BREAKING NEWS

బాలకార్మికులకు బంగారు బాట వేద్దాం..!

ఆస్తిపాస్తులు లేక... అన్నం పెట్టే వాళ్ళు లేక కలం పట్టాల్సిన చెయ్యి రాళ్లు మోస్తూ.. బండెడు చాకిరీ చేస్తూ.. బ్రతక లేక చావ లేక కొట్టుమిట్టాడుతూ ఉంటోంది బాల కార్మికుల పరిస్థితి. సాటి వయసు వాళ్ళు బడికి వెళుతూ బాగా చదువుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ కొందరు బాలలు చిన్న వయసు లోనే దిక్కు లేక కార్మికులుగా మారాల్సి వస్తోంది.
 
చిన్న వయసు లో అంత చాకిరీ చేయడం నిజంగా ఘోరం. చూసుకోవడానికి ఎవరూ లేక నా అనే  దిక్కు లేక పని చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నారు. బాల కార్మిక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తే మంచిది.
 
 బాల కార్మికుల కి అండగా ఉండి చదువు చెప్పించాలి. అయితే ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..?, అసలు బాలలకి ఏ విధంగా సహాయం చేయాలి..? ఇలా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.
 
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12వ తేదీన నిర్వహించబడుతుంది. అయితే ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు అనేది చూస్తే... ప్రజల లో అవగాహన తీసుకు రావడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యం లో ఈరోజుని జరుపుకుంటాము.
 
ఈ ముఖ్యమైన రోజు గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. వాటి కోసం కూడా మీరు ఒక లుక్ వేసేయండి.. ప్రతి సంవత్సరం జూన్ 12 న బాల కార్మికుల దుస్థితిని తెలియజేస్తూ వారికి ఏం సహాయం చేయవచ్చు అనేది చర్చించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, యజమానులు, కార్మిక సంస్థలు, పౌర సమాజం తో పాటుగా లక్షలాది ప్రజలు ఏక వేదిక మీదకు తీసుకు వస్తుంది.
 
అన్ని వయసుల బాల కార్మికులకు నాణ్యత తో కూడిన ఉచిత విద్యను అందజేయడం దీని యొక్క లక్ష్యం. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాల కార్మికులను గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం చాలా అవసరం.
 
అసలు ఈ రోజు ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయానికి వస్తే ... ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం మొదలు పెట్టింది.
 
నిజంగా బాలలని బాల కార్మికులుగా మారకుండా చదువుకుంటే విద్యతో పాటు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కానీ ఇలా కార్మికులుగా మిగిలి పోతే నిరక్షరాస్యత తప్ప ఏమీ మిగలదు. ఇటువంటి వాటిని ప్రతి ఒక్కరూ పట్టించుకుని వాళ్ళకి కాస్త అండగా నిలబడడం చాలా అవసరం.
 
బడికి వెళ్ళి చదువుకోవాల్సిన వయస్సు లో వాళ్ళు పనికి వెళ్లి పస్తులు ఉండడం న్యాయమా..? నిజంగా కొన్ని కొన్ని సార్లు ఇటువంటి చూస్తే గుండె తరుక్కు పోతుంది. బాలలు ఇటువంటి వాటి నుండి బయట పడాలి లేదు అంటే వాళ్ళ జీవితమే కుప్పకూలిపోతుంది.
 
కరోనా మహమ్మారి సమయం లో బాల కార్మికులు పెరిగిపోయారు:
 
మామూలు రోజుల్లోనే బాల కార్మికులు ఎక్కువగా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా బాలకార్మికుల సంఖ్య మరింత పెరిగి పోతోంది. అవునండీ ఇది నిజం. ఇక్కడ వుండే డేటాని చూస్తే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. ఐక్యరాజ్యసమితి బాలకార్మికుల సంఖ్య పెరిగి పోయిందని వ్యక్తం చేసింది.
 
రెండు దశాబ్దాల కాలం లో మొదటి సారిగా తిరిగి చిన్నారులు శ్రమజీవుల అవుతున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కోట్లల్లో బాల కార్మికులు చదువు మానేసి తమ కుటుంబ పోషణ కోసం ఫ్యాక్టరీలు వైపు, భవనాలు, ఇల్లు వంటి పని చేసే ప్రదేశాలు చుట్టూ తిరుగుతున్నారని యూనిసెఫ్ తమ సంయుక్త నివేదికలో చెప్పింది.
 
అయితే 2020 వ సంవత్సరం లో చూసుకున్నట్లయితే బాల కార్మికుల సంఖ్య 160 మిలియన్స్ కి పైగా ఉండేది. ఈ నాలుగేళ్లలో మరింత పెరిగి పోయినట్లు ఈ సంస్థ చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా తిరిగి ఇటువంటి దుస్థితి ఏర్పడిందని ఈ సంస్థ తెలియజేయడం జరిగింది.
 
 బాల కార్మికులు ఎంత మంది ఉన్నారు...?
 
 మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2000 నుండి 2016 ఏళ్ళ మధ్య బాల కార్మికుల సంఖ్య 69 మిలియన్లు ఉండేది అని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా పది మంది పిల్లల్లో కనీసం ఒకరు బాల కార్మికులుగా మారారు అని తెలుస్తోంది.
 
 నిజంగా ఎంత దౌర్భాగ్యమొ కదా...? ఇది ఇలా ఉంటే ఎక్కువగా సహారా ఆఫ్రికాలో బాల కార్మికుల సంఖ్య అధికంగా మారుతోంది. చదువుకోకపోవడం, పేదరికం వల్ల ఇటువంటివి వాళ్లు ఎక్కువయ్యారని.. బాల కార్మికులు పెరిగిపోవడానికి ఇవి కూడా చాల ముఖ్యమైన కారణలని అధికారులు అంటున్నారు. అయితే రాబోయే రెండేళ్ళ కాలం లో బాల కార్మికుల సంఖ్య 50 మిలియన్స్ కి చేరుతుందని..
 
వాళ్లకి ఎదురయ్యే కష్టాలు తప్పేలా లేవని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూల్స్ క్లోజ్ చేసారు. అదే విధంగా కుటుంబాలు కూడా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈ ప్రభావం కూడా బాలలు మీద పడినట్లు దీని కారణంగా బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించాయి.
 
కానీ ఈ దుస్థితి కొనసాగకూడదు.. బాల కార్మికులకు అండగా ఉందాం... బడికి పోనిద్దాం.. బంగారు బాట వేద్దాం.