ్మ ఒడి. రాష్ట్రంలోని ప్రతీ తల్లి తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తే చాలు.

సంవత్సరానికి ఇద్దరు విద్యార్ధులకు 15 వేల రూపాయలు ఆ తల్లికి అందిస్తారు. ఇదీ ఈ పథకం ముఖ్యోద్దేశం. అయితే ఈ పథకంపై ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో  పథకం పై అనేక కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ పథకం ప్రైవేట్ , ప్రభుత్వ ఏ పాఠశాలల్లో జాయిన్ చేసినా ఈ పథకం వర్తిస్తుంది అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.

అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే విద్యార్థుల కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని ఊహాగానాలు కూడా నడిచాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ముందు ప్రకటించిన విధంగానే ఏ పాఠశాలకు పంపినా అమ్మ ఒడి పథకంలో 15000 అందుతాయని ప్రకటించారు. దీని వల్ల విద్యార్థులకు ఏమైనా ఉపయోగం ఉందా.. కేవలం పాఠశాలల యాజమాన్యానికి మాత్రమేనా..

                        ఈ రోజుల్లో దాదాపు ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎల్.కే.జి చదివించాలి అంటేనే కనీసం 15000 ఉండాలి. ఇక ఒక్కో తరగతి పెరిగే కొద్దీ ఫీజులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయే ఈ 15000 రూపాయలు ఎందుకు ఉపయోగం. పైగా సేవింగ్స్ నుంచి తీసో లేదా బయట ఎక్కడో అప్పు చేసి మరీ బ్యాలెన్స్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. సో ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే వారికి ఈ పథకాలు ఏవీ ఉపయోగం లేదు అన్నది స్పష్టం అవుతోంది. ఇక ప్రభుత్వ పాఠశాలలు విషయానికి వద్దాం.

ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కు పంపిస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. మరో వైపు రోజుకో 500 రూపాయలు వస్తాయి కాబట్టి స్కూల్ కన్నా పనికి పంపిస్తున్నారు..  ఇదీ మరో వాదన... నిజమే కానీ కుటుంబ ఆదాయం పెంచడం కోసం కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్నో ఉచిత పథకాలు కూడా అమలు చేస్తున్నారు. నెల నెలా రేషన్ కూడా అందిస్తున్నారు. పైగా స్కూల్ కి వచ్చే పిల్లలకు కేవలం చదువు తప్ప వేరే ఇతర ఖర్చులూ ఉండవు.

స్కూల్ యూనిఫాం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నీ ఉచితమే. పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇన్ని చేస్తున్నా బాల కార్మికులు తగ్గడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  అలాంటప్పుడు ఈ పథకం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

                         సంవత్సరానికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలి అంటే ఏటా కనీసం 10 వేల కోట్లు రూపాయలు ప్రభుత్వం పై అధిక భారం పడుతుంది. అసలే ప్రభుత్వ ఖజానా లోటు బడ్జెట్ లో ఉంది అంటున్నారు. అలాంటప్పుడు ఒక్కసారిగా పెరిగిన ఇంత బడ్జెట్ ఎలా భరిస్తుందో. దీనికి బదులు చదువు ఆవశ్యకతను, ప్రభుత్వ స్కూల్స్ లో చదివితే వచ్చే ఫలితాలను, బాల కార్మికులుగా ఉండిపోతే కలిగే నష్టాలను అర్థం అయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి...

స్కూల్ లో పిల్లలను చేర్పించాలి అంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి. అంతే గానీ డబ్బులు ఇస్తాం స్కూల్ లో చేర్పించండి అనడం సరి కాదని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలి కాబట్టి ఈ పథకం కేవలం ప్రభుత్వ స్కూల్స్ కి మాత్రమే పరిమితం చేస్తే ప్రభుత్వానికి కాస్త భారం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం... ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం... 
 

Photo Gallery