BREAKING NEWS

ఆరోగ్య 'యోగ' ప్రాప్తిరస్తు!

యోగా అంటే.. జీవనయోగమని అర్ధం.

యోగా.. భారతీయ వైద్య విధానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యంతో పాటు యోగా కూడా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయగలదు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవనశైలి ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఆ మార్పు ఎంతలా అంటే మనిషి తన శరీరం, మనసు మీద నియంత్రణ కోల్పోయే దశకు చేరుకున్నాడు.

దాని ఫలితంగానే అధిక రక్తపోటు, ఊబకాయం, హృద్రోగం, ఒత్తిడి, మతిమరుపు వంటి రకరకాల శారీరక, మానసిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నాడు. 

మరోవైపు ఇతర దేశాల వైద్య విధానాలు, ఇంగ్లీష్ మందుల వాడకం వల్ల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీంతో చాలామంది యోగాలోని ప్రాకృతిక చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఆసనాలను రోజులో భాగంగా అలవాటు చేసుకుంటున్నారు. 

మనదేశ యోగా థెరపీ విధానాలు, వాటి ప్రభావాలపై అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోనూ కీలక పరిశోధనలు జరుగుతున్నాయి. 
తాజాగా అల్లోపతి వైద్య విద్యలోనూ యోగాను ఒక ముఖ్య పాఠ్యాంశంగా చేర్చడమైంది. దాదాపు కార్పొరేట్‌ ఆసుపత్రులన్ని యోగా థెరపీకి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాయి.
 
మనలోని శారీరక, మానసిక చింతలకు మూలం మనమే, వాటి నివారణకు ఉపయుక్తం ఈ యోగ. శ్వాస, ధ్యాస, ఆసనం.. అనే ఈ మూడు వ్యవస్థల సమ్మేళనంగా యోగ చికిత్సను చెప్పవచ్చు. కొన్నివేల సంవత్సరాల క్రితం.. అప్పట్లో ఆశ్రమాల్లో మహర్షులు చేసిన యోగ ప్రక్రియను పతంజలి మహర్షి గ్రంథస్తం చేశారు. అన్నిరకాల సూత్రాలను ఒక చోటుకు చేర్చారు. ఆయుర్వేద, వ్యాకరణ శాస్ర్తాల ఆవిష్కర్త కూడా పతంజలి మహర్షే అనే వాదన సైతం ఉంది. 

అసలు యోగాకి సూత్రాలు ఉన్నాయా అంటే, ఉన్నాయి. యోగాకి ఎనిమిది సోపానాలు. అవి: 
◆ ‘యమ’.. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది. 

◆ ‘నియమం’.. వ్యక్తిత్వ వికాస పాఠమనే చెప్పాలి. పరిశుభ్రత, అంతరదృష్టి, కర్తవ్య నిష్ఠ మొదలైన సూత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి. 

◆ ‘ఆసనం’.. యోగాసనాల ప్రాధాన్యాన్ని ఇది వివరిస్తుంది. 

◆ ‘ప్రాణాయామం’.. ప్రాణశక్తిని పెంచుకోగల విద్య ఇది. 

◆ ‘ప్రత్యాహారం’.. మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లే మార్గం ఇది. 
◆ ‘ధారణ’.. మనసుకు ఏకాగ్రతనిస్తుంది. 

◆ ‘ధ్యానం’ మనసు మీద నియంత్రణను ప్రసాదిస్తుంది. 

◆ సమాధి.. ఇదే అత్యున్నత యోగ సోపానం! 

ఇదే అద్వైత సిద్ధికి అసలైన పరమార్థం. మానవుడు అనుభవించే సుఖదుఃఖాలు, జయాపజయాలు.. సమానంగా స్వీకరించగలిగే మహోన్నత స్థాయి.

ఇక్కడికి చేరుకోగానే మనిషి పరిపూర్ణుడవుతాడు. జీవితం తేజోవంతంగా ప్రకాశిస్తుంది. అనారోగ్యం దరిచేరదు. 

ఈ సంప్రదాయ యోగాను ఎనిమిదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సాధన చేయవచ్చు. అయితే, గురువు సమక్షంలో నేర్చుకోవడమే ఉత్తమం! ఆ తరువాత స్వయంగా సాధన చేసుకోవచ్చు. అంతేకానీ సోషల్ మీడియాను ఫాలో కావొద్దు. యూట్యూబ్‌, వాట్సాప్‌ లలో వచ్చే సందేశాలను, వీడియోలను అనుసరిస్తూ ఆసనాలు వేయడం ప్రమాదకరం. కొన్నిసార్లు అవి ప్రాణాంతకమూ కావొచ్చు.
 
◆ యోగా థెరపీ ద్వారా 70 శాతం వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. 

