BREAKING NEWS

రియల్ లైఫ్…'మేజర్'!

భారతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డ… దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం ఓర్చి, అమరుడైన వీరుడు. అతని త్యాగనిరతితో ఎంతోమంది యువ సైనికులకు ఆదర్శ ప్రాయమయ్యాడు. ఈయన అంత్యక్రియలలో సంతాపం ప్రకటించడానికి  అభిమానులు పెద్ద ఎత్తున బెంగుళూరులో ఉన్న ఆయన ఇంటి ముందు బారులు తీరడం.. బెంగుళూరులోని రామమూర్తి నగర్  ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ లో విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయడం… ముంబయ్ లోని జోగేశ్వరి, విక్రోలి లింక్ రోడ్ లోని ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రవేశ ద్వారం వద్ద అతని విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషం! ఈయన జీవితం ఆధారంగానే తాజాగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు హీరోగా 'మేజర్' అనే టైటిల్ తో ఒక సినిమా సైతం వచ్చి, ప్రజాదరణ పొందింది. అటువంటి రియల్ లైఫ్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత విశేషాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం:
 
బాల్యం, చదువు

1977 మార్చి 17న కేరళ రాష్ట్రంలో ఉన్న కోజికోడ్ జిల్లాకు చెందిన చేరువన్నూరు అనే గ్రామంలో ఉన్ని కృష్ణన్, ధనలక్ష్మి ఉన్ని కృష్ణన్ దంపతులకు జన్మించారు సందీప్ ఉన్ని కృష్ణన్. వీరి ఏకైక సంతానం సందీప్. నాన్న ఇస్రోలో ఆఫీసర్ గా పనిచేసేవారు. కొడుకుని చాలా ప్రేమగా చూసుకున్నప్పటికీ గారాభమైతే చేయలేదు. ఆ తల్లిదండ్రులు గారాభం చేసినా ఏ రోజు అతను అలుసుగా తీసుకోలేదు. సందీప్ బెంగుళూర్ లో 'ది ఫ్రాంక్ అంథోని పబ్లిక్ స్కూల్'లో 14 సంవత్సరాల పాటు చదువుకున్నారు. ఇక్కడ చదువు ముగించుకొని ఐఎస్ సీసీ సైన్స్ టీంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే సైన్యంలో చేరాలని అనుకున్నాడు. అందుకోసం క్రుకట్ స్కూల్లో కూడా చేరాలనుకున్నాడు.

వారి నాన్న గారి సలహా తీసుకుని క్రుకట్ స్కూల్లో చేరాడు. క్రుకట్ స్కూల్ అంటే చాలా రకాల క్రీడల్లో శిక్షణనిస్తారు. సైన్యంలో చేరడానికిగానీ, పోలీస్ ఆఫీసర్ అవ్వడానికిగానీ ఈ స్కూల్ లో మంచి శిక్షణ ఉంటుంది. సైన్యంలో ఏ విధంగా అయితే శిక్షణనిస్తారో, ఇక్కడ కూడా అదే విధంగా శిక్షణనిస్తారు. క్రుకట్ లో మంచి క్రీడాకారుడిగా పేరు సంపాదించుకున్నాడు సందీప్. 

1995లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. ఈ అకాడమీలో 9వ కోర్సులో భాగంగా ఆస్కార్ స్క్వార్డర్ నంబర్ 4వ బెటాలియన్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత ఇండియన్ మిలటరీ అకాడమీలో డెహ్రాడూన్ లో 104వ రెగ్యులర్ కోర్సులో చేరాడు.
 
విధులు- బాధ్యతలు

◆ 1999 కల్లా మిలటరీ అకాడమీలోనూ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత సైన్యంలో బీహార్ రెస్మెంట్ బెటాలియన్ నంబర్ 7లో లెఫ్ట్ నెంట్ గా నియమితుడయ్యాడు. 

◆ 1999లో పాకిస్తాన్ సైనికులు భారీ ఫిరంగులు, ఆయుధాలతో కాల్పులు జరిపినప్పుడు ఆపరేషన్ విజయ్ లో పాల్గొని ఫార్వార్డ్ పోస్టులో తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు సందీప్.

◆ 1999 డిసెంబర్ 31న సందీప్ ఆరుగురు సైన్యంతో కూడిన బృందానికి నాయకత్వం వహించి 200 మీటర్ల దూరంలోనున్న ప్రత్యర్థులను ప్రత్యక్షంగా పరిశీలించి కాల్పులు జరిపించి, విజయం సాధించాడు. 

◆ 2003 జూన్ 12న సందీప్ చేసిన సేవలకు గుర్తింపుగా కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు. 

