BREAKING NEWS

క్రికెట్ కు వీడ్కోలు పలికిన 'మిథాలీ రాజ్'..!

ప్రపంచకప్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు…
వన్డేల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి మహిళా బ్యాటర్‌గా అరుదైన ఖ్యాతి..

అంతర్జాతీయ టీ-ట్వంటీల్లో రెండువేల పరుగుల మార్క్‌ చేరుకున్న తొలి భారత బ్యాటర్‌ ఆమె…

జాతీయ జట్టు తరఫున 12 టెస్టులు, 89 టీ20లు ఆడిన 39 ఏళ్ల మిథాలీ.. మూడు ఫార్మాట్లలో కలిపి 10,868 పరుగులు తన పేరిట రాసుకుంది. 

అసలు భారత్‌లో మహిళలు కూడా క్రికెట్‌ ఆడతారా? అనే అవమానాల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది మిథాలీ!
సచిన్‌ టెండూల్కర్‌ను తలపించే చక్కని కవర్‌డ్రైవ్‌లు.. 
సునీల్‌ గవాస్కర్‌ను మించిన బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌లతో…
23 ఏళ్లపాటు భారత మహిళా క్రికెట్‌కు ఆదర్శంగా నిలిచిన మిథాలీ దొరై రాజ్‌.. 
తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 

39 ఏళ్ల వయసులో ఆటకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆమె క్రికెట్ కెరీర్ గురుంచి ఈరోజు విశేషంగా తెలుసుకుందాం:
 
మిథాలీ సుమారు 23 ఏళ్ల పాటు ఇండియా జ‌ట్టు త‌ర‌పున ఆడారు. టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. మిథాలీ పూర్తి పేరు మిథాలీ దొరైరాజ్‌, 1982 డిసెంబర్‌ 3న రాజస్థాన్‌లో జన్మించింది. ఆరేండ్ల వయసులో తన సోదరులతో కలిసి జింఖానా గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించిన మిథాలీ..

చిన్నప్పుడు డ్యాన్సర్‌ కావాలనుకుందట. భరతనాట్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన మిథాలీని.. తల్లిదండ్రులు క్రికెటర్‌ను చేయాలని భావించారు. ఆమె మాత్రం మైదానం బయట కూర్చొని హోంవర్క్‌ చేసుకుంటూ, కునికిపాట్లు తీసేదట. 

కెరీర్ ప్రారంభంలో మిథాలీ అయిష్టంగానే బ్యాట్‌ పట్టినా.. ఆమె ఆటతీరు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. డ్యాన్స్‌ను పక్కన పెట్టి పూర్తిస్థాయి క్రికెట్‌పై దృష్టిపెట్టిన మిథాలీ.. చూస్తుండగానే మంచి ప్లేయర్‌గా ఎదిగింది. 13 ఏళ్ల వయసులో దేశం తరఫున క్రికెట్‌లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. 

అండర్‌-16, అండర్‌-19 టోర్నీల్లో గొప్ప ఇన్నింగ్స్ ను ప్రదర్శించింది. దీంతో 1999లో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైంది. మొదట్లోనే సెంచరీ చేసి, తన ఆగమనాన్ని ఘనంగా చాటిన మిథాలీ.. ఆ తర్వాత ఏరోజూ వెనుదిరిగి చూసుకోలేదు.
 
ఎలా మొదలైందంటే

1999 జూన్‌లో మిథాలీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఐర్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డేలో ఆమె అరంగేట్రం చేశారు. ఇటీవ‌ల న్యూజిలాండ్‌లో జ‌రిగిన ఐసీసీ విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు సార‌థ్య బాధ్య‌త‌లు తీసుకుంది. 
1999 జూన్‌ 26న ఐర్లాండ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసిన మిథాలీ.. తొలి మ్యాచ్‌లో అజేయంగా 114 పరుగులు చేసి అదుర్స్‌ అనిపించింది.

2005 ప్రపంచ క‌ప్‌లోనూ ఇండియా జట్టుకు మిథాలీ ప‌గ్గాలు చేప‌ట్టింది. కానీ ఆ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ప‌రాజ‌యం చ‌విచూసింది.

2017లో మిథాలీ నేతృత్వంలోని మ‌హిళ‌ల జ‌ట్టు ఐసీసీ విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లోకి చేరింది. ఆ ఫైన‌ల్లో భాగంగా ఇంగ్లండ్ చేతిలో స్వ‌ల్ప తేడాతో ఇండియా ఓడిపోయింది. 
 
సాధించిన పరుగులు

◆ 232 వన్డేల్లో 7,805 పరుగులు సాధించి, భారత్‌ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఘనత ఆమెది. 

◆ 12 టెస్టు మ్యాచ్ లకు గానూ, 43.68 సగటు రేటుకు 699 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 1 సెంచరీ, 4 అర్ధసెంచరీలు చేసింది.

◆ 232 వన్డేలకు, 50.68 సగటు రేటుకు, 7805 పరుగులు సాధించింది.
7 సెంచరీలు, 64 అర్ధసెంచరీలు, 8 వికెట్లు తీసింది.