◆ వంశపారంపర్యంగా, జీవన విధానం కారణంగా వచ్చే క్యాన్సర్‌, హృద్రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలనూ యోగ చికిత్స ద్వారా నియంత్రించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

◆ ముద్రలు, బంధాలు, ప్రాణాయామం, షట్‌ క్రియలు(గజకర్ణి, శంఖు ప్రక్షాళన, జలనేతి, కపాలభాతి, నౌళి, త్రాటక వంటి క్రియలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి) జన్యుపరమైన వ్యాధులను సైతం అడ్డుకుంటాయని నిర్ధారణ అయ్యింది. 

◆ సాధారణ వ్యక్తులతో పోలిస్తే యోగ సాధకుల్లో డీఎన్ఏ చాలా చైతన్యవంతంగా ఉంటుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది.
 
యోగకు చికిత్స

ఒత్తిడి, డిప్రెషన్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, ఊబకాయం, సంతానలేమి, హైపో థైరాయిడిజం, వెన్నునొప్పి.. వంటి రకరకాల రుగ్మతలకు యోగా థెరపీని ఎంచుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అవేంటంటే…
 
◆ సూర్య నమస్కారాలు, గోముఖాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సుప్త వజ్రాసనం, సూర్య- చంద్రభేద ప్రాణాయామం, కపాలభాతి వంటి ఆసనాలు మధుమేహానికి ఉపయుక్తమవుతున్నాయి.
 
◆ నాడీ శుద్ధి ప్రాణాయామం, శవాసనం, వజ్రాసనం, సుప్త వజ్రాసనం, శిథిలాసనం, శశాంకాసనాలు హైపర్ టెన్షన్, అధిక రక్తపోటును నియంత్రణకు తోడ్పడుతున్నాయి.
 
◆ సుఖ-నాడీశుద్ధి ప్రాణాయామం, యోగనిద్ర, త్రికోణాసనం, గోముఖాసనం, ఉష్ర్టాసనం, భుజంగాసనం, శలభాసనం వల్ల హృద్రోగ సమస్యలు దూరం అవుతాయి.
 
◆ యోగనిద్ర, గర్భాసనం, భుజంగాసనం, నాడీశుద్ధి ప్రాణాయామం వల్ల స్త్రీ- నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
 
◆ సూర్య నమస్కారాలు, గోముఖాసనం, వజ్రాసనం, ఉష్ర్టాసనం.. ఉబ్బసాన్ని దూరం చేస్తున్నాయి.
 
◆ త్రికోణాసనం, తాడాసనం, అర్ధచంద్రాసనం, నావాసనం, ప్రాణాయామంలు ఆర్థరైటిస్ ను నివారిస్తాయి.
 
మన ప్రాచీన యోగా పద్ధతులు- పరమార్థం

◆ జ్ఞాన యోగ..  జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటాన్ని జ్ఞాన యోగ అంటారు. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. ఆపై సృష్టి రహస్యాన్ని తెలుసుకొని దాని మూల కేంద్రాన్ని చేరుకోవటమే ఈ జ్ఞాన యోగ సారం.
 
◆ భక్తి యోగ.. భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. అందులో భాగంగా తమని తాము అర్పించుకోవటం వల్ల ముక్తి లభించడమే భక్తి యోగ సారం.
 
◆ కర్మయోగ.. ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ పని తాను చేసుకుపోవడమే కర్మయోగ సారం.
 
◆ మంత్రయోగ.. మీకు ఇష్టమైన మంత్రం(రామ) లేదా శబ్దం(ఓం) ద్వారా చేరవలసిన గమ్యాన్ని చేరటమే మంత్ర యోగ సారం.
 
◆ యంత్ర యోగ… ఇష్టమైన దేవుని ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకోవడం, ఆపై ఇష్టారాధన చేస్తూ, అందులోనే లినమైపోవడం యంత్ర యోగ సారం.
 
◆ లయ యోగ…ఇష్టమైన దానిలో ఇమిడిపోవడం, కలిసిపోవడం. అదే లోకంగా జీవించడం లయ యోగ సారం.
 
◆ తంత్ర యోగ…మంత్ర తంత్రముల ద్వారా అనుకున్నది సాధించడం.
 
◆ కుండలిని యోగ.. శరీరంలో దాగివున్న శక్తిని బయటకు తీసి, దాని ద్వారా గమ్యాన్ని చేరడం.
 
మొత్తానికి ప్రపంచం సైతం ఆరోగ్యాన్ని ప్రసాదించే 'యోగా' చుట్టూనే తిరుగుతోంది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలకు జై కొడుతున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర.. వీటినే ప్రత్యామ్నాయ చికిత్సలో భాగంగా చేరుస్తున్నాయి. యోగా థెరపీని పూర్తి విశ్వాసంతో అమలు చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ప్రతి రుగ్మతకూ యోగాలో పరిష్కారం బల్లగుద్ది చెబుతున్నాయి. మరి మీరు యోగ సాధనతో మీ ఆరోగ్యాన్ని జయించండి!