BREAKING NEWS

"జల చక్రం" తిరగనిద్దాం

                         నీటి కొరత , దేశ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య.  ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ల నుంచి విశాఖ వంటి నగరాలు, చివరకు పల్లెలలో సైతం నీటి ఎద్దడి సమస్య ఉందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదివరలో కరువు ప్రాంతాలు అని కొన్ని జిల్లాలను వర్షపాతం, పంటలకు నీటి లభ్యత మున్నగు అంశాలపై ఆధారపడి నిర్ణయించేవారు.

కానీ నేడు, నీటి  ఎద్దడి లేని ప్రాంతాలు దాదాపుగా కనబడడం లేదంటే అతిశయోక్తి కాదు.  తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకప్పుడు రాయలసీమ దగ్గర నుంచి, నేడు కోస్తా జిల్లాలు , తెలంగాణా కూడా ఎప్పుడూ నీటికొరతతో అలమటిస్తున్నాయి. ఎవరింట్లో వారు నుయ్యి త్రవ్వుకుని మంచి నీళ్లు త్రాగడానికి, ఇతర అవసరాలకు వాడుకునే స్థితి నుండి ప్రతి ఇంటికీ నీటి సరఫరా చేయడమే ప్రభుత్వాల అతి‌పెద్ద అజెండాగా, అలా ఇవ్వడమే అతి ఘన కార్యంగా చెప్పుకునేలా నేటి "నీటి" స్థితి అడుగంటింది. త్రాగునీరు కొనుక్కోవడం ఎప్పుడో అలవాటైన మనకి ఇప్పుడు వాడుకోవడానికి కూడా నీటి‌కొరత ఎదుర్కోవడానికి శక్తి చాలదు. 

                       ఇలా నీటి సమస్యలు రావడానికి కారణాలనేకం. ముఖ్యంగా భూగర్భ జలాలు, చెరువులు, సెలయేళ్లు, నదులు వంటి ప్రవాహాలు ప్రధాన జల వనరులు. అయితే సూర్యుడి వేడికి, సముద్రాలు, నదులు నుండి నీరు ఆవిరి అయ్యి, మేఘాలుగా ఏర్పడి తిరిగి చల్లటి గాలి తగిలినప్పుడు వర్షంగా కురిసి మళ్లీ నదులను, చెరువులను నింపుతుంది. కొంత వర్షం భూమి లోకి మట్టి ద్వారా ఇంకి భూగర్భజలం గా మారుతుంది. ఆ విధంగా మనం  వాడుతున్న నీరు తిరిగి భర్తీ చేయబడాలి. దీనినే "జల చక్రం" లేదా " హైడ్రలాజికల్ సైకిల్ " అంటారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితేనే నీటి వనరులు సమృద్ధిగా కళకళలాడతాయి. కానీ,,,,,
                       ఇక్కడే అసలైన చిక్కు వచ్చింది. ఈ జలచక్రానికి అడుగడుగునా మనమే అడ్డు పడుతున్నాం. ఎప్పుడైతే చెట్లు కొట్ఠడం మొదలయ్యిందో అప్పుడే ఈ "చక్రానికి" బ్రేకులు పడడం మొదలయ్యింది.  అవసరానికి మించి విపరీతంగా చెట్లు నరికేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి " వర్షపాతం " తగ్గిపోతోంది‌. దీంతో నీరు ఆవిరవ్వడమే తప్ప తిరిగి వర్షం రూపంలో భూమిని చేరడంలేదు‌. ఇక చెట్లు లేకపోతే భూగర్భ జలాలూ ప్రభావితం అవుతాయి. అలాగే చెరువులు, కొలనులు సైతం ఆక్రమించి, ఎక్కడా మట్టి జాడ లేకుండా అపార్ట్మెంట్స్ ఇబ్బడిముబ్బడిగా కట్టేయడం వల్ల నీరు నిలవడానికి స్థలమే లేకుండా చేస్తున్నాం. ఇక భూగర్భంలోకి ఏం ఇంకుతుంది ?     పెరుగుతున్న జనసాంద్రత అంటే ఒకే ప్రాంతంలో అత్యధిక జనాభా కూడా నీటిఎద్దడికి మూలమే.  అవసరం లేకపోయినా ఒకే దగ్గర కట్టే 30, 40 అంతస్తుల ఆకాశహర్మ్యాల వల్ల భూగర్భ జల వేగం కన్నా నీటి వినియోగం విపరీతంగా పెరిగి నీటి కొరత ఏర్పడుతోంది. 

దీనికి తోడు ఎప్పటికీ జీర్ణం కాని "ప్లాస్టిక్" వ్యర్థాలు పొరలుగా ఏర్పడి భూగర్భానికి చేసిన అజీర్తి వల్ల "నీరు" కూడా లోనికి దిగడం లేదు‌. ఇక భూగర్భ జలాలు ఎలా వృద్ధి అవుతాయి ? ఇక నదుల విషయానికి వస్తే పారిశ్రామిక వ్యర్థాలతో ఎప్పటి నుంచో కలుషితం అయిపోతున్నాయి. ఉన్న కాస్త నీటిని అయినా పొదుపుగా వాడుతున్నామా అంటే వృధాయే ఎక్కువ. ఇన్ని కారణాల వల్ల "వాటర్ సైకిల్" పూర్తవ్వక ఇప్పటి నీటి కష్టాలు తారస్థాయి కి చేరుకున్నాయి.

                   పైన చెప్పుకున్నవన్నీ మానవ సంబంధిత కారణాలే. కాబట్టి వాటి పరిష్కారాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడైనా చెట్లు కొట్టాల్సి వస్తే అందుకు చెట్లకు కూడా మనుషుల లాగే పునరావాసం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో, ఇళ్ల ల్లో కూడా నీటిని సమర్ధంగా, అవకాశం ఉన్నంత మేర రీసైక్లింగ్ అయ్యే‌ టెక్నాలజీస్ వాడచ్చు. ప్రభుత్వం కూడా నీటి నిర్వహణ, వాడకం విషయాలలో ఖచ్చితమైన, కఠినమైన ప్రమాణాలు పాటించాలి. 

                    లేదంటే ప్రకృతికి ఏమీ నష్టం లేదు. "కాస్త" ఆలస్యంగానైనా " నీటి చక్రం" తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ "చక్రం" కి అడ్డం వచ్చిన మనం దాని కింద పడి నలిగిపోతాం. కొన్ని శతాబ్దాల తర్వాత "సృష్టి" మళ్లీ కొత్తగా మొదలవుతుంది... అలా జరగకుండా ఉండాలంటే మనుషులు స్వార్ధం వీడి , ప్రకృతికి కృతజ్ఞత తో, ఎవరి పరిధి‌లో వారు చిత్తశుద్ధితో జలసంరక్షణ పద్ధతులు అవలంభించాలి. అలా జరుగుతుందని ఆశిద్దాం....

Photo Gallery