BREAKING NEWS

గ్రంథాలయాలు - విజ్ఞాన భాండాగారాలు

       "చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో" అన్నారు కందుకూరి వీరేశలింగం. ఈ ఒక్క మాట చాలు. పుస్తకాలకు ఆయన ఇచ్చే విలువ ఏమిటో అర్థం చేసుకోవడానికి. మంచి బుక్స్ లో దొరికే అంత విజ్ఞానం మరెక్కడా దొరకదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కథా సంపుటి దగ్గర నుంచీ అంతరిక్ష విజ్ఞానం వరకు ఎన్నో రకాల పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఎంతో మంది మేధావుల అనుభవ సారం మొత్తం అలాంటి పుస్తకాల్లో లభిస్తుంది. ఎవరో ఒక్కరి దగ్గరే పుస్తకాలు అన్నీ ఉంటే మిగిలిన వారికి ఎలా అందుతాయి...సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో ఏర్పాటు అయినవే "లైబ్రరీ"లు. అసలు ఇంతకీ లైబ్రరీలు హిస్టరీ ఏంటి??? పుస్తకాలు ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా ఉందా??? ఓసారి చూద్దామా...

                        1911 లో విజయవాడ లో  గ్రంథాలయాల స్థాపన కోసం అయ్యంకి వెంకట రమణయ్య ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత తనకున్న 400 ఎకరాలను గ్రంథాలయ నిర్మాణం కోసం ప్రభుత్వానికి దానం ఇచ్చారు. దీంతో గ్రంథాలయ పితామహుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ గ్రామం పర్యటించి గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ కూడా ఇచ్చారు.  సుప్రసిద్ధులైన ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని 1968 నుంచి ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలను కూడా నిర్వహిస్తుంటారు.

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథాలయ పరీక్షలో అయ్యంకి పేరు మీద స్వర్ణ పతకం కూడా అందిస్తున్నారు. ఇదీ లైబ్రరీ వెనుకున్న చరిత్ర..   మనకు సాధారణంగా బయట మార్కెట్ లో దొరకని, కనీసం చూడలేని ఎన్నో అరుదైన పుస్తకాలు కేవలం లైబ్రరీ లో మాత్రమే చూడచ్చు. అందుకేనేమో పుస్తకాల ప్రియులు ఎప్పుడూ లైబ్రరీలు చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. విశాఖలో 1927లో స్థాపించిన వి.ఎస్.కృష్ణా గ్రంథాలయంలోనే దాదాపుగా 5 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయంటే పుస్తకాల పై ఉన్న శ్రద్ధ , ఆసక్తి అర్థం చేసుకోవచ్చు. అన్ని రకాల పుస్తకాలు ఈ లైబ్రరీలో దొరుకుతాయి. 

దేశంలోనే టాప్‌ లైబ్రరీలలో మన డా.వి.ఎస్‌.కృష్ణా లైబ్రరీ ఒకటి. చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే అపురూపమైన పుస్తకాలెన్నో ఈ లైబ్రరీలో మనం చూడవచ్చు. ఇటువంటి విశేషాలు ఎన్నో అడుగడుగున ఇక్కడ కనిపిస్తాయి. ఇక 2.2 మిలియన్ల కంటే ఎక్కువ పుస్తకాలతో కోల్కతా లోని "నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా" రికార్డులకెక్కింది... 

                       అచ్చు యంత్రం కనిపెట్టక ముందు రాసిన తాళపత్ర గ్రంథాలు, మ్యాథ్స్ జీనియస్ శ్రీనివాస్ రామానుజన్ చేతి రాతతో ఉన్న పుస్తకం, చేతితో రాసిన భారత రాజ్యాంగం , 400 సంవత్సరాల క్రితం పుస్తకాలను భద్ర పరిచే విధానం. ఇలా ఒక్కటేమిటి ఎన్నో మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలి అంటే, కళ్ళారా ఆ అద్భుతం చూడాలి అన్నా లైబ్రరీలు ఒక్కటే మనకు ఉన్న ఆప్షన్... ఎంతో మంది ఔత్సాహికులు తమ దగ్గర ఉండే అపురూప పుస్తకాలను లైబ్రరీ కి ఇస్తుంటారు కూడా. కొన్నాళ్ళ క్రితం వరకు పుస్తకాలు చదవాలి అంటే కేవలం ప్రింటెడ్ పుస్తకాలు మాత్రమే ఆధారం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి పుస్తకాలు చదివే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు లైబ్రరీలు ఎక్కువగా కాలేజీల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. 

                        ఇది వరకు మనకు కావల్సిన పుస్తకం కావాలి అంటే దగ్గర్లో ఉన్న లైబ్రరీకి వెళ్లి ర్యాక్ లో పుస్తకం వెతుక్కుని తెచ్చుకునే వాళ్ళం. మరి ఇప్పుడో సింపుల్ గా "గూగుల్ బుక్స్ , కిండల్, వికిసోర్స్" అంటూ ఆన్లైన్ లో సింగిల్ క్లిక్ తో డౌన్ లోడ్ చేసేసుకుంటున్నాం. అయితే ఈ పద్ధతి వలన లాభ నష్టాలు రెండూ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా బుక్స్ చదువుకోగలగడం లాభం అయితే పుస్తకం చదివే అనుభూతిని పొందలేకపోవడం ఒక నష్టం.

కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద చదువుకునే అక్షరాలు కన్నా నేరుగా పుస్తకాలలోని అక్షరాలు చదివితే వచ్చే అనుభూతి వేరు. కళ్లకు కూడా ఎక్కువ అలసట తెలియదు. చదివింది చాలా త్వరగా అర్థం అవుతుంది కూడా.. టెక్నాలజీని కాదనలేం. కాబట్టి వీలైనంత వరకు దగ్గర్లోని లైబ్రరీలకు వెళ్లి పుస్తకాలు చదవండి. అక్కడ కూడా మీకు కావల్సింది దొరక్కపోయినా, దగ్గర్లో లైబ్రరీ అందుబాటులో లేకపోయినా అప్పుడు మాత్రమే ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోండి...

Photo Gallery