BREAKING NEWS

'ఆషాడం'తో బోనాలు ఆరంభం…!

ఆషాఢ మాసం.. దీన్నే 'శూన్య మాసం' అని కూడా అంటారు. చెడ్డ రోజులుగా పిలువబడే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు, మంచి పనులకు శ్రీకారం చుట్టరు. అంతేకాక ఈ ఆషాఢం పూర్తయ్యేలోగా ఏదో ఒకరోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటారు. ఈ మాసం ప్రారంభంలో తెలంగాణ అంతటా బోనాలు మొదలవుతాయి. మరీ బోనంగా పిలువబడే వేడుక, పాటించే ఆనవాయితీల గురుంచి మనం ఈరోజు తెలుసుకుందాం:
 
గోరింట 

జ్యేష్ఠ మాసంలో ప్రారంభమైన వర్షాలు ఆషాఢం నాటికి రెట్టింపవుతాయి. పొలం పనులు చేసుకునేవాళ్లు, ఉద్యోగాలంటూ నిత్యం పరుగులుపెట్టే ఉద్యోగస్తులు… తరచుగా వర్షపు నీటిలో నానుతూ ఉంటాం. అప్పుడు చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరుగుతుంది. గోరింటాకు ఈ సమస్యను నివారించడంలో బాగా సాయపడుతుంది. ఈ మాసంలో గోరింటాకు చెట్టు లేత ఆకులతో కళకళాడుతుంది. ఆ సమయంలో గోరింటాకును కోయడం వల్ల చెట్టుకి ఏమాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎర్రగా పండుతాయి.

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అలా అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలో కఫానికి సంబంధించిన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. ఈ గుణం వల్ల బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది.
 
ఆనవాయితీ

ఆషాఢంలో కొత్త పెళ్లికూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల ఇటు పుట్టింటికి, అత్తింటికి మంచి చేస్తోంది. తమ చేతులకు పెట్టుకునే గోరింట, తమ సౌభాగ్యాన్ని పెంచుతుంది. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
 
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధగుణాల్ని సంతరించుకున్నవే! గోరింటాకు పొడిని మందుగా తీసుకోవడం, గోరింటాకుతో కాచిన నూనెని వాడటం వినేవుంటాం. 
కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడు, వివాహాది శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది మన పెద్దల ఉద్దేశం.

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్లను పెట్టుకుంటుంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే 'లాసోన్‌' అనే సహజ రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో ఇందుకు ప్రత్యామ్నాయంగా కృత్రిమంగా వచ్చే ఎరుపు రంగుని కలిగించే రసాయనాలను కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట ఏమోగానీ, అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యమివ్వాలి. 
 
బోనాలు

సమస్త జీవరాశి మనుగడకు ఆధారం ప్రకృతి మాతే! ఆ ప్రకృతిని పరాశక్తిగా భావించి ఆరాధించడం అనాతిగా వస్తున్న మన తెలుగు భారతీయుల సంప్రదాయం. వైపరీత్యాలను నిలువరించడం కోసం ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు నిర్దేశించినవే ఈ ఉత్సవాలు, జాతరలు. 

అలాంటి వేడుక తెలంగాణ ప్రాంతంలో నిర్వహించే 'బోనాలు'గా పిలువబడుతుంది. ఆషాఢమాసంలో తొలి ఆదివారం బోనాల ఉత్సవాలు మొదలై... నెలరోజులపాటు సాగుతాయి. వర్షాకాలంలో వ్యాధుల నుంచి, ఇతర విపత్తుల నుంచి తమను కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ... అమ్మకు బోనం సమర్పించడమే ఈ ఉత్సవం పరమార్థం.
 
కొన్ని శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో ఈ వేడుకలు జరుగుతున్నట్టుగా చరిత్ర చెబుతోంది.

ప్రతి గ్రామం మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠించి, దానికి పసుపు కుంకుమలు అద్ది, పూజలు చేసి, తమ ఇళ్లల్లో చేసిన నైవేద్యాలను నివేదించడం అనాది సంస్కృతి. అలా నివేదించిన భోజనమే 'బోనం'గా పిలుస్తారు. 
 
ఎలా మొదలైదంటే

కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ పాలకులు కాకతిని తమ కులదైవంగా ఆరాధించేవారనీ, రాజ్యంలో అందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించేలా అనుగ్రహించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ఆషాఢ మాసంలో ఉత్సవాలు నిర్వహించేవారనీ తెలుస్తోంది. 
కాగా, 1908లో మూసీ నదికి వరదలు వచ్చి.. ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించాయి. ఎక్కువమొత్తంలో ప్రాణనష్టం జరిగింది. ఆ సమయంలో గోల్కొండలో వెలసిన జగదాంబికకు పూజలు చేస్తే పరిస్థితి అంతా చక్కబడుతుందని సూచించారు.

నాటి గోల్కొండ ప్రభువు మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ .. అమ్మవారికి పూజలు జరిపించి, బోనాల సమర్పణ చేయించాడు. అనంతరం ప్రశాంతత నెలకొంది. ఫలితంగా నాటి నుంచి ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనాల సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాతే ఆది, గురువారాల్లో తెలంగాణ ప్రాంతమంతా గ్రామదేవతలకు బోనాలు సమర్పించి, ఉత్సవాలు నిర్వహిస్తారు. 
హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ జంట నగరాల్లో బోనాల సంబరాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. 
 
బోనం'…

అమ్మవారికి నివేదించే భోజనం(బోనం)లో… అన్నం వండి, పాలు  లేదా పెరుగులో బెల్లం కలిపి… ఈ మిశ్రమాన్ని కొత్త కుండలో నింపుతారు. ఈ కుండ అంచు చుట్టూ వేపాకులు కట్టి, మూత పెట్టి, ఆ మూత మీద ప్రమిద వెలిగిస్తారు. ఈ కుండను మహిళలు తమ తలపై పెట్టుకొని, ఊరేగింపుగా తమ ప్రాంతంలోని ఆలయాలకు తీసుకువస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి బోనం నివేదిస్తారు. ఆ తరువాత ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు. అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో వేప మండలను పసుపు నీటిలో ముంచి, సంప్రోక్షణ చేశాక... అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే ‘సాక (కొమ్మ... వేప మండతో చేసే సంప్రోక్షణ) పెట్టడం’ అంటారు. 
 
పోతురాజు

మహిళలు ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి, పుట్టింటికి స్వాగతించి, నెలరోజులపాటు బోనాల సంబరాలు వేడుకగా చేసుకుంటారు. 
ఇంటికి వచ్చిన ఆడపడుచుకు సారె ఇచ్చి సాగనంపడం మన ఆనవాయితీ. 
దాన్ని అనుసరించి, ప్రతి ఇంటా అమ్మవారి కోసం వివిధ రకాల పిండివంటలు చేసి, వాటిని ఆలయానికి తీసుకువచ్చి, అమ్మవారికి నివేదిస్తారు. ఈ ఫలహారపు బండ్ల ఊరేగింపు ఎంతో వైభవంగా సాగుతుంది. 

ఈ జాతరలో 'పోతురాజు'ది ప్రధాన పాత్ర. పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఒళ్ళంతా పసుపు పూసుకొని, కాళ్ళకు గజ్జెలు పెట్టుకొని, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళకు కాటుక అలంకరించుకొని, చేతిలో కొరడాతో పోతురాజులు చేసే విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి. 

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి బోనాల మరుసటి రోజు ఈ రంగం నిర్వహిస్తారు. ఇదే సమయంలో పచ్చి కుండపై అవివావిహత అయిన ఓ మహిళ నిలబడి... అమ్మవారి వాక్కుగా... భవిష్యత్‌ వాణిని వినిపిస్తుంది. 
ఆషాఢమాసం చివరివారంలో గోల్కొండలోనే జరిగే ఆషాఢ జాతరతో ఈ బోనాల ఉత్సవం ముగుస్తుంది.