BREAKING NEWS

ఈ బడ్జెట్ లో మనకెంటీ???

యూనియన్ బడ్జెట్, ప్రతి సారీ ఈ బడ్జెట్ కి ముందు సామాన్యులు ఎన్నో ఆశలతో ఉంటారు.. బయటకి వెళ్లి వచ్చే తండ్రి ఏమి‌ తీసుకువస్తాడా అని ఎదురు చూసే పిల్లలలాగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా మధ్య తరగతి వారు, ఉద్యోగులు కోరుకునేది నిత్యావసర ధరల తగ్గుదల మరియు పన్ను పరిమితి పెంపు... అంతే... తమకు మేలు చేసే ఇటువంటి ప్రతిపాదనలు ఏమైనా చేస్తారేమోనని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే వారికి‌ ఎక్కువ సమయాలలో నిరాశే ఎదురవుతుంటుంది. ఈసారి కూడా ఒక రకంగా నిరాశే‌ అనుకోవచ్చు. 

                  ఈసారి కూడా వ్యక్తిగత ఆదా పన్ను పరిధిలో ఎటువంటి సడలింపు ఇవ్వలేదు. పైగా బంగారం, పెట్రోల్ మొదలు సబ్బుల ఇలా దాదాపు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయి. ముఖ్యంగా డీజిల్ రేట్ల ప్రభావం పరోక్షంగా మిగతా అన్ని వస్తువుల మీద పడుతుంది. కార్పొరేట్ పన్ను ఆదాయ పరిమితి  మాత్రం ఏటా 250 నుంచి 400 కోట్ల కు పెంచడం (25% పన్ను రేటు) విశేషం. అలాగే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించి, ఉద్యోగ భద్రతను ఇచ్చేవి ప్రభుతైవ రంగ సంస్థలు.

ఎంతో మంది సామాన్య విద్యార్థులు ఈ ఉద్యోగ సాధనే లక్ష్యంగా కృషి చేస్తుంటారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి దోహదపడాల్సింది పోయి,  లాభాలలో ఉన్న సంస్థల వాటాలు సైతం, అది కూడా 51శాతం కన్నా అధికంగా, అకారణంగా అమ్మేయాలనుకోవడం కూడా అత్యధిక ప్రజల ఆశలకు గండి కొట్టేదే... కాకపోతే గృహ నిర్మాణం లో 45లక్షల లోపు ఇంటి కొనుగోలుకి ఇచ్చే 1.5 లక్షలు ఒక్కటే అతిచిన్న సానుకూలాంశం.  అయితే దీర్ఘకాల ప్రయోజనాల కోసం  అని చెప్తున్న ఈ బడ్జెట్ లో రైతులకు, నీటి పరిరక్షణకు అధిక కేటాయింపులు చేయడం మంచి పరిణామం.

                  ఇక మన ఆంధ్ర ప్రదేశ్ కేటాయింపుల విషయానికి వస్తే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రత్యేక హోదా విషయం పక్కన పెడితే, అసలు విభజన హామీలకి సంబంధించి గానీ, ఆర్థిక లోటు భర్తీకి గానీ, రాజధాని అమరావతి నిర్మాణానికి గానీ, కనీసం జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం గురించి గానీ కేటాయింపులు కాదు కదా, కనీసం మాట మాత్రమైనా ప్రస్తావన లేకపోవడం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే అని చెప్పొచ్చు. మరి కేంద్రానికి ఎప్పుడూ దక్షిణాది, అందులోనూ, ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత బేఖాతరో సగటు ఆంధ్రుడికి ఎప్పటికీ అర్థం కాని విషయమే.... మరి మనకు జరిగిన అన్యాయానికి మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో ఏ విధంగా పోరాడి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటారో, వేచి చూడాలి....

                  రహదారుల నిర్మాణం, అభివృద్ధి, ప్రయోజనాల దృష్టి మంచిదే అయినా, అత్యధిక మంది ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం... ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ అత్యధికులు ఎన్నుకొన్నవే, అదే ప్రజాస్వామ్యం..           
              ఒకవేళ ఆ ఆకాంక్షలు నెరవేర్చలేని పక్షంలో తాము ఎందుకు వాటిని పరిగణనలోనికి తీసుకోలేదు, ఏ కారణం చేత ఈ విధమైన బడ్జెట్ పెట్టవలసి వచ్చింది మొదలగు అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా సవివరంగా తెలియజేసి వారిని సంతృప్తి పరచవలసిన బాధ్యత ప్రభుత్వంపై కచ్చితంగా ఉన్నది. అలా లేని నాడు రాచరికానికి, ప్రజాస్వామ్యానికి పెద్ద తేడా ఏమీ ఉండదు..... !!!

Photo Gallery