◆ 89 టీ20లు, 2364 పరుగులు, 37.52 సగటు రేటున 17 అర్ధసెంచరీలు చేసింది.

◆ తొలి వన్డే : ఐర్లాండ్‌పై 1999 జూన్‌ 26న,

◆ చివరి వన్డే: దక్షిణాఫ్రికాపై 2022 మార్చి 27న,

◆ తొలి టెస్టు: ఇంగ్లండ్‌పై 2002 జనవరి 14-17, 

◆ ఆఖరి టెస్టు: ఆస్ట్రేలియాపై 2021, సెప్టెంబర్‌ 30- అక్టోబర్‌ 3 వరకు,

◆ తొలి టీ20: ఇంగ్లండ్‌పై 2006 ఆగస్టు 5న,

◆ చివరి టీ20: ఇంగ్లండ్‌పై 2019 మార్చి 9న జరిగింది.

◆ వరుసగా 2005, 2017లో జరిగిన రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక సారథి(మహిళలు, పురుషులు కలిపి)గా మిథాలీ రికార్డుల్లోకెక్కింది.

◆ టెస్టుల్లో అతిపిన్న వయసు(19 ఏండ్ల 254 రోజులు ఆడి)లో డబుల్‌ సెంచరీ సాధించింది.

◆ వన్డేల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కురాలు(16 ఏండ్ల 205 రోజులు)

◆ మహిళల అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు (7805) రికార్డు

◆ భారత్‌ తరఫున అత్యధిక(155) వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగింది.

◆ వన్డేల్లో వరుసగా ఏడు అర్ధసెంచరీల రికార్డు,
109 మహిళల వన్డేల్లో వరుసగా 109 మ్యాచ్‌ల్లో భారత్‌ తరఫున మిథాలీ ప్రాతినిధ్యం వహించడం విశేషం! 
మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు(10, 868) చేసిన క్రికెటర్‌ మిథాలీరాజ్‌…

అవార్డులు
2003- అర్జున అవార్డు,

2015- పద్మశ్రీ,

2017-యూత్‌ స్పోర్ట్స్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు,

2017- వోగ్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌,

2017- బీబీసీ 100 మహిళల్లో స్థానం,

2017- విజ్డెన్‌ లీడింగ్‌ వుమన్‌ క్రికెటర్‌,

2021-ఖేల్ రత్న అవార్డు.
 
ఆమె మాటల్లో

ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం పొందాను. ప్రతి ప్రయాణంలాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా!

ఈరోజు నేను నా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శనను కనబరచి జట్టును గెలిపించాలని భావించేదానిని.

ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు భారత్ తరఫున ఆడాలి. భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలని కోరుకుంటున్న అంటూ ఆమె భావోద్వేగ నోట్‌ ను షేర్‌ చేశారు.
 
◆ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమనేది ఒక కల, అది కొందరికే సాధ్యం. 23 ఏండ్ల పాటు దేశానికి ఆడటం అద్భుతం. దేశ మహిళల క్రికెట్‌కు నువ్వొక పిల్లర్‌. ఎంతో మంది అమ్మాయిలను తీర్చిదిద్దావు. సుదీర్ఘ కాలం పాటు దేశ క్రికెట్‌కు సేవలందించిన నీకు శుభాకాంక్షలు.

వీవీఎస్లక్ష్మణ్.
 
ఒకప్పుడు కనీస గుర్తింపు లేని మహిళల జట్టులో సభ్యురాలిగా ఉన్న మిథాలీ.. ఆ తర్వాత విపరీతమైన జనాకర్షణ కలిగిన టీమ్‌కు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగింది. విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే అనుమతి లభించడమే గొప్ప అనుకునే సమయం నుంచి విమానాశ్రయాల్లో మహిళల జట్టుకు బ్రహ్మరథం పట్టేంతవరకు భారత క్రికెట్‌లో మిథాలీ ప్రస్థానం కొనసాగింది. బ్యాటింగ్‌లో లెక్కకు మిక్కిలి ఘనతలను తన ఖాతాలో వేసుకుంది. ‘ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ మహిళా క్రికెటర్‌ మిథాలీనే’అని భారత మహిళల మాజీ కెప్టెన్‌ శాంతా రంగస్వామి పేర్కొంటే.. సునీల్‌ గవాస్కర్‌ తర్వాత బంతిని కళాత్మకంగా కొట్టడంలో మిథాలీని మించిన వారు లేరని యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

దేశంలో ఎందరో అమ్మాయిలు బ్యాట్‌ పట్టేందుకు ప్రేరణగా నిలిచిన మిథాలీ.. ఇక ముందు కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తానని, త‌న ప‌ట్ల ఎనలేని ప్రేమ‌ను, అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించిన వారంద‌రికీ ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో థ్యాంకూ చెప్పారు. 

మరి మనం కూడా ఈ లేడీ సచిన్‌కు మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం!