BREAKING NEWS

సూళ్ళూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ విశిష్టత, ఉత్సవాలు గురించి ఆసక్తికరమైన విషయాలు..!

భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. నిజంగా వీటి యొక్క మహిమ అంతా ఇంతా కాదు. పైగా ఈ ప్రాచీన దేవాలయాలు ఎంత గానో ప్రసిద్ధి చెందాయి కూడా. ఇటువంటి ఆలయాల్లో చెప్పుకో దగ్గ దేవాలయం సూళ్లూరు శ్రీ చెంగాళమ్మ ఆలయం.
 
ఈ ఆలయం గురించి చెప్పుకోడానికి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి. ఈ ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. సాధారణంగా మన భారత దేశంలో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు తర్వాత ఎక్కువ మంది ఆరాధించేది శక్తి ప్రదాయిని ముగ్గురమ్మల మూలపుటమ్మ ముమ్మూర్తుల అమ్మ సృష్టికి మూలం దేవి సర్వ శక్తి ప్రదాయిని..
 
అనాది నుండి కూడా జీవ కోటిని రక్షించే ఆది శక్తిగా శ్రీ శక్తి పూజిస్తూ ఉంటారు. గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరు తో అమ్మ ప్రజలను కన్న బిడ్డల్లా కాపాడుతుంది. ఈ ఆలయం నెల్లూరు జిల్లా లో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సూళ్లూరు పేట లో ఉంది.
 
శ్రీ చెంగాలమ్మ కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఇక్కడే ఉంది. ఇటువంటి అద్భుతమైన ఆలయం గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి. 
 
ఈ ఆలయం లో జరిగే ఉత్సవాలు:
 
కొన్ని కొన్ని ఆలయాల్లో ప్రాచీన పద్ధతులు నుండి వచ్చే ముఖ్యమైన రోజులని, ఉత్సవాలని జరుపుతూ ఉంటారు. ఈ ఆలయం లో కూడా ప్రతి సంవత్సరం మంచిగా ఉత్సవాలు జరుపుతారు. ప్రతి రోజూ పూజలు, అర్చనలు మామూలే కానీ పౌర్ణమి కి అమ్మవారి కి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం, ఆర్జిత సేవలు వంటివి నిర్వహిస్తారు.
 
అదే విధంగా ఇక్కడకి చాలా మంది భక్తులు వచ్చి వివాహము, ఉపనయనము, చిన్నారులకి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం వంటివి చేస్తారు. దసరా నవరాత్రులని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు.
 
కేవలం మన రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా తమిళనాడు నుండి కూడా ప్రజలు వచ్చి పరమేశ్వరిని దర్శించుకుంటారు.
 
సూళ్లు ఉత్సవం:
 
ఈ సూళ్లు ఉత్సవము గురించి ప్రత్యేకంగా చెప్పుకునే తీరాలి. అయితే ఈ ఉత్సవాన్ని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాలకి ఒక్క సారి మే లేదా జూన్  నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు.
 
వీటిని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడు రోజుల పాటు జరుపుతారు. ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట మరియు బలి హరణ తో ప్రారంభమవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. 
 
ఇలా అయ్యాక ఆ తర్వాత మూడవ రోజు మహిషాసుర మర్దిని అంటే దున్నపోతు తల నరకడం జరుగుతుంది. మహాకాళి మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు ఐదవ రోజు కాళింది నది లో అమ్మ వారికి ఘనంగా తెప్పోత్సవం జరుపుతారు. ఇలా అన్ని రోజులు చేసాక ఆఖరి రోజున పరమేశ్వరుని పుష్ప పల్లకి లో ఊరేగిస్తారు.
 
ఇలా ఈ ఏడు రోజులు గ్రామం లో ఈ ఉత్సవాలను జరుపుతారు. అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగింపు జరుగుతుంది. నిజంగా ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి చాలా మంది భక్తులు తరలి వస్తారు. ఇలా ఈ చెంగాలమ్మ ఆలయం లో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఏడు సంవత్సరాలకు ఒకసారి ఈ బ్రహ్మోత్సవాలను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు.
 
ఆలయ విశేషాలు:
 
సువిశాల ప్రాంగణం లో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు. అదే విధంగా ఉప ఆలయం లో గణపతి లింగరూప కైలాస నాథుడు నాగ దేవతలు ఉంటారు. నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం లో నవ దుర్గా రూపాలను ఎంతో సుందరంగా మలచి ఉంటుంది. 
 
సంతానం కలగాలని భక్తులు: 

 అలానే ఇక్కడ ఉండే ఒక పెద్ద వృక్షం దగ్గర నాగలింగం, నవగ్రహ మండపం ఉంటాయి. సంతానం కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డ తో ఊయలలు కడతారు. ఆ తరువాత నియమంగా దీనికి ప్రదక్షణలు చేస్తారు ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
 
ఈ దేవాలయానికి వెళ్లడానికి మార్గాలు:
 
సూళ్లూరు శ్రీ చెంగాళమ్మ ఆలయం కి వెళ్లాలంటే సూళ్లూరు  రైల్వే స్టేషన్ నుండి 10 నిమిషాల్లో  వెళ్ళిపోవచ్చు. నడిచి వెళ్లిపోవచ్చు లేదంటే ఆటోలు అందుబాటులో ఉంటాయి. పెరంబర్ రైల్వే స్టేషన్ నుండి దీనికి మూడు గంటల సమయం పడుతుంది. 
 
అత్యంత మహిమగల ఆలయాన్ని దర్శించుకోవడానికి సమయం దొరికితే దర్శనానికి వెళ్ళండి. కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని చూసి రావచ్చు.  ఇటువంటి చరిత్ర, మహిమ వుండే ఆలయాలని చూడడానికి చాల బాగుంటుంది.