BREAKING NEWS

మాతృభాషా పరాయి భాష అవుతోందా???

            మాతృ భాష... తన చిన్నప్పటి నుంచి తన తల్లి మాట్లాడే భాషనే మాతృ భాష అంటారు. మన రాష్ట్రంలో తెలుగు మందరికీ మాతృ భాష అవుతుంది. మన అమ్మకు మనం ఎంతో గౌరవం ఇస్తాం. అలాగే చాలా మంది వారి వారి రాష్ట్రాల్లోని మాతృ భాషకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎంతో గౌరవిస్తారు. చాలా ప్రేమగా, అభిమానంగా చూసుకుంటారు.

అయితే ఇదంతా పక్క రాష్ట్రాల సంగతి. మరి మన సంగతి ఏమిటి??? మన తెలుగు పరిస్తితి ఏమిటి???
                అమ్మ చేతి ముద్ద... అమ్మ నోటి మాట... అమ్మ చల్లని దీవెన... అమ్మ ప్రేమ మధురిమ...ఇవి అనుభవించి పరవశించాల్సిన భావాలే కానీ మాటల్లో చెప్పగలిగేవి కావు. సృష్టిలో ఇంకేవీ వీటికి సాటిరావు. తన శరీరాన్నే గుడిగా మార్చి, అందులో ప్రాణదీపాన్ని ప్రతిష్టించి,  అది పదికాలాల పాటు ఉజ్వలంగా వెలగాలని ఎక్కడెక్కడి దేవుళ్లకూ మొక్కుకునే కొండంత దేవత అమ్మ. ఆమె  ఎంత చల్లనో, ఆమె మాటాడే భాష అంత చల్లన. అమ్మ పలికే పదాల్లో  తత్వం అంత తీయన. దేశం ఏది కానీయండి... ప్రాంతం ఏది కానీయండి. అమ్మయినా, ఆమె మాటయినా ఎవరికైనా ప్రాణప్రదాలే. అందుకే మాతృ భాషంటే ప్రేమించని వాళ్లుండరు... 

          తెలుగు భాష గొప్పతనం, తెలుగులో కమ్మదనం మాటల్లో వర్ణించడం ఎవరికి సాధ్యం? అందుకే కన్నడ ప్రాంతంలో పుట్టిన శ్రీకృష్ణ దేవరాయులు" దేశబాషలందు తెలుగు లెస్స” అన్నారు. అవధానం, పద్య నాటకాల వంటివి తెలుగులో తప్ప ఇంకెక్కడ ఉన్నాయి? ఇంత గొప్ప భాషను నిర్లక్ష్యం చేయడం అపచారం. ఆంగ్ల భాషను నేర్చుకున్నా తెలుగులో మాట్లాడాలన్నది మన కర్తవ్యం. చదువును వ్యాపారం చేయడం వల్ల తెలుగుకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం ఉంది... ముందు మన ఆలోచన విదానంలో మార్చు రావాలి. అప్పుడే తెలుగుకు శ్రీరామరక్ష... 

                    మన పక్క రాష్ట్రం తమిళనాడును చూడండి... ఎవరితో మాట్లాడాలి అన్నా సరే వారి మాతృ భాష తమిళంలోనే మాట్లాడుతారు. ఆఖరికి ప్రధాన మంత్రికి ఉత్తరం రాయాలన్నా అది కూడా తమిళంలోనే. వారికి వేరే భాష రాక కాదు. వారి మాతృభాష పై వారికున్న ప్రేమ. అభిమానం... కానీ మనం మాత్రం మన మాతృ భాష కోసం ఏం చేస్తున్నామో ఒక్కసారి చూద్దామా.... ఎవరో ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే వాళ్ల నోటి నుంచి వచ్చే మొదటి మాట "హల్లో... హౌ ఆర్ యూ"... పోనీ ఆ తర్వాత అయినా తెలుగులో మాట్లాడుతారు అంటే అదీ లేదు. ఎక్కడో అమెరికా నుంచి ఇప్పుడే లాండ్ అయినట్టు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారో ఏమిటో తెలియదు. కొన్నిసార్లు ఇంగ్లీష్ రాకపోయినా సరే ఎలాగోలాగ ఇంగ్లీష్ లో మాట్లాడడమే లక్ష్యంగా మాట్లాడేస్తున్నారు...

                           కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడేసి ఊరుకుంటారా అంటే అదీ లేదు. తమ పిల్లలకు తెలుగు రాదు. ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అంటూ ఎంతో గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చేశాం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో వేరే ఇతర భాషలు నేర్చుకోకూడదు అని ఎవరి ఉద్దేశమూ కాదు. మన మాతృ భాషను మాత్రం మరచిపోకూడదు కదా... అయితే తెలుగు రాదు అని చెప్పుకోవడానికి, గర్వపడడానికే నేటి తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడుతున్నారు.

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అంటే మన తెలుగువారు మాత్రం తెలుగు భాషను లెస్ చేసేస్తున్నారు... ప్రాచీన భాష తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు... ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో మన మాతృ భాష కూడా పరాయి భాష లాగా కోచింగ్ సెంటర్ లలో నేర్చుకోవలసి ఉంటుంది... కాస్త జాగ్రత్తగా వ్యవహరిద్దాం... మాతృ భాషను రక్షించుకుందాం.... 
 

Photo Gallery