BREAKING NEWS

"హ్యాపీ బర్త్ డే - బాలయ్య"

"నీ ఇంటికొచ్చా..
నీ నట్టింటికొచ్చా.."
"కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా…" 
"సౌండ్ చేయకు కంఠం కోసేస్తా"…అంటూ మాస్ డైలాగులతో అభిమానుల గుండెల్లో డైనమైట్లు పేల్చారు.
"ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్,
నేను ఒక్కడికి ఎదురెళ్లిన వాడికే రిస్క్.."
"చూడు ఒకవైపే చూడు, రెండోవైపు చూడాలనుకోకు..తట్టుకోలేవ్, మాడిపోతావ్"
"ఫ్లూట్ జింక ముందు ఊదు 'సింహం' ముందు కాదు" లాంటి పవర్ ఫుల్ డైలాగులతో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
"చరిత్ర మాది, సృష్టించాలన్నా మేమే, దానిని తిరగ రాయలన్నా మేమే…"
"వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్"

లాంటి పంచ్ లు వినాలంటే అది కచ్చితంగా 'బాలయ్య' అభిమానై ఉండాలి. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన నటనతో అబ్బురపరిచారు. అంతేనా…
 
గతానికి, ప్రస్తుతానికి వెళ్లగల టైం మెషీన్ కాన్సెప్ట్ తో 'ఆదిత్య 369'లో ద్విపాత్రాభినయం చేసి, 90'స్ లోనే థ్రిల్ కలిగేలా చేశారు.

తండ్రి వద్ద నటనలో ఓనమాలు దిద్ది,
తండ్రితో పాటు తెరను పంచుకొని,
తండ్రి నేర్పిన విలువల్నే పాటిస్తూ,
సోలోగా హీరో ఇమేజ్ తెచ్చుకొని,
'యువరత్న' నుంచి 'నటసింహం' అయ్యారు.

నాటి 'మంగమ్మగారి మనవడు' సినిమాతో తొలి విజయాన్ని అందుకొని, నేటికి 'అఖండ' సినిమా పోస్టర్ తో అదరగొడుతున్నారు.నటవారసుడిగా తండ్రి తర్వాత అంతటి స్థాయిలో పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రల్లో 100కుపైగా సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా ఎదిగారు.

ఆయనే 'నటసింహం' నందమూరి బాలకృష్ణ… (ఈ నెల)జూన్ 10న ఆయన పుట్టినరోజూ కావడంతో సినీ, జీవిత విశేషాల గూర్చి ప్రత్యేకంగా….

బాల్యం:-

1960 జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవ తారకమ్మ గార్ల దంపతులకు చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. చిన్ననాటి నుంచే నాన్న సినిమాలు చూస్తూ పెరిగారు. ఇంటర్ వరకు మద్రాసులోనే చదివారు. హైదరాబాద్ వచ్చాక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

సినిమాల్లోకి:-

1976లో ‘తాతమ్మ కల’ సినిమాతో 14 ఏళ్ల వయస్సులోనే సినీరంగంలో అడుగుపెట్టారు. 'దానవీర శూరకర్ణ'లో అభిమన్యుడిగా, 'అక్బర్ సలీమ్ అనార్కలి'లో సలీమ్ గా, రాం రహీమ్ రాబర్ట్, అన్నదమ్ముల అనుబంధం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణంలాంటి సినిమాల్లో తండ్రితో కలిసి నటించే అవకాశం దక్కింది. 

1982లో బాలకృష్ణకు, వసుంధర దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు.

◆1984లో 'మంగమ్మగారి మనవడు' సినిమాతో హీరోగా గుర్తింపు దక్కింది. ఆయన కెరీర్ లోనే మైలురాయి ఈ సినిమా. అంతకుముందువరకూ నందమూరి వారసుడిగానే ఆదరించారు. అలా ఒకే సంవత్సరంలో 6 నుంచి 7 సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. అందులోనూ 6 హిట్లు సాధించిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. 

◆1991లో వచ్చిన 'ఆదిత్య 369' ఒక ప్రయోగమనే చెప్పాలి. ఈ సినిమాలో గతంలో శ్రీకృష్ణదేవరాయలుగా, ప్రస్తుతంలో ఉండే కృష్ణకుమార్ గా రెండు విభిన్నపాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన 'రౌడీ ఇన్స్పెక్టర్' కూడా హిట్. 

