BREAKING NEWS

ఒక్క ప్రతిజ్ఞ.... మన వంతుగా

బీచ్... సముద్రపు హోరు ఒక పక్క... గిలిగింతలు పెట్టే కెరటాలు మరో పక్క... హాయిగా సేద తీరమంటూ అలా అలా తాకే చిరు గాలి మరో పక్క. బీచ్ కు వచ్చే ప్రతీ పర్యాటకుడు కచ్ఛితంగా ఆస్వాదించే అనుభూతి ఇది. చిన్నారులు కేరింతలు కొడుతూ ఇసుక తిన్నెల్లో ఆటలాడుతూ ఉంటారు..

 పిచ్చుక గూళ్లు కట్టుకుని ఆనందిస్తారు... అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం బీచ్ లలో పరిస్థితి మరోలా ఉంటోంది. కనీసం బీచ్ లో అడుగు కూడా పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర తీరం విశాఖలో బీచ్ లు పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి...

                   రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. వారి అవసరాలకు తగినట్లుగా వస్తూత్పత్తులూ పెరుగుతున్నాయి... వీటితో పాటే జనాల్లో నిర్లక్ష్య ధోరణి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో సుందరంగా ఉండాల్సిన బీచ్ లు కేవలం మనుషుల తప్పిదం వలన అంద విహీనంగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు. బీచ్ కు వెళ్ళిన వాళ్ళు ఏమీ తినకుండా ఉండలేరు కదా...

బీచ్ లో కనిపించే మురీ మిక్చర్, బజ్జీలు లాంటివన్నీ హాయిగా తింటారు. అందులో తప్పేమీ లేదు. ఆ తర్వాత చేసే పని మాత్రమే తప్పు. కూర్చున్న చోటు నుంచి కదలరు. నాలుగడుగులు దూరంలో డస్ట్ బిన్ ఉన్నా పట్టించుకోరు. ఎంచక్కా చేతిలో ఉన్న చెత్తను అలా విసిరేస్తారు. అది ఎక్కడో ఇసుకలో పడుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఇంకెవరికో ఇసుకలో ఆడుకునే వారికి తవ్వకాల్లో దొరుకుతుంది.. ఎంత బాగుందో కదా...

ఇలా కేవలం ఒకరిద్దరు మాత్రమే కాదు. ఎంతో మంది ప్రజలు అన్నీ తెలిసి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. కట్ చేస్తే ఇసుక తిన్నెలన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. ఇంటి నుంచి వచ్చే వ్యర్ధాలు కూడా సముద్రంలోనే కలుస్తూ ఉండడంతో బీచ్ లు మరింత అపరిశుభ్రంగా ఉంటున్నాయి.

                      బీచ్ లు అపరిశుభ్రంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. అవే ఫ్యాక్టరీలు, సీ ఫుడ్ హ్యాచరిలు. అవును.... హ్యచరిలు అన్నీ దాదాపుగా సముద్రంకు చేరువలో ఏర్పాటు చేస్తారు. ఫుడ్ ప్రోససింగ్ అనంతరం మిగిలిన వ్యర్ధాలను శుద్ధి చేసిన తర్వాత ఎలాంటి హానికర కెమికల్స్ లేవు అని నిర్ధారించిన తర్వాత మాత్రమే సముద్రంలో విడుదల చేయాలి. ఇదే నియమం పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది. నిజానికి కంపెనీల నుంచి వచ్చే వ్యర్ధాలు కలవడం వలన సముద్రం ఎక్కువ కలుషితం అవుతోంది. బీచ్ లలో ఇసుకపై అక్కడక్కడా నల్లగా మచ్చలు చూస్తూ ఉంటాం.. అవి కంపెనీలు విడుదల చేసే వ్యర్థ పదార్థాల ఆనవాళ్లే... దీని వలన బీచ్ అందాలు పోవడమే కదా.

సముద్రంలో నివసించే ఎన్నో జీవులకు గండంగా మారింది. విశాఖ బీచ్ లలో గమనిస్తే భారీ తాబేళ్లు నిత్యం చనిపోతూ ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపిస్తున్నాయి. చేపలు కూడా ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక మరణిస్తాయి. 

                         మనం చేసే ఈ తప్పులే భవిష్యత్తులో ప్రభావం చూపిస్తాయి. మన తప్పుల వలన భావి తరాలు ఇబ్బందులు గురవుతారు. నేటి తరంలో ఇతర జీవులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.

ప్రతీ విషయాన్ని ప్రభుత్వం, అధికారులపై నెట్టేసి మీలో మీరే చర్చలు పెట్టేయండి. ఒక్కసారి ఆలోచించండి తప్పు ఎవరిదో... సమాజంలో మనం కూడా ఒక భాగమే. "నేను ఎలాంటి తప్పు చేయను. సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను.." అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రతిజ్ఞ చేయండి. మార్పు మీకే తెలుస్తుంది....

Photo Gallery