BREAKING NEWS

సినిమా చక్రవర్తి: డా. డి. రామానాయుడు

 
వరుసగా ప్లాఫ్ లు.. లక్షల్లో లాస్..
అయినా చెక్కుచెదరని సంకల్పమే
గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా చేసింది.
ఒకటి కాదు, రెండు కాదు 
50 వసంతాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో...137 సినిమాలు,
13 భారతీయ భాషల్లో..
సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ నుంచి
ఫిల్మ్ మేకింగ్ యూనివర్సిటీగా నిలబడింది.
ఇందుకు సూత్రధారులు డి. రామానాయుడుగారు. 
ఆయన ఇంటర్ ఫెయిల్…

అయితేనేం, సినిమాల్లో చూపిన తెగువ ఇంతటీ కీర్తి, స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. ఆయన మనతో సజీవంగా లేకున్నా, ఆయన సినిమా సంస్థ ద్వారా నేటికి ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు..ఎన్నో సినిమాల్ని అందిస్తున్నారు.

ఈ నెల(జూన్) 6న డాక్టర్ డి. రామానాయుడుగారి జయంతి సందర్భంగా, ఆయన సినీ, జీవిత విశేషాలు ప్రత్యేకంగా మీకోసం...బాల్యం:-

1936 జూన్ 6న ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో దగ్గుపాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామానాయుడు జన్మించారు. వీరు ఉన్నత కుటుంబానికి చెందినవారు. ప్రాథమిక విద్యను అదే ఊర్లో చదివి, హై స్కూల్ ఒంగోలులో పూర్తి చేశారు. కానీ చదువుకన్నా సామాజిక సేవపైనే దృష్టి వహించేవారు. తెలుగుమీద విపరీతమైన అభిమానం. అందుకే తెలుగులోనే ఎక్కువ మార్కులు వచ్చేవి. మిగతావాటిల్లో అంతతమాత్రమే!

అప్పట్లో మద్రాస్ లయెలా కాలేజి కోసం 2 లక్షలు విరాళం పోగు చేసి ఇచ్చారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాలను మెచ్చి ఆ కాలేజివారు ఉచితంగా సీటు ఇచ్చారు. అలా మద్రాస్ లయెలా కాలేజీలో చేరారు. కానీ అక్కడ సర్రిగా చదవడం లేదని చీరాలలో వీఆర్ఎస్ కాలేజీకి మార్పించారు. ఇంకేముంది ఇంటర్ ఫెయిల్. దీంతో కుటుంబసభ్యులు కూడా ఎం చేయాలనేది ఆయన మీదకే వదిలేశారు. రామానాయుడుగారు తమకు వంశపారంపర్యంగా వస్తున్న వ్యవసాయాన్ని చేయాలనుకున్నారు. దుక్కి దున్నడం, నాట్లు వేయడం నేర్చుకొని, వ్యవసాయం చెయ్యడం మొదలు పెట్టారు. రామానాయుడుగారికి ఆయన మేనమామ కూతురు రాజేశ్వరితో వివాహమైంది. ఇద్దరు కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్, కూతురు లక్ష్మీ.రైస్ మిల్ వ్యాపారం, ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేశారు. 


సినిమాల్లోకి ఎంట్రీ:-

ఏన్నార్ గారు హీరోగా ఓ సినిమా షూటింగ్ నాయుడుగారుంటున్న ఊళ్ళోనే జరిగింది. ఇది విన్న రామా నాయుడుగారు చిత్ర నిర్మాణపనులు గురుంచి తెలుసుకోవడం మొదలు పెట్టారు. షూటింగ్ కు వచ్చినవాళ్ళు ఉండటానికి చోటు, భోజనాలవి ఏర్పాటు చేయడంతో, ఈ సినిమాలో కొంత పెట్టుబడి పెట్టే వీలు కలిగింది. అలా నాయుడు గారికి, ఏఎన్నార్ గారికి పరిచయం పెరిగింది. అప్పట్లో తెలుగులో వచ్చిన సినిమాలన్ని తమిళంలో డబ్బింగ్ చేసేవారు. దీంతో ఆయనకు ఇటు తెలుగు, అటు తమిళ్ యాక్టర్లు పరిచయమయ్యారు. 
అప్పటికే రామానాయుడు కుటుంబానికి 12 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి.  ప్రైవేటుగా నడుపుతున్న బస్సులను ప్రభుత్వం జాతీయం చెయ్యడంతో  ఆ వ్యాపారాన్ని అంతటితో ఆపేశారు. 

నిర్మాతగా:-

రామానాయుడుగారు తెలుగు సినిమా డైరెక్షన్ చాలా డగ్గర్నుండి చూడటంతో, డబ్బింగ్ సినిమాలను నిర్మించాలనుకున్నారట. అలా 'అనురాగం' సినిమాకు స్లీపింగ్ పార్టనర్ గా పని చేశారు. ఇక సినిమాల్లోకి పూర్తిగా వెళ్లాలని నిశ్చయించుకొని మద్రాసుకు మకాం మార్చారు. సినిమా ఇండస్ట్రీలోని 24 విభాగాల గురుంచి తెలుసుకున్నారు. 

1963లో విడుదలైన 'అనురాగం' సినిమా ప్లాఫ్ అయింది. డివి నర్సరాజుగారు ద్విపాత్రాభినయంతో కూడిన ఓ కథను నాయుడుగారికి వినిపించారు. ఆ కథ ఇదివరకు చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు. అదే 'రాముడు భీముడు' కథ. ఈ కథను విని నచ్చి, ఎన్టీఆర్ గారికి చెప్పి ఒప్పించారు. సొంత నిర్మాణసంస్థ కోసం 1963లో "సురేష్ ప్రొడక్షన్స్" అనే పేరుతో బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ మీద వచ్చిన మొదటి సినిమా 'రాముడు భీముడు'. ఈ సినిమా షూటింగ్ ను 8నెలల్లో పూర్తి చేసి, 1964 మే నెలలో ఆయన సొంత బ్యానర్ లో సినిమాను విడుదల చేసి మంచి హిట్ కొట్టారు. వంద రోజులు ఆడింది. తర్వాత వచ్చిన 'ప్రతిజ్ఞా పాలన' కూడా హిట్ అయింది. 

స్త్రీజన్మ, పాపకోసం, సిపాయి చిన్నయ్య, ద్రోహిలాంటి వరుస ప్లాఫ్ లతో 12 లక్షలు నష్టపోయారు. ఆ నష్టాలు భరించలేక, తిరిగి ఊరికి వెళ్లిపోవాలనుకున్నారు. 
అప్పుడే.. కె.ఎస్. ప్రకాష్ రావుగారు ఓ కథ చెప్పడానికని వచ్చారు. ఇక ఇదే చివరి ప్రయత్నంగా 15 లక్షలు ఖర్చు పెట్టి ఏన్నార్, వాణిశ్రీ జంటగా 'ప్రేమ్ నగర్' సినిమా తీశారు. అది హిట్! దాంతో శోభన్ బాబుతో కలిసి వరుసగా 3 సినిమాలు తీశారు. మళ్ళీ విజయాల్ని చవిచూశారు.

కొడుకునే హీరోగా...

కృష్ణ గారితో సినిమా చేయాలనుకున్నపుడు, ఆయనకు డేట్స్ కుదరలేదు. అప్పుడు కృష్ణగారు మీ చినబ్బాయి వెంకటేష్ ను సినిమాల్లో హీరోగా పెట్టి తీయండని సలహా ఇచ్చారు. ఇది నచ్చి, అమెరికాలో చదువుకుంటున్న వెంకటేష్ ను ఇండియాకు పిలిపించి 1987లో 'కలియుగ పాండవులు' అనే పేరుతో సినిమా తీశారు. ఇప్పుడు 'విక్టరీ వెంకటేష్' గా సినిమాలు చేస్తున్నారు.

◆పెద్దబ్బాయి సురేష్ బాబుకు 'సురేష్ ప్రొడక్షన్స్'లో మెళకువలు నేర్పించి, మంచి నిర్మాతగా తీర్చిదిద్దారు. 

ఏన్నార్ తో ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని తన కూతురు లక్ష్మీని అక్కినేని వారి కొడుకు నాగార్జునకు ఇచ్చి, పెళ్లి చేశారు. కానీ కొన్నాళ్ళకు వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 


అత్యధిక సినీ నిర్మాతగా రికార్డు:-

తెలుగులో 84, తమిళంలో 10, హిందీలో 17, కన్నడం 2, బెంగాలిలో 2, మలయాళం, ఒరియా, పంజాబీ, అస్సామీ, ఇంగ్లీష్ లో ఒక్కొక్క సినిమాను, ఇతరాలు కలిపి 13 భారతీయ భాషల్లో 130కి పైగా అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్" రికార్డును సాధించారు. 

◆2006లో రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు,2010లో 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు'లు లభించాయి.

◆2013లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 2 ఫిల్మ్ ఫేర్ లు వరించాయి. ఆయన సినిమాకు చేసిన విశేష కృషికిగానూ గౌరవ డాక్టరేట్ లభించింది.


మరణం:-

2002లో ప్రోస్ట్రేట్ గ్రంథి క్యాన్సర్ ఉందని తెలియడంతో అమెరికాకు తీసుకెళ్లి వైద్యం చేయించారు, ఆయన అప్పుడు కోలుకున్నా... 2015లో మళ్ళీ ఆ సమస్య తిరిగి దాడి చెయ్యడంతో బెంగళూర్, హైదరాబాద్ లలో చూపించారు. వ్యాధి ముదిరి, అనారోగ్యంతో అదే సంవత్సరం ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. 


ఇతరాంశాలు:-

◆ఎస్ పి బ్యానర్ లోగో కోసం సురేష్ బాబుని, వెంకటేష్ ను పక్కపక్కన నిలబెట్టి లోగోను తయారు చేయించారట. 

◆కె. బాపయ్య, కె. మురళీమోహన్, బి. గోపాల్ లాంటి సినీ దర్శకుల్ని ఆయన బ్యానర్ ద్వారా పరిచయం చేశారు.

◆కుష్బు, టబు, దివ్య భారతి, ప్రేమ లాంటి ఎందర్నో డెబ్యూ హీరోయిన్లుగా తీసుకొచ్చారు.

◆పాటల రచయిత చంద్రబోస్ ను సైతం ఆయనే పరిచయం చేశారు.

◆1999లో తెలుగుదేశం పార్టీలో చేరి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బాపట్లలో ఎంపీగా గెలిచి 2003లో 'ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు'ను తీసుకున్నారు. 

శతాధిక సినీ నిర్మాతగా, మన భారతీయ కరెన్సీ మీద ఎన్ని భాషలున్నాయో, అన్ని భాషలలో సినిమాలు తీసిన ఘనత ఒక్క రామానాయుడుగారికే చెల్లుతుంది!

Photo Gallery