BREAKING NEWS

మళ్లీ పుడితే 'బాలు'గానే పుట్టాలి

ఆయన 
స్వరమే వరం..
పాటే మంత్రం..
కాలాలు మారినా,
తరాలు మరలినా,
ఆ గొంతు వర్షించిన
పాటల చిటపటలు
ప్రతీ మదినిండా కురుస్తూనే ఉంటాయి.
నాటికి, నేటికి, ఏనాటికైనా…!
 
సంగీతంలో
సరిగమలు పలుకనేలేదు
గమకాలు నేర్వనేలేదు
అయితేనేం... 
గీతంలో
పల్లవి, చరణాలు
ఒద్దికగా పాడేసి 
పాటకే ప్రాణం పోశారాయన.
 
"పాడుతా తీయగా...చల్లగా"
అంటూ శ్రోతల మదిలో 
'బాలు'గా స్థిరపడిపోయిన 
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి 75వ జయంతి(జూన్ 4న) సందర్భంగా మనస్ఫూర్తిగా స్వరనీరాజనాలు పలుకుదాం:-
 
బాలుగారి బాల్యం:-
1946 జూన్ 4న శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శంకుతలమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు జన్మించారు. నాన్న హరికథాగానం చేసేవారు. చిన్ననాటినుంచే పక్కింటి రేడియోలో వచ్చే పాటల్ని వింటూ సాధన చేస్తుండేవారు. 7వ తరగతి వరకు నెల్లూరులో చదివి, 8,9వ తరగతి నగరిలో చదివారు. శ్రీకాళహస్తిలో ఎస్ఎస్ఎల్ సి చదివారు.

సినిమా పాటలు బాగా పాడేవారు. తిరుపతిలో పీయూసీ కాలేజీలో చేరారు. అటు పిమ్మట అనంతపురంలో ఇంజనీరింగ్ సీట్ రావడంతో అక్కడ చేరారు. ఆర్కెస్ట్రా బృందంతో కలిసి అప్పుడప్పుడు నాటకాలు వేశారు. కాని అక్కడి వాతావరణం ఆయనకు నచ్చక  తిరిగి ఇంటికొచ్చారు. మద్రాస్ వెళ్లి ఎఐఎం చదువుతానన్నారు. అక్కడ్నుంచి సినిమాలో గాయకుడిగా ప్రయత్నాలు చేశారు.  ఓసారి 'సోషల్ కలచర్డ్ క్లబ్' వాళ్ళు పెద్ద స్థాయిలో పాటల పోటీ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కి ఘంటసాల, పెండ్యాల లాంటి గొప్పవాళ్ళు అతిధులుగా వచ్చారు. బాలుగారి స్నేహితుడైన మురళిగారు ఈ పోటీలో పాల్గొనమని చెప్పారట. కానీ ఆ పోటీ నిబంధన ప్రకారం సినిమా పాటలు కాకుండా సొంతంగా ఏదైనా పాట రాసుకొని పాడాలి. అప్పటికప్పుడు బాలుగారు స్వయంగా పాట రాసుకొని పాడి మొదటి బహుమతి పొందారు. 
ఆ తర్వాత నుంచి సినీ ప్రయత్నాలు గట్టిగానే మొదలుపెట్టారు. 
 
సినీ ప్రస్థానం:-

ఎస్పి కొందండరాంగారు మొదటగా ఒక అవకాశం ఇచ్చారు. అది 1966లో 'శ్రీశ్రీ మర్యాద రామన్న' సినిమాకు పాటలు పాడారు. 
ఎంఎస్ విశ్వనాథన్ గారు బాలుగారితో పాట పాడించుకొని, బాగుంది. తమిళంలో పాట పాడగలవా? తమిళం నేర్చుకొని వస్తే అవకాశమిస్తానని అన్నారట. అలా డబ్బింగ్ చిత్రాలకు పాడే అవకాశం వచ్చింది. 1969లో ఘంటసాల తో 'ఆలు మగలు' సినిమాకు ఒక పాటను కలిసి పాడారు.
 
గొంతు మహాత్యం తెలుసా?

ఏఎన్నార్, ఎన్టీరామారావు, శోభన్ బాబు, కృష్ణలాంటి సీనియర్ హీరోలేకాక ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతోపాటు తర్వాత వచ్చిన యువహీరోలదాకా దాదాపు అందరి హీరోలకు పాటలు పాడారు. ఆయన గొంతు అంతచక్కగా సరిపోయేది మరీ! ఆయన కొన్నాళ్లపాటు కమలహాసన్ రజనీకాంత్ లకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.  ఇలా తెరముందు ఎందరు హీరోలున్నా తెర వెనుక ఉన్నది ఆయనొక్కడే.. బాలు! 

హీరోలకే కాదు కమెడియన్లకి పాడారు. పలు రకాల గొంతుల్ని అచ్చు అలానే దింపేయగల ప్రతిభావంతులు బాలు. అసలు బాలుగారి గొంతులో విశిష్టత ఉందని, రకరకాల వాయిస్ లను ఇట్టే పట్టేయగలరని, ఆయనతో మిమిక్రీ చేయించవచ్చని ముందుగా పసిగట్టింది టీవీరాజు.

