BREAKING NEWS

పరుగుల బరిలో పతకాలెన్నో - పి.టి.ఉష!

బరిలో
ఆమె పరుగు..
పోటీని సైతం వెనక్కు నెట్టింది.
బదులుగా,
ఎన్నో పతకాలు, 
మరెన్నో బిరుదులు, అవార్డులు..
పాఠశాల స్థాయి నుంచి
అంతర్జాతీయ ఒలంపిక్స్ లో
ఆడి, నిలిచింది.
ప్రతిభకు పట్టం కడితే,
ప్రతిఫలం ఆమె గెలుపై
చూపించింది. 
'స్పోర్ట్స్ ఐకాన్'గా మహిళల్లో స్ఫూర్తి నింపిన మన దేశతేజం "పరుగుల రాణి పి.టి. ఉష" పుట్టినరోజు(జూన్ 27న) సందర్భంగా ఆమె జీవిత, క్రీడా విశేషాల గురుంచి తెలుసుకుందాం.
 
బాల్యం:-

1964 జూన్ 27న కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాకి చెందిన పాయోలిలోని ఓ పేద కుటుంబంలో జన్మించింది పిటి ఉష అలియాస్ పాయోలి తేవరాపరంపిల్ ఉషా. తల్లి తెక్కెవఝవలప్పిల్ లక్ష్మీ, తండ్రి మన్నన్ పైథల్. ఆమెను ఇంట్లో ముద్దుగా గోల్డెన్ గర్ల్ ,పయోలి ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. ఆమె నాలుగో తరగతి నుంచే పరిగెత్తడం మొదలుపెట్టింది. తన పరుగును చూసిన బాలకృష్ణ నాయర్ అనే స్కూల్ పిటీ మాస్టార్ ఆటల పీరియడ్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దాంతో పరుగు మీద అభిరుచి పెరిగింది. 
 
శిక్షణ:-

ఆమె ప్రతిభను గుర్తించి, 1976లో చదువు, క్రీడాశిక్షణ కోసం కన్నూర్ లోని ప్రత్యేక బాలిక క్రీడా పాఠశాలలో చేర్చారు. భారత వైమానిక మాజీ అధికారి అయిన మాధవన్ నంబియార్ కోచ్ గా వ్యవహరించారు. 
1979లో నేషనల్ లెవెల్ లో పాఠశాల క్రీడల్లో పాల్గొంది. ఆమె క్రీడాసక్తిని గుర్తించిన కోచ్ నంబియార్ చాలా కాలం వరకు శిక్షణను కొనసాగించారు. ఇదే ఉష కలకు తోడైంది.
ఆమెకు సముద్రం ఒడ్డున పరిగెత్తడం అంటే చాలా ఇష్టమట, ఎందుకంటే సముద్రానికి అంతం లేదు, నా పరుగుకు కూడా అంతం లేకుండా ఉండాలనేది తన లక్ష్యంగా చెప్తుండేవారు.
 
పోటీలు, అవి తెచ్చిన పతకాలు:-

1980 మాస్కోలో వేసవి ఒలంపిక్స్ లో 16ఏళ్ల వయస్సులో పాల్గొన్న అతిపిన్న క్రీడాకారిణిగా ఉషకు గుర్తింపు లభించింది. ఒలంపిక్స్ లో అథ్లెటిక్స్ లో ఫైనల్ కి చేరిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. 

1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100, 200 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. 

1983లో కువైట్ ఏషియన్ ట్రక్ అండ్ ఫీల్డ్ లో మరో పతకం సాధించింది.

1985లో జకార్తాలో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఐదు బంగారు పతకాలు గెలుచుకుంది. అందులోనే 100 మీటర్ల రిలేలో కాంస్యం సాధించడంతో ఉష 'స్ప్రింట్ రాణి' స్థానానికి చేరింది. 

1984లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలంపిక్స్ లో 400ల మీటర్ల హర్డిల్స్ సెమీ-ఫైనల్ గెలిచి ఫైనల్ కి చేరింది కానీ ఒక సెకండ్ తేడాతో ఓటమిపాలైంది.

1986 దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో ఉషా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. 

1998 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.

1983- 89వరకు ఉషా ఆసియా క్రీడల్లో  13 బంగారు పతకాలను సాధించింది. తర్వాత దానిని ఆసియా ఛాంపియన్‌షిప్ గా పేరు మార్చారు.

ఆమె 1980,1984,1988లో మొత్తంగా మూడుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొంది.
 
గుర్తింపు, పురస్కారాలు:-

◆ఆమె క్రీడాజీవితంలో మొత్తం 101 పతకాలను సాధించింది.

◆1984లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' బిరుదుతో సత్కరించింది. అదే సంత్సరం అర్జునఅవార్డును అందుకుంది.

◆1985లో కువైట్ అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పేరు పొందింది.