◆1994లో 'భైరవద్వీపం' జానపద నేపథ్యంలో తెరకెక్కింది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఫీల్ అందించింది. కథకు తోడు సరికొత్త గ్రాఫిక్స్, కత్తి విన్యాసాలు ఈ సినిమాను సూపర్‌ హిట్‌గా నిలిపాయి. బాలకృష్ణ కెరీర్‌లో భైరవద్వీపం సినిమా 'వన్‌ ఆఫ్ ది స్పెషల్ మూవీ' అని చెప్పుకోవచ్చు.

◆1997లో 'పెదన్నయ్య' సక్సెస్ అయ్యింది.

◆1999లో 'సమరసింహరెడ్డి', 2001లో 'నరసింహనాయుడు',2002లో 'చెన్నకేశవరెడ్డి'లతో బాక్సాఫీస్ హిట్ కొట్టడమేకాక ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా మారారు.
ఒకదశలో చిరంజీవి సినిమాలకు, బాలకృష్ణ సినిమాలకు మధ్య విపరీతమైన పోటీ ఉండేది. అభిమానుల మధ్య గొడవలు జరిగేవి.

◆ఆ తర్వాత 2004- 09ల మధ్య వచ్చిన విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారధి, ఒక్కమగాడు, మిత్రుడు, పాండు రంగడు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఆయన గ్రాఫ్ కూడా తగ్గింది. 

◆2010లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'సింహా'తో ఆయన నటవిశ్వరూపం చూపించారు. మంచి సక్సెస్ అందుకున్నారు. 

◆2011లో వచ్చిన 'శ్రీరామరాజ్యం'.. అలనాటి కళాఖండం లవకుశకు రీమేక్‌గా తెరకెక్కింది. భారీ వ్యయంతో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులకు మధురానుభూతిని అందించింది. ఇక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.

◆2012లో అధినాయకుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ తీశారు. అవి ప్లాఫ్ అయ్యాయి.

◆2014లో మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో 'లెజెండ్' తీసి హిట్ కొట్టారు. 

◆2015, 16లో వచ్చిన 'లయన్', 'డిక్టేటర్'లు యావరేజ్ టాక్ తెచుకున్నాయి. 

◆2017లో 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక అంశంతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చేసి విజయం అందుకున్నారు. 

◆తర్వాత వచ్చిన 'పైసా వసూల్' నిరాశపర్చినా, 2018లో 'జై సింహా' హిట్ అయ్యింది. 

◆2019లో ఆయన తండ్రి నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ' ఎన్టీఆర్ - కథానాయకుడు' సినిమా తెరకెక్కింది. తాజాగా బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ చిత్రం `అఖండ‌`.  ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని జూన్10న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించారు. బాలయ్య ద్విపాత్రాభినయంతో అలరించబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

అవార్డులు:-

◆1994లో భైరవద్వీపం చిత్రానికిగాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.

◆'నరసింహ నాయుడు', 'సింహా' చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు లభించింది.

◆'నరసింహనాయుడు' చిత్రానికి  సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.

◆సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు ఉత్తమ నటుడిగా, పాండు రంగడు సినిమాకు భరతముని అవార్డులు వచ్చాయి.

◆'లెజెండ్' చిత్రానికి 2014లో ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు వరించింది.

◆2014లో టీడీపీ తరఫున హిందూపురంలో ఎమ్మెల్యేగా పోటీచేసి 16వేల అధిక్యంతో గెలుపొందారు. మరలా 2019లో రెండోసారి కూడా గెలిచి అదే పదవిలో కొనసాగుతున్నారు.

◆ తన తల్లి బసవ తారకమ్మ క్యాన్సర్ వల్ల చనిపోవడంతో, ఆమె జ్ఞాపకార్ధం 1988లో 'బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని' తన తండ్రి నిర్మించారు. ఆ తర్వాత నుంచి ఆ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు బాలకృష్ణగారు చేపట్టి, ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం, ముక్కుసూటిగా జవాబివ్వడం ఆయన నైజం. ఆ ఆటిట్యూడే సినిమాల్లో ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. తనదైన నటన.. డిక్షన్, మాసివ్ డైలాగ్స్ తో
ఆడియన్స్ ను బాగా మెప్పించి అభిమానులను సంపాదించుకున్న బాలయ్యకు మరోసారి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు!


 

Photo Gallery