◆1976లో వచ్చిన 'మన్మథలీల' సినిమాకుగానూ తొలుత కమలహాసన్‌కు గొంతు అరువిచ్చారు బాలు. ఆ తర్వాత కమలహాసన్‌కు బాలుగారు పర్మనెంట్ డబ్బింగ్‌ ఆర్టిస్టయ్యారు. 'దశావతారం' సినిమాలో కమల్‌ పది పాత్రలకు పది రకాలుగా డబ్బింగ్ చెప్పారు అది రెండు రోజుల్లోనే! డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాక కొన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ గానూ, సినిమాల్లో ఆర్టిస్ట్ గానూ, నిర్మాతగానూ వ్యవహారించారు.

తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోనూ 700లకు పైగా హిందీపాటలు పాడారు. ఇవేకాక ప్రైవేటుగా భక్తి గీతాలతో కలిపి 16 భాషల్లో మొత్తంగా 37వేలకు పైగా పాటలు ఆలపించి చరిత్ర సృష్టించారు. 
 
◆బాలుగారు సావిత్రిగారిని వివాహమాడారు. ఇద్దరు పిల్లలు ఎస్పీ పల్లవి, ఎస్పీ చరణ్. కొడుకు చరణ్ గాయకుడు. చెల్లెలు ఎస్పీ శైలజ. నేపథ్య గాయని. నటుడు శుభలేఖ సుధాకర్ ను పెళ్లి చేసుకున్నారు. అన్నయ్య బాలుగారితో కలిసి సినిమాలకే కాదు, 'స్వరాభిషేకం' అనే కార్యక్రమంలో లైవ్ లో పాటలు పాడారు. 

అంతకన్నా ముందే వచ్చిన 'పాడుతా తీయగా' కార్యక్రమంలో బాలుగారు న్యాయనిర్ణేతగా వ్యవహారించారు. ఈ వేదిక ద్వారా ఎంతోమంది గాయనిగాయకులకు ప్రోత్సాహామందించారు.
 
మణి అని పిలిచేవారట:-

స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్లంతా బాలుగారిని 'మణి' అని పిలిచేవారు. కె. విశ్వనాథ్, చంద్రమోహన్ దూరపు బంధువులు అవుతారని ఆయనకు తరువాత తెలిసిందట.  స్నేహమంటే ఆయనకు చాలా ఇష్టం. మొదట్నుంచీ ఆయనకు స్నేహితులుగా ఉన్నవాళ్లు ఆయన చివరివరకు తోడుగానే ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
 
భాషకు పట్టం కట్టిన గానం:-

అక్షరాల్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ  అచ్చతెలుగు పాటల్నే ఆలపించారు. అర్థంపర్థం లేని పాటలను సున్నితంగా తిరస్కరించారు. అందుచేత సినీ పెద్దలు, నిర్మాతలు, సంగీత దర్శకులకు ఇలా ప్రతీఒక్కరితోనూ బాలుగారికి చనువెక్కువగా ఉండేదట. 
 
అవార్డులు, పురస్కారాలు:-
◆భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 6 జాతీయ అవార్డులు, 6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు లభించాయి. ఉత్తమ గాయకుడిగా, పలు విభాగాలకు కలిపి 26 నంది అవార్డులు వచ్చాయి.

◆1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.

◆2016లో శతవసంత భారత చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం వచ్చింది.
 
చిరకాలం నీ గానం:-

"లాలిజో లాలిజో ఊరుకో పాపాయి..పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి" అంటూ చంటిపిల్లలను ఊరడించే పాటయ్యావ్.
 
"మాటే రాని చిన్నదాని కళ్ళు తెలిపే ఊసులు"… అని బైటపడని ప్రేయసి భావాల్ని తెలుపుతూనే, "మాటరాని మౌనమిది మౌనవీన గానమిది" అని ప్రేమికుడి మౌనాన్ని పలికించే గానమయ్యావ్.
 
"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి" అనే పాటతో ఉలకని మనసునుద్దేశించి ప్రేమికుడివై ఆలపించావ్.
 
"శ్రీరస్తు శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం 
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు" అంటూ పెళ్లి పరమార్థాన్ని పాడి, ప్రతి కల్యాణ మండపంలో వినపడేలా చేశావ్.
 
"సింగారాల పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి" అని పంటలు చేతికొచ్చే సంక్రాంతి పర్వదిన సందర్భంగా స్వచ్ఛమైన స్నేహాగీతంగా వినిపించావ్.
 
"ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధిలీలా" అంటూ తప్పని చావును పాటతో సాగనంపావ్. యాభై వసంతాల్లో 16 భాషల్లో 37వేల పాటల్ని ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆ గొంతులో విసుగుపుట్టని మాధుర్యం దాగుంది. 
 
మరణం:-

2020 ఆగస్టులో కరోనా సోకింది, రెండు నెలల తర్వాత శ్వాసకోశ సమస్యలు ఎక్కువై, ఆరోగ్యం విషమించడంతో సెప్టెంబర్ 20న చెన్నైలోని ఎంజేఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 
 
నీ మరణం.. ఒంటరిది కావొచ్చు,
నీ పాట ఒంటరిది కాదు.
నీవు కూర్చిన స్వరాలు..
నీవు మలచిన గీతాలు 
మా మదిలో పదిలం.. 
'పాట'గాడివైన నీకు
ఇవే మా జోహార్లు…!
నీవు మళ్ళీ పుడితే 'బాలు' గానే పుట్టాలి.