◆1984 నుంచి 1989లలో బెస్ట్ అథ్లెట్ ఇన్ ఆసియా అవార్డును ఐదు సార్లు
అందుకోవడం విశేషం.

◆1999లో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే 'మార్షల్ టిటో అవార్డు'ను దక్కించుకుంది.

◆1986లో సియోల్ ఆసియా క్రీడల్లో ఉత్తమ అథ్లెట్ కు ప్రదానం చేసే 'అడిదాస్ గోల్డెన్ షూ అవార్డు' సంపాదించింది.

◆1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డును కైవసం చేసుకుంది.

◆1985, 1986లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే 'వరల్డ్ ట్రోఫీ అవార్డు'ను ఉషకు ఇచ్చారు.

◆ఆమె భారతదేశ మొట్టమొదటి 'స్పోర్ట్స్ ఐకాన్' గా పేరొందింది.

◆పిటి ఉషను 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది సెంచరీ' గా ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ పేర్కొంది.

◆ఉషా దాదాపు రెండు దశాబ్దాలుగా 'ట్రాక్ అండ్ ఫీల్డ్ రాణి'గా నిలిచింది. 
 
వివాహం:-

కబడ్డీ క్రీడాకారుడు, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాసన్ తో 1991లో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు. పేరు విఘ్నేష్ ఉజ్వల్.

మూడేళ్ల విరామం తర్వాత 1994లో తిరిగి తన పరుగును ప్రారంభించింది. 1995లో ఆడి ఓడిపోయారు. మళ్ళీ  1996 సెప్టెంబర్ లో రెండో ఫెడరేషన్ అథ్లెట్ లో 100మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం పొందారు. ఆ సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే విరామం తర్వాత తిరిగి గెలుపు అందినందుకు సంతోషంగా ఉందన్నారు.

1998లో జపాన్ ఏషియన్ ట్రాక్ లో అవకాశం వచ్చింది. అప్పుడు ఒక బిడ్డకు తల్లిగా, 34ఏళ్ల వయసులో వేటరల్ ముద్రతో బరిలోకి దిగింది. అలా 200,400లమీటర్ల పరుగు పోటీలో రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది.
 
పరుగు- ప్రతిష్ట:-

●1977లో కొట్టాయం లో జరిగిన 100 మీటర్ల పరుగు పోటీలో 'జాతీయ స్థాయిలో రికార్డ్ కొట్టింది.

◆1978లో కొల్లంలో 'జూనియర్ అథ్లెట్' గా ఎంపిక అయ్యింది.

◆1980లో పాకిస్తాన్ లోని కరాచీలో తొలిసారి ఎంపికై, అదే సంవత్సరం మాస్కో ఒలంపిక్స్ లో పాల్గొంది.

◆1999లో ఆమె ఆటకు రిటైర్మెంట్ ఇచ్చారు.

◆2000లో కన్నూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డి.లిట్)ను ప్రదానం చేసింది. 

◆2017లో కాన్పూర్ ఐఐటి గౌరవ డాక్టరేట్ (డి.ఎస్.సి)ను ఇచ్చింది.

◆2018లో కాలికట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డి.లిట్.)ను ప్రదానం చేసింది.
 
ఆమె పేరుమీద శిక్షణా కేంద్రం:-

పిటి ఉషా కేరళలోని కోజికోడ్ సమీపంలోని కోయిలాండిలో 'ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్' అనే పాఠశాలను దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు శిక్షణ ఇవ్వడానికి ప్రారంభించింది. 10-12 సంవత్సరాల వయస్సుగల బాలికలను చేర్చుకుంది. మొదట్లో 12మందిని తీసుకుంటే తర్వాత 8మందికి తగ్గించింది. ఈ శిక్షణ కేంద్రంలో 8 వారాలకోసారి కొత్తవారిని చేర్చుకుంటారు. ఇక్కడ వారికి ఉచిత ఆహారం, ఆశ్రయంతో పాటు, ఉచితంగా శిక్షణ ఇస్తారు. 

దేశానికి మరిన్ని ఒలంపిక్ పతకాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె ఈ పాఠశాలను ప్రారంభించారు. ప్రతిభ ఆధారంగా కాకుండా కనీస సదుపాయాల విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉందని ఉషా అభిప్రాయపడ్డారు.
అలా ఆమె శిక్షణ ఇచ్చిన క్రీడాకారులు ఆసియా గేమ్స్ లో ఇప్పటికే ప్రతిభ కనబర్చి, ఒలంపిక్స్ లో 11వ స్థానంలో ఉన్నారు. 

◆1987లో పెంగ్విన్ బుక్స్ ఉషా ఆత్మకథను 'గోల్డెన్ గర్ల్' పేరుతో ప్రచురించింది.
 
"రైల్వే ట్రాక్ మీద వెళ్లే రైలుతో 
పోటీపడిన ఉషా తపన...
పరుగుకే గీటురాయి!"