◆ 2005 జూన్ 13న మేజర్ గా పదవిని స్వీకరించారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో అత్యంత కష్టతరమైన కోర్సు గటాక్ కోర్సులో చేరి ఇన్ స్పెక్టర్ గ్రేడింగ్ లో అగ్రస్థానంలో నిలిచారు. 
శిక్షణ సమయంలో సందీప్ తోటివారి పట్ల తన ఉదారతను చూపి అందరి మన్ననను పొందాడు.
సందీప్ ఎప్పుడు విశ్రాంతిని కోరుకునేవాడు కాదు. ఎప్పుడు దేశ సేవలోనే నిమగ్నమవ్వాలని భావించేవాడు. 

◆ హై అల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్లో శిక్షణ తీసుకొని సియాచిన్, జమ్మూ కశ్మీర్, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ వంటి అనేక చోట్ల విధులు నిర్వహించారు. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లో చేరడానికి ఎంపికయ్యారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా శిక్షణ తీసుకున్న అనంతరం 2007 జనవరిలో ఎన్ఎస్ జిఎఫ్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ లో ట్రైనింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందాడు. ఆ సమయంలో ఎన్ఎస్ జిలో జరిగే చాలా కార్యకలాపాలలో పరోక్షంగా పాల్గొన్నాడు. 
 
కమాండర్ గా ఉన్నప్పుడే

2008 నవంబర్ 26న… దక్షిణ ముంబయ్ లోని తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్ లో 11మంది పాక్ ఉగ్రవాదులు చొరబడి, ఆ హోటల్లో బస చేసిన వారిపై, ఆ హోటల్ సిబ్బందిపై ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో భాగంగా అనేక మందిని బంధిలుగా ఉంచారు. అప్పుడు సందీప్ 51 స్పెషల్ యాక్షన్ టీంకి కమాండర్ గా వ్యవహరించాడు. 11మంది కమాండర్ బృందంతో రంగంలోకి దిగాడు. తమ టీంను తీసుకొని 6వ అంతస్తుకు చేరుకున్నాడు. 5వ అంతస్తులో ఉన్న బందీలను చాకచక్యంగా విడిపించి, 4వ అంతస్తులో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రయత్నించాడు.

కానీ అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కమాండర్ సునీల్ కుమార్ రెండు కాళ్లలోనూ బులెట్లు దిగాయి. సునీల్ కుమార్ ని అక్కడినుంచి కిందికి పంపించి తిరిగి వచ్చి ఉగ్రవాదుల పనిపడదాం అని అనుకునే లోపలే ఉగ్రవాదులు గ్రానైట్ పేల్చీ అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఉగ్రవాదులు వీరిపై తిరిగి కాల్పులు జరిపారు. దాదాపు 15 గంటలు కష్టపడి మేజర్ సందీప్, అతని టీం బందీలుగా ఉన్న 14 మందిని ప్రాణాలతో కాపాడారు. 

మరుసటి రోజు అంటే, 2008 నవంబర్ 27న అర్ధరాత్రి మేజర్ సందీప్ అతని టీం హోటల్ మధ్యలోనున్న మెట్ల మార్గంలోనుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ మార్గంలో వెళ్లడం చాలా కష్టమని వారికి తెలుసు. ఎందుకంటే ఆ మార్గం నుంచి వెళ్తే అన్ని వైపులా ఎవరెళ్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఉగ్రవాదుల దగ్గర చిక్కుకుపోయిన పౌరులను కాపాడాలంటే ఇంకో మార్గం వారికి లేదు. మెట్ల మార్గమే వారికి ఉన్న ఏకైక మార్గం. అందుకే రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేయలేదు సందీప్, ఆయన టీం. అయితే గాయాలతో ఉన్న కమాండర్ సునీల్ కుమార్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో, ఆయనని కిందకి పంపే ప్రయత్నం చేసి ఆయనే ఒంటరిగా ఉగ్రవాదులతో పోరాటం చేశారు.

ఉగ్రవాదులతో ఒంటరిగా పోరాడుతూనే వారితో ఒక గేమ్ ప్లాన్ వేశారు సందీప్. ఉగ్రవాదులు తప్పించుకోవడానికి పై అంతస్తుకు వెళ్ళినప్పుడు నలుగురు ఉగ్రవాదులను చంపి తాజ్ హోటల్లో ఉత్తరాన ఉన్న బాల్ రూమ్ లో పడేశారు. అయితే ఆ ఎన్ కౌంటర్ లో సందీప్ గారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన రిస్క్ తీసుకొని, ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో తమ టీం మెంబర్స్ ని, అందర్నీ కాపాడటం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేశారు.. రియల్ లైఫ్ మేజర్.. సందీప్ ఉన్ని కృష్ణన్.