BREAKING NEWS

డైవింగ్ - సో థ్రిల్లింగ్

సముద్రం... అలల ఆటు పోట్లుతో గంభీరంగా కనిపిస్తుంది. కానీ సముద్ర గర్భం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రకరకాల జీవజాతులు... రంగురంగుల చేపలు. ఇంకా ఎన్నో మనకు తెలియని జీవులు కనిపిస్తాయి. తెలుసుకోవడానికి ప్రయత్నించాలే గానీ అంతులేని ఆనందం, ఆశ్చర్యం మీ సొంతమే... చెప్తూ ఉంటేనే ఎంతో థ్రిల్ కలుగుతోంది కదా..

మరి లైవ్ లోనే ఆ థ్రిల్ పొందితే??? అదెలా అంటారా?? ఇందుకు ఒకటే మార్గం. అదే స్కూబా డైవింగ్‌.. సముద్ర లోతుల్లోకి వెళ్లి సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవాలి అనుకునే వారి కోసమే ఈ స్కూబా డైవింగ్. విశాఖపట్నం లాంటి సముద్ర తీర నగరాల్లో ఇప్పుడీ స్కూబా డైవింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

                   డైవింగ్‌లో కూడా రెండు రకాలు ఉన్నాయి. కమర్షియల్‌ డైవింగ్‌, రిక్రియేషన్‌ డైవింగ్‌. ఈ డైవర్స్‌ కోసం మన విశాఖపట్నంలోనే ఒక అసోసియేషన్‌ కూడా ఉంది. అదే ఆడా (ఆంధ్రా అండర్ వాటర్ డైవర్స్ అసోసియేషన్)... కమర్షియల్ డైవింగ్ కి, రిక్రియేషన్ డైవింగ్ కి చాలా తేడా ఉంది. కమర్షియల్‌ డైవర్స్‌ సముద్ర అడుగు భాగంలో పని చేస్తుంటారు.

నౌకలకు కింద భాగంలో ఏమైనా సమస్య వస్తే ఎంతో ఇబ్బంది అవుతుంది. అలాంటి సమయంలో షిప్ ను బయటకు తీసి రిపేర్ చేయడం సాధ్యం కాని పని. అందుకే కమర్షియల్ డైవర్స్ నీటి అడుగు భాగంలోనే వెల్డింగ్ లేదా కటింగ్ లాంటి రిపేర్లు అన్నీ చేసేస్తారు. ఒక్కోసారి సముద్ర అడుగు భాగంలో పైప్ లైన్లు కూడా వేయాల్సి ఉంటుంది. సముద్రంలో పడిపోయిన లంగర్లు, ముఖ్యమైన వస్తువులు లాంటివన్నీ వెతికి తీయడం కూడా ఈ కమర్షియల్ డైవర్స్ చేస్తుంటారు.   మామూలుగా నేల మీద ఇలాంటి సమస్యలు వస్తే రిపేర్ చేయడం సులభమే. కానీ సముద్రం అడుగు భాగంలో అంటే చాలా కష్టమైనది..

అలాగే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని.   అయితే మెరుగైన శిక్షణతో ఆ సమస్యను అధిగమించేలా చేయడమే కమర్షియల్‌ డైవర్స్‌ పని... ఈ కమర్షియల్ డైవర్స్ కి ప్రత్యేక కోర్సులు, ట్రైనింగ్ లు ఉంటాయి. కానీ రిక్రియేషన్ డైవర్స్ కి ఎలాంటి శిక్షణ ఉంటుంది???
                సరదాగా సముద్ర అడుగు భాగంలో ఏముందో తెలుసుకుని ఒక థ్రిల్ ను, లైఫ్ లో మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా నిలుపుకోవాలి అనుకునేవారు చేసేదే ఈ రిక్రియేషన్ డైవింగ్. దీనికి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది.

సముద్రంలో కదా. డైవింగ్ చేయడానికి  ఈత కచ్ఛితంగా రావాలి అనుకుంటే పొరపాటే.. ఈత రాకపోయినా, కనీసం ఒక్కసారి కూడా స్విమ్మింగ్ పూల్ లో దిగకపోయినా సరే హ్యాపీగా స్కూబా డైవింగ్ లో సముద్రంలోకి దూకేయచ్చు... అలా ఎలా అనుకుంటున్నారా... ముందుగా రెండు గంటలు పాటు ఓ పెద్ద స్విమింగ్‌ పూల్‌లో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఒక గంట పాటు థియరీలో శిక్షణ ఇస్తారు. ఇక అంతే... నేరుగా సమ్ముదంలో డైవ్‌ చేసేయచ్చు. డైవింగ్ చేసేవారికి ఒక ప్రత్యేకమైన సూట్ ఇస్తారు.

ఆక్సిజన్ మాస్క్ తో కూడిన ఈ సూట్ ను డైవర్స్ కచ్చితంగా వేసుకోవాలి. ట్రైనింగ్ లో భాగంగానే స్కూబా సెట్‌ ఎలా వాడాలి... అండర్‌ వాటర్‌లో బ్రీతింగ్‌ టెక్నిక్స్‌, అండర్‌ వాటర్‌లో ఏమైనా ఇబ్బంది వస్తే ఎలా దానిని పరిష్కరించాలి అనే అంశాలపై ప్రధానంగా శిక్షణ ఉంటుంది.

                      డైవింగ్‌లో బడ్డీ సిస్టం చాలా ముఖ్యమైనది.. రిక్రియేషన్ డైవింగ్‌ అయినా, ప్రాఫెషెనల్‌ డైవింగ్‌ అయినా కొన్ని జాగత్తలు తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్‌ చేసేయచ్చు. డైవింగ్‌కు ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా మాత్రం వెళ్లకూడదు. డైవింగ్‌లో ఎప్పుడూ బడ్డీ సిస్టమ్‌ ఉంటుంది. అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లాలి. డైవర్స్‌కు ఒకవేళ అండర్‌ వాటర్‌లో ఏదైన సమస్య ఎదురైతే ఒకరితో ఒకరు హ్యాండ్‌ సిగ్నల్‌తో కమ్యూనికేట్‌ చేసుకుంటుంటారు.

నీటి అడుగున కంటి చూవు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకరికొకరు దగ్గరగా ఉండాలి. డైవ్ ను మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ డైవ్ చేయాలి? నీటిలో ఎంత సేపు ఉండాలి అని నిర్ణయించుకుని టైం నోట్‌ చేసుకుని అలోగా బయటకు వచ్చేయాలి. ముఖ్యంగా డైవింగ్‌ చేయాలి అనుకున్నవారికి కొన్ని అర్హతలు ఉండాలి. వయస్సు 9 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉండాలి. ఎలాంటి బ్రీతింగ్‌ ప్రాబ్లమ్స్‌ ఉండకూడదు. గుండెజబ్బులు, తలకు దెబ్బలు ఇలాంటీవేమీ లేకుండా ఫిట్ గా ఉన్న ఎవరైనా డైవింగ్ చేసేయొచ్చు.

                        సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అవన్నీ నేరుగా చూడాలి అనుకునే వారికి డైవింగ్‌ ఒక మంచి ప్లాట్‌ ఫాం. అలాగే డిజాస్టర్స్‌లో సేవలందించే ఎస్టీఆర్‌ఎఫ్‌ లాంటి టీంలకు డైవింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి కూడా విశాఖలో సంస్థలు ఉన్నాయి. వైజాగ్ లో డైవింగ్ చేసేందుకు మంగమారి పేట దగ్గర రెండు స్పాట్ లను కూడా గుర్తించారు. సో... స్కూబా డైవింగ్ మీ డ్రీమ్ అయితే ఛలో వైజాగ్....

Photo Gallery