BREAKING NEWS

అసెంబ్లీ సమావేశాల్లో వింత పోకడలు

          ప్రజాస్వామ్యం.... ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే నాయకులను ఎన్నుకునే ఒక గొప్ప విధానం. మన భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో రాజకీయ పార్టీలు తలపడతాయి. చివరకి ప్రజలు ఒక్కరికే పట్టం కడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వలన ఆ తర్వాత అసెంబ్లీలో జరిగే వాద ప్రతివాదనలు అన్నీ లైవ్ లో చూస్తున్నారు. పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు... అయితే ఇక్కడే వస్తోంది అసలు సమస్య..
                          అసెంబ్లీ.... గెలిచి అధికారంలోకి వచ్చిన వారు ఒక పక్క... ప్రతిపక్షంలో ఉన్న వారు మరో పక్క కూర్చుంటారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? ఏ దిశగా చర్యలు తీసుకుంటే ప్రజలు ఆనందంగా ఉంటారు? లాంటి ప్రజా ప్రయోజనం ఉండే విషయాలు చర్చించాలి....

అవసరం అయితే ఆ విషయంపై ఇరు పార్టీలు గొడవ పడినా పర్వాలేదు. ఏదో ఒక మంచి జరుగుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. అయితే గతంలో ఎప్పుడో అలాంటి సమావేశాలు జరిగేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్రజల సమస్యలు గాలికొదిలేస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ప్రతిపక్షం గురించి, ప్రతిపక్షం అధికార పక్షం గురించి వ్యాఖ్యలు చేస్తూ అసెంబ్లీ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు. కేవలం సమయం మాత్రమే కాదు. అసెంబ్లీ నిర్వహణకు కొన్ని లక్షలు రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అయినా సరే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సమయం, డబ్బు వృధా చేస్తున్నారు.

              గత ఐదు రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు పరిశీలిస్తే పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. మొదటి రెండు రోజులు ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక లాంటి హడావుడిలో సాగిపోతుంది. కనీసం మిగిలిన ఆ మూడు రోజులు అయినా ప్రజా సమస్యలు చర్చించారు అంటే అదీ లేదు. ఎంత సేపూ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అంటూ దెప్పి పొడుస్తూ కొంత సమయం అధికార పక్షం వృధా చేస్తోంది. అధికార పక్షం వ్యాఖ్యలు చేస్తే ఎంతో అనుభవం ఉన్న , మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ఊరుకుంటారా? అధికార పక్షానికి ఘాటు రిప్లై లు ఇస్తూ సభను ముగింపు దశకు తీసుకువస్తున్నారు. మళ్లీ సభ వాయిదా.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులూ ఇలాగే ముగిసిపోయాయి. ఇక ఇన్ని లక్షల రూపాయల ప్రజా ధనం ఉపయోగించి అసెంబ్లీ నిర్వహించడం ఎందుకని ప్రజలు అనుకుంటున్నారు..

                    "సభా మర్యాదలు"... ఇదొక పెద్ద అంటూ చిక్కని టాపిక్. అధికార పక్షం కు ఈ పదంతో అస్సలు సంబంధం ఉండదు. సభా మర్యాదలు అన్ని ఉండాల్సింది ప్రతిపక్షం కు మాత్రమేనా అనే అనుమానం వస్తోంది ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న ప్రజలకు. సభా మర్యాదలు పాటించాలి అని చెప్పే అధికార పక్షం అవి పాటించాల్సిన అవసరం లేదా? అనుకుంటున్నారు అందరూ. ఎంతసేపు ప్రతిపక్షాన్ని అవహేళన చేస్తూ, తక్కువ చేసే విధంగా మాట్లాడుతూ అవమాన పరుస్తున్నారు. ఇదే విషయంపై కౌంటర్ ఇచ్చే ప్రతిపక్షంకు మాత్రం సభా మర్యాదలు లేవంటూ , సంయమనం పాటించాలని నీతులు చెప్తూ ఉంటారు. సాటి ప్రజా ప్రతినిధిని, ప్రతిపక్ష నాయకులు ను "నువ్వు" అంటూ ఏక వచనంతో సంబోధించే అధికార పక్షం కు సభా మర్యాదలు తెలుసా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి...

మరో శాసన సభ్యులు తన రాజకీయ గురువును, మాజీ ముఖ్య మంత్రిని అనకూడని మాటలు అనేస్తారు. ఇంకో మంత్రి మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయాలను కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ అన్ పార్లమెంటరీ పదాలతో నానా హంగామా సృష్టిస్తారు. అయినా సరే స్పీకర్ మాత్రం ఎలాంటి అడ్డుకట్ట వేయడం ఉండదు. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం. ఎక్కడ చూసినా అసెంబ్లీ సమావేశాలు, నాయకులు ప్రవర్తన మీదే చర్చలు జరుగుతున్నాయి. 

                        నాయకులు ఒక్కసారి ఆలోచించండి. మీరు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఖర్చులకు, మీరు చర్చిస్తున్న విషయాలకు ఏమైనా సంబంధం ఉందా.. ఇప్పటికైనా మారండి, ప్రజలకు ఉపయోగపడే విషయాలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు నిందలు మోపుకోడానికి అసెంబ్లీ బయట కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక్కటి అవకాశం. కనీసం తదుపరి జరిగే అసెంబ్లీ సెషన్స్ అయినా సజావుగా జరుగుతాయని ఆశిద్దాం.   

Photo Gallery