BREAKING NEWS

ఛాయ్ చటుక్కున తాగరా భాయ్

       ఉదయం లేచిన వెంటనే "అది" లేనిదే రోజు ప్రారంభం కాదు. పొరపాటున ఒక్కరోజు "దానిని" మిస్ అయితే మనసు మనసులా ఉండదు. తాగేంత వరకు ఎదో కోల్పోతున్న ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క సిప్ చేశామంటే చాలు... నూతనోత్సాహం మనలో రెట్టింపు అవుతుంది.

ఇంతకీ అదేంటో చెప్పకుండా టైమ్ వేస్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అబ్బా... అదేనండి తెలుగులో తేనీరు, ఇంగ్లీష్ లో టీ, హిందీలో ఛాయ్... ఏదైతేనేం ప్రస్తుత ట్రెండ్ లో టీతో పాటు కాఫీలు కూడా తెగ తాగేస్తున్నారు కుర్రాళ్లు... అది కూడా రకరకాలు...

            "ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌... ఛాయ్‌ చమ్మక్కులే చూడరా భాయ్‌..." మెగాస్టార్‌ చిరంజీవి పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్‌,. ఈ పాటలో ఛాయ్ ప్లేస్ లో కాఫీ అని కూడా యాడ్ చేసుకుని పాడేసుకోండి... ఎందుకంటే ఈ కాఫీ , టీ లో ఉండే మ్యాజిక్కే వేరు. ఓ కప్పు ఛాయ్‌ / కాఫీ తాగితే మనకు వచ్చే కిక్కే వేరు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా సరే  ఎనర్జీ కావాలంటే వేడి వేడిగా ఓ కప్పు తాగేయల్సిందే... ఛాయ్‌/కాఫీ అలా సిప్‌ చేస్తే చాలు... అవన్నీ వెంటనే మాయమయిపోతాయి. ఇప్పుడు ప్రత్యేకంగా టీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం...

                ఒకప్పుడు టీ తాగాలి అంటే ఊర్లో ఉండే టీ కొట్టుకు వెళ్ళేవాళ్ళు. కాలం మారింది. కొన్నాళ్ల తర్వాత ఏదైనా హోటల్‌కు వెళ్లి కూడా టీ తాగేవాళ్లు. అలా ఎక్కడికి వెళ్ళినా  మహా అయితే అక్కడ ఓ నాలుగైదు వెరైటీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకటి రెండు కాదు... ఏకంగా 50 రకాల టీ ఫ్లేవర్స్‌ మీ నోరూరించడానికి రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఏమి"టీ" స్పెషాలిటీ అంటారా! ఇప్పుడిప్పుడే పెద్ద నగరాల్లో విస్తరిస్తున్న లేటెస్ట్ కల్చర్ ఈ వెరైటీ టీ వ్యాపారం. ఒక్క ఐడియా చాలు. మీ జీవితాన్ని మార్చేయడానికి... అలా వచ్చిన ఆలోచనలతోనే ఇప్పుడీ టీ కేఫ్ లు దూసుకుపోతున్నాయి. 

              సాధారణంగా మార్కెట్‌లో మనం ఎక్కడకు వెళ్లినా దొరికేది అల్లం టీ, ఇలాబీ టీ, మసాలా టీ ఇలా కొన్ని రకాలు మాత్రమే. కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న ఈ టీ కేఫ్ లలో 50 రకలుకు పైగా ఫ్లేవర్స్‌లో టీ దొరుకుతుంది. ఊలాంగ్‌, వైట్‌ టీ, గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, హెర్బల్‌ టీ, హై బిస్కస్‌ టీ, రెడ్‌ టీ...... అబ్బో ఒకటా, రెండా.. చెప్తూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఇవన్నీ టీ లో ఉండే రకాలైతే ఒక్కో రకంలో మళ్లీ మరికొన్ని రకాల ఫ్లేవర్స్‌ ఉంటాయి. అలా
దాదాపుగా 50 రకాలుకుగా పైగా రుచులు టీ లవర్స్ ని అట్రాక్ట్ చేసేస్తున్నాయి.. కేఫ్ ల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. 

                 అలాగే గ్రీన్‌ టీలోనే 'మాచా” అనే స్పెషల్‌ టీ ఉంది. అన్నింటి కన్నా ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయిట. కాస్త ధర కూడా ఎక్కువే.. సాధారణంగా తేయాకు తోటల నుంచి ఆకులను దాదాపు నాలుగు సార్లు కట్‌ చేస్తారు. మొదటిసారి కట్‌ చేసినప్పుడు ఉన్నంత క్వాలిటీ, స్ట్రాంగ్‌నెస్‌ నాలుగోసారి కట్‌ చేసేసరికి ఉండదు. అలాగే ఫస్ట్‌ టైం తీసిన ఫైన్‌ క్వాలిటీ తేయాకు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా టీ తాగే అలవాటు ఉన్న వారికి టైం అయ్యే సరికి టీ తాగకపోతే ఇక ఆ రోజంతా ఏదో డల్‌గా ఉన్నట్లే అనిపిస్తుందనీ తెలుసు కదా ..

అయితే అది టీ వల్ల కాదు. అందులో ఉండే కెఫీన్‌ వల్ల. కానీ ఏదైనా మితంగా తీసుకుంటే ఔషధంలా పని చేస్తుంది. కొంత డోస్‌ దాటితే ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే టీలోని కొన్ని రకాలైన గ్రీన్‌, వైట్‌, ఊలాంగ్‌, బ్లాక్‌ టీలలో ఎంతో కొంత ఆరోగ్యం దాగి ఉందని చెప్తున్నారు.. మామూలు టీతో పోల్చి చూస్తే వీటిలో కెఫీన్‌ లెవెల్స్‌ చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. అలాగే వీటిలో యాంటీ యాక్స్‌డెంట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో కూడా ఒక దానితో ఒకటి పోల్చినప్పుడు కూడా వాటి లెవెల్స్‌ మారుతూ ఉంటాయి.

            ఈ టీ కేఫ్ లలో అలా వచ్చి నార్మల్ గా తాగేసి వెళ్లిపోతే మజా ఏముంది. అందుకే  ఇక్కడకు వచ్చే కస్టమర్లకు కేవలం టీ మాత్రమే అందుబాటులో ఉంచితే ఎలా? అందుకే ఇలాంటి కేఫ్ లు కేవలం టీ షాప్స్ గా మాత్రమే కాదు. ఇప్పటి కుర్రకారుకు ఒక చక్కని హ్యాంగాట్‌ ప్లేస్‌ కూడా. టీ ఆర్డర్‌ చేస్తే కనీసం 10 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకు? అందుకే కొన్ని కేఫ్ లలో  బుక్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి... హ్యాపీగా చదువుకోవచ్చు. అది కూడా బోర్‌ కొడితే ఫ్రీ వైఫైతో నెట్‌ బ్రౌజ్‌ చేసుకోవచ్చు. లేదా మ్యూజిక్‌ వినచ్చు. సో.. ఇదండీ ఈ టీ కథా కమామీషు.. మీకు కూడా స్పెషల్ టేస్ట్ రుచి చూడాలి అంటే మీకు దగ్గర్లోని టీ కేఫ్ లు సెర్చ్ చేసేయండి మరి...
 

Photo Gallery