BREAKING NEWS

ఆత్మస్థైర్యమే ఆభరణం: 'ఝాన్సీ' రాణి

యుద్ధ విద్యల్లో ఆరితేరి, శత్రుమూకలను తరిమి కొట్టింది.
ఆంగ్లేయుల జెండాను ధైర్యసాహసాలతో చీల్చి చెండాడింది.
నాలుగు నెలల కొడుకును,
భర్తను ఒకేసారి కోల్పోయినా…
గుండె నిబ్బరం కోల్పోని ధీరవనిత.
పరతంత్ర పాలనను తీవ్రంగా అడ్డుకుంది.
బ్రిటీషర్లతో సంధికి రాజీపడని ఆత్మస్థైర్యం… ఆమెది.
తెల్లదొరల తూటాకు బలి కావడం ఇష్టంలేక, అనుచరుడితో నిప్పంటించుకొని ప్రాణాలు సైతం అర్పించింది.
తొలి స్వాతంత్ర సంగ్రామంలో తనదైన ముద్ర వేసిన మనూ బాయి ఝాన్సీకి రాణి లక్ష్మీ బాయిగా నిలిచిన వైనం.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. కదన రంగంలో కత్తి దూసి అతికొద్దీ నారీమణుల్లో చరిత్రకెక్కిన యుద్ధ యోధురాలు గురుంచి ప్రత్యేకంగా...
 
బాల్యం:-

1828 నవంబరు 19న మహారాష్ట్రకు చెందిన సతారలోని మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి దంపతులకు జన్మించింది.

ఝాన్సీ లక్ష్మీబాయి… ఝాన్సీ అసలు పేరు మణికర్ణిక. వీళ్ళది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లోవాళ్ళంతా ఇష్టంగా 'మనూ' అని పిలిచేవారు.మనూ నాలుగేళ్ళ వయస్సులో ఉన్నపుడు తల్లి మరణించింది. దీంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

మోరోపంత్ తన స్నేహితుడు బాజీరావును బిఠూర్ కు పిలిపించి ఆశ్రయం కల్పించాడు. బాజీరావుకు కూడా సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుడ్ని దత్తత తీసుకున్నాడు. నానా సాహెబ్ పినతండ్రి కొడుకైన రావు సాహెబ్ లు ఇద్దరూ మనూని తమ సొంత చెల్లిలా చూసుకునేవారు. వీరు ముగ్గురూ కలిసి కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నారు.
 
వివాహం:-

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయస్సులో, అంటే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తరువాత ఆమె ఝాన్సీకి మహారాణి అయ్యింది. అలా ఆమె రు ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది. కొన్నాళ్ళకు లక్ష్మీబాయికి ఒక కుమారుడు పుట్టాడు. కానీ నాలుగునెలల వయసులోనే ఆ బాబు అనారోగ్యంతో చనిపోయాడు. 

ఝాన్సీకి రాకుమారుడిగా ఓ బాలుడ్ని దత్తత తీసుకోమని గంగాధరరావుకు సలహా ఇచ్చారు. ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావును 1852 నవంబర్ 20న దత్తత తీసుకున్నాడు. ఆ  తర్వాతిరోజు గంగాధర్ అకారణంగా మరణం పొందారు. 

వీరు దత్తత తీసుకునే సమయానికి భారత గవర్నర్ జనరల్ గా డల్హౌసీ వ్యవహరించారు. తండ్రి తరువాత వారసత్వంగా దామోదర్ రావు రాజ్యానికి వారసుడు అవ్వాలి. కానీ దత్తపుత్రుడు కావడంతో రాజు అయ్యే అవకాశం లేదని బ్రిటీష్ ప్రభుత్వం అతడిని యువరాజుగా ఉండే అర్హత లేదని నిరాకరించింది. ఇక ఝాన్సీని ప్రభుత్వానికి అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. దీనికి లక్ష్మీ బాయి కూడా ఒప్పుకుంది. అలా అలెగ్జాండర్ కిన్ ఝాన్సీకి పాలకుడయ్యాడు. 
 
ఇంతకుముందే బ్రిటీష్ ప్రభుత్వం ఝాన్సీ రాణితో సంధి కుదుర్చుకోవడం కోసం ఒక రాజమహల్ ను, సంవత్సరానికి 5వేల రూపాయల పెన్షన్ ను ఇచ్చేందుకు సిద్ధపడింది. కానీ ఝాన్సీ ఈ సంధికి ఒప్పుకోలేదు సరికదా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయర్ కేసును చాకచక్యంగా వాదించినా కోర్టు ఆ కేసును అంతటితో కొట్టేసేంది. తమకు వ్యతిరేకంగా కేసు వేసినందుకు ఝాన్సీ రాణి మీద ఆగ్రహంతో బ్రిటీషర్లు రాజాభరణాలను వెనక్కి తీసేసుకున్నారు. 

రాజు బతికి ఉన్నప్పుడు తమవద్ద తీసుకున్న 60 వేల రూపాయలకు గానూ, ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమెకు ఇక ఝాన్సీలో ఉండే అర్హత లేదని, తక్షణమే పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు ఒప్పుకోలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని వారిముందే ప్రతిజ్ఞ చేసింది.

రాణి ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషర్లకు ఇవ్వకూడదని నిశ్చయించుకుంది. వారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి తన సైన్యాన్ని ఏకం చేసి, బలమైన సేనను తయారు చేసింది.

 మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటులో భాగంగా అడ్డుగా వచ్చిన బ్రిటిష్ సైనికులను, అధికారులను హతం చేశారు. బ్రిటిష్ వాళ్లపైన దాడిచేయడానికనీ వచ్చిన సిపాయిల తిరుగుబాటును తనకు అనుకూలంగా మల్చుకుంది ఝాన్సీ. అలా 1858 వరకు ఝాన్సీనే తన రాజ్యాన్ని పాలించింది.
 
దాంతో 1858 మార్చ్ 23న సర్ హ్యూ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించింది. ఆ సమయంలో విప్లవకారుడైన తాత్యా థోపెనీ సహాయం కోరింది. వెంటనే 20వేలమంది సైన్యాన్ని పంపించారు. అలా సిపాయిలు, బ్రిటిష్ సైనికులు, లక్ష్మిబాయి బలగాల పోరాటంలో సిపాయిలు ఎంతో మంది ప్రాణాలు వదిలారు. బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేస్తూనే ఝాన్సీ రాజ్యంలోకి ప్రవేశించారు. దాంతో కోటలో ఉండటం అంత శ్రేయస్కరం కాదని కొంతమంది సైనికులతో ఝాన్సీ మగ వేషం వేసుకొని తన కొడుకును భుజానికి కట్టేసుకొని ఝాన్సీని వదిలి వేరే ప్రదేశమైన కప్లికి చేరింది. బ్రిటిష్ సైనికులు గ్వాలియర్ ను మోహరించే సమయంలో సైనికులను మట్టుబెడుతుండగా బుల్లెట్ తగిలిన గాయాలతో... జూన్ 18, 1858లో మరణించింది. 
 
ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. 
 
ఇతరాంశాలు:-

◆ఝాన్సీ, గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు. రెండింటిలోనూ ఆమె గుర్రంపై కూర్చున్నట్టుగా కనిపిస్తుంది.
 
◆మహారాణి లక్ష్మిబాయి విగ్రహం, అప్పటి ఆగ్రా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పడమరవైపు 120మైళ్ళ దూరంలో ఉంది. 
 
◆ఆమె తండ్రి మోరోపంత్ తాంబేను ఝాన్సీ రాజ్యం పడిపోయిన కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఉరి తీయడం జరిగింది.
 
◆ఆమె దత్తపుత్రుడైన దామోదర్ రావుకు బ్రిటీష్ ప్రభుత్వం అతని వారసత్వ సంపదను ఇవ్వకపోయినా భరణం మాత్రం చెల్లించింది.
 
◆ఝాన్సీలోనూ, గ్వాలియర్లోనూ ఉన్న రాణి కంచు విగ్రహాలు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.
 
రాణి మరణంతో తిరుగుబాటుదారుల్లో ధైర్యం సన్నగిల్లింది. ఆ తర్వాత గ్వాలియర్ కూడా ఆంగ్లేయుల వశమైంది. ఆమెకున్న ధైర్యం, పరాక్రమం, వివేకం… మహిళల అధికారాలు, హక్కులపై ఆమెకున్న ముందుచూపును, ఆమె చేసిన త్యాగాలను స్వాతంత్ర్య పోరాటంలో ఒక యోధురాలిగా నిలబెట్